Saturday, December 21, 2024

రాష్ర్టానికి కేంద్రం వడ్డీలేని రుణం

- Advertisement -
- Advertisement -
మూల ధన పెట్టుబడి కోసం రూ. 2,102 కోట్లు మంజూరు
ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్ : గత కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ప్రత్యేక సహాయ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మొత్తం 16 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మూలధన పెట్టుబడిని ప్రకటించింది. ఈ మొత్తం రూ.56,415 కోట్లు. మూలధన పెట్టుబడి ప్రతిపాదనలకు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో, రాష్ట్ర స్థాయిలో మూలధన వ్యయాన్ని ప్రోత్సహించడానికి, ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్’ ప్రకటించారు.

ఈ పథకం కింద, 2023–24 ఆర్థిక సంవత్సరంలో 50 సంవత్సరాల వడ్డీ రహిత రుణం రూపంలో రాష్ట్రాలకు రూ.1.3 లక్షల కోట్ల వరకు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రూ.56,415 కోట్లు విడుదల చేస్తున్నారు. కొవిడ్ అనంతరం అన్ని రాష్ట్రాలు తమ మూలధన వ్యయాలను పెంచాలన్న ఉద్దేశంతో 2020–21 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రూ.2,102 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులు అందిన రాష్ట్రాలు ఈ మొత్తంతో విద్య, వైద్యం, నీటి పారుదల, మంచినీటి సరఫరా, విద్యుత్, రహదారులు వంటి వాటి కోసం వినియోగించుకోవచ్చు. ఈ పథకం కింద నిధులు అందుకోనున్న రాష్ట్రాల్లో దక్షిణాది నుంచి తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు ఉండగా కేరళ, ఏపీ మాత్రం ఈ జాబితాలో లేవు. అత్యధికంగా బీహార్ రాష్ట్రానికి మాత్రం రూ. 9,640 కోట్లు కేంద్రం మంజూరు చేసింది.

2022–23 ఆర్థిక సంవత్సరానికి ఇదే తరహా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద రూ.95,147.19 కోట్లకు ఆమోదం తెలపగా రూ.81,915.35 కోట్లు ఆ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించే ఈ పథకం మొదట 2020–21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్- మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మూలధన వ్యయానికి మద్దతుగా నిలుస్తున్న ప్రధానమంత్రి మోడీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈనిర్ణయం ఆస్తుల సృష్టికి, ఉపాధి అవకాశాల సృష్టికి రాష్ట్రాభివృద్దిని వేగవంతం చేయడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News