న్యూఢిల్లీ: ఘాటెక్కుతున్న ఉల్లిధరలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఉల్లి కనీస ఎగుమతి ధరను టన్నుకు 800 డాలర్లుగా నిర్ణయించింది. డిసెంబర్ 31 వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని కేంద్రం తెలిపింది. దేశీయంగా ఉల్లి అందుబాటులో ఉండేలా చూడడంతో పాటుగా ధరలను అదుపులో ఉంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ శనివారం ఒకనోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నెల 29 (ఆదివారం)నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఘాటెక్కుతున్న విషయం తెలిసిందే.
ఉల్లినాట్లు ఆలస్యంగా పడడం, సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పాటు సాగు విస్తీర్ణం తగ్గడం, దిగుబడి వచ్చేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడంతో దేవీయ మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.65 80 వరకు పలుకుతోంది. ఇకామర్స్ సంస్థలు, రిటైల్ స్టోర్లలో రూ.67 చొప్పున విక్రయిస్తుండగా, చిన్న చిన్న విక్రేతలు రూ.80 చొప్పున అమ్ముతున్నారు. హైదరాబాద్‌లోనూ ఉల్లి ధర కిలో రూ.80 దాకా పలుకుతోంది. ధరల కట్టడికి చర్యలు తీసుకొంటున్న కేంద్రం ఇప్పటికే బఫర్ స్టాక్‌నుంచి ఇప్పటివరకు 1.70 లక్షల టన్నులు విడుదల చేసింది.