Thursday, January 9, 2025

బియ్యం ఎగుమతులపై నిషేధం.. అమెరికాలో ఎన్‌ఆర్‌ఐల పాట్లు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : దేశీయంగా బియ్యం ధరలను అదుపు చేయడానికి బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో అమెరికాలో గందరగోళానికి దారి తీసింది. బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడంతో విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఉన్న భారతీయులు బియ్యం కోసం పోటీ పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ ధరలు పెరుగుతాయోనన్న భయంతో చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు ముందుగానే సూపర్ మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు.

అమెరికాతోపాటు కెనడా లోనూ నివసించే భారతీయులు ముఖ్యంగా అన్నం ఆహారంగా తీసుకునే దక్షిణ భారతానికి చెందిన వారు బియ్యం కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. చాలా స్టోర్ల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. కొందరు కొన్ని నెలలకు సరిపడే బియ్యాన్ని కొనుగోలు చేయడానికి కార్లలో స్టోర్లకు చేరుకున్నారు. దీంతో కొన్ని చోట్ల క్యూలైన్లు కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల బియ్యం కోసం సూపర్ మార్కెట్లలో ప్రజలు ఎగబడుతున్న దృశ్యాలు బయటకొచ్చాయి. ఒక్కొక్కరూ పదుల సంఖ్యలో రైస్ బ్యాగులను కార్లలో వేసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.

ఇదే అదునుగా అమెరికా లోనూ అక్కడి సూపర్ బార్కెట్లు కొన్ని బియ్యం ధరలను భారీగా పెంచేశాయి. 18 డాలర్లుగా ఉండే 20 పౌండ్ల బియ్యం బ్యాగ్ ధరను ఏకంగా 50 డాలర్లకు పెంచి విక్రయిస్తున్నట్టు పలువురు ఎన్‌ఆర్‌ఐలు పోస్టులు పెడుతున్నారు. మరికొన్ని చోట్ల ఒకరికి ఒక బ్యాగే ఇస్తామంటూ కొన్ని స్టోర్లు నోటీస్ బోర్డును ఏర్పాటు చేస్తున్నాయి. బియ్యం ఎగుమతి నిషేధ సమాచారం రాగానే స్థానిక దిగుమతి దారులు , సూపర్ మార్కెట్లు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News