Monday, December 23, 2024

రాష్ట్రానికి నిధులను నిలిపివేసిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

నంగునూరు : తెలంగాణలో రైతుల బావిల వద్ద మోటర్లకు మీటర్లు పెట్టొద్దని సిఎం కెసిఆర్ తేల్చి చెప్పడంతో రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని, రాష్ట్ర ఆర్థిక శాఖకు రావాల్సిన కేంద్ర నిధులను బిజేపి నిలిపివేసిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. సిద్దిపేట నియోజకవర్గం నంగునూరు మండలంలోని గట్లమల్యాల గ్రామంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. గట్లమల్యాల గంగిరెద్దుల కాలనీలో 40 వేల లీటర్ల సామర్థం కలిగిన వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించారు. అనంతరం సామూహిక గొర్రెల షెడ్‌ని ప్రారంభించి, లబ్ధిదారులకు సాంప్రదాయంగా బట్టలు బహుకరించారు.

అనంతరం తాత్కాలిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడారు. సిఎం కెసిఆర్ నాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నంగునూడు మండలం వాగు అవతలి గ్రామాలకు రోడ్డు సౌకర్యం కోసం వారం పది రోజులు ఇక్కడే ఉండి వాగు పై బ్రిడ్జి ఏర్పాటు చేసి ఐదు గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగిందని మంత్రి గుర్తు చేశారు. నాడు వర్షాకాలం వచ్చిందంటే వాగు అవతలి గ్రామాలు జల దిగ్భందంలో ఉండేవి అన్నారు. సిఎం కెసిఆర్ సారధ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి బాటలో సాగుతుందన్నారు.

సిఎం కెసిఆర్ దయతో నేడు గట్లమల్యాల గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కోసం రెండు కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. మండల కేంద్రమైన నంగునూరు నుంచి ఖాతా వరకు డబుల్ లైన్ రోడ్డు వేసుకున్నామని, విద్యుత్ సబ్ స్టేషన్‌లు, పెద్ద వాగు పై 7 చెక్ డ్యాంలు నిర్మించుకున్నామని తెలియజేశారు. పెద్ద వాగు పై చెక్ డ్యాంల నిర్మాణంతో బోరు బావుల్లో ఊటలు పెరిగాయని అన్నారు. ఈ యాసంగిలో కాళేశ్వరంలో నీళ్లు తెచ్చి పెద్ద వాగులో నీళ్లు నింపుతామని మంత్రి పేర్కొన్నారు.

ఈ కారక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సంస్థ వైస్ ఛైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, మాజీ ఎంపిపి జాప శ్రీకాంత్ రెడ్డి, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అనగోని లింగం గౌడ్, రైతుబంధు మండల అధ్యక్షులు బద్దిపడగ కృష్ణారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News