Sunday, December 22, 2024

17పంటలకు మద్దతు ధరలు ఖరారు

- Advertisement -
- Advertisement -

Central Government increased MSP for rice by Rs 100

ఖరీఫ్ పంటలకు మద్దతు ధరల ఖరారు
వరికి రూ 100 పెంపు …నువ్వులకు రూ 523
కేంద్ర మంత్రి మండలి ఆమోదం
విత్తనం నుంచి విఫణి దాకా సాయం

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం వరికి కనీస మద్దతు ధరను 2022-23 సంవత్సరానికి క్వింటాలుకు రూ 100 పెంచింది. దీనితో వరి మద్దతు ధర ఇక క్వింటాలుకు రూ 2,040 కానుంది. వరి వేసవిలో వేసే 14 రకాల ఖరీఫ్ పంటలకు ఈ ఏడాదిలో మద్దతు ధరలను పెంచే నిర్ణయానికి బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఆమోదం తెలిపారు. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా వరి పంట సాగు విస్తీర్ణం పెంచడం, వరి వేసే రైతుల ఆదాయం పెంచడానికి ఈ పెంపుదల నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు. పంటల వైవిధ్యతను పెంచడం అత్యంత కీలకమైన విషయం. ఈ దిశలో వివిధ రకాల పంటలకు ఎంఎస్‌పిని పెంచాలని నిర్ణయించినట్లు, ఖరీఫ్ పంటలపై మద్దతు ధరలను పెంచుతున్నట్లు కేంద్రం తెలిపింది.

మోడీ నాయకత్వపు ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని సకల స్థాయిల్లో ఇతోధికంగా వృద్ధిలోకి తీసుకురావాలని సంకల్పించిందని, ఈ దిశలో బీజ్ సే బజార్ తక్ ( విత్తనాలు మొదలుకుని మార్కెట్ ) వరకూ సరైన ప్రోత్సాహ చర్యలు తలపెట్టినట్లు , రైతాంగ ఆదాయం పెరిగే దిశలో చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. 14 రకాల ఖరీఫ్ పంటలకు రూ 92 నుంచి రూ 523 వరకూ వివిధ స్థాయిల్లో హెచ్చుదల ఉన్నట్లు అధికారికంగా వివరించారు. అత్యధిక పెంపుదల నువ్వులకు, అత్యల్ప పెంపుదల మొక్కజొన్నలకు వర్తింప చేశారు. నువ్వులకు క్వింటాల్‌కు రూ 523 వరకూ పెంచగా , మొక్కజొన్నలకు రూ 92 వరకూ పెంచారు. క్వింటాల్ లెక్కన కేంద్రం ఖరీఫ్ పంటలకు ప్రకటించిన కనీస మద్దతుధరల పెంపుదల ఈ విధంగా ఉంది. క్వింటాలుకు రూ వంద చొప్పున పెరిగిన పంటలలో వరి, సజ్జలు ఉన్నాయి.

వరి సాధారణ గ్రేడ్‌కు రూ వంద చొప్పున పెంచారు. ఇంతకు ముందు ఏడాది రూ 1,940 ఉండగా ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రూ 2,040 అయింది. ఇక ఎ గ్రేడ్ రకం వరి ధరలు ఇంతకు ముందు రూ 1,960 ఉండగా ఇది పెంపుదలతో రూ 2060 అవుతోంది. దేశంలో వరి ఖరీఫ్ పంటలలో అత్యధిక వాటాలో పండిస్తారు. ఈసారి వరి దిగుబడిని పెంచే దిశలో మద్దతు ధరలను పెంచాలని నిర్ణయించారు.

పప్పు ధాన్యాల మద్దతు ధరల పెంపు వివరాలు

దేశంలో అత్యంత వాడకంలో ఉండే కందుల ధరలను క్వింటాలుకు రూ 300 చొప్పున పెంచారు. దీనితో ఇంతకు ముందు క్వింటాలుకు రూ 6300గా ఉన్న ధర రూ 6600 అవుతుంది.

మినుములపై కూడా రూ 300 పెంచారు. దీనితో క్వింటాలకు ఇంతకు ముందు పలికిన రూ 6300 ధర రూ 6600 అయింది. పెసర్లపై కనీన మద్దతు ధరలను రూ 480వరకూ పెంచారు.

ఇక వాణిజ్య పంటల విషయంలో పత్తికి మధ్యరకం పంటకు రూ 354 వరకూ పెంచారు. దీనితో పోయిన సంవత్సరం ఈ ధర రూ 5726 ఉండగా ఇది ఇప్పుడు రూ 6080 అయింది. పొడుగు రకం పత్తి ధరను ఇంతకు ముందు రూ 6025 ఉండగా దీనిని ఇప్పుడు రూ 6380గా ఖరారు చేశారు.

చమురు గింజల మద్దతు ధరల వివరాలు

సోయాబిన్ మద్దతు ధరను రూ 350 పెంచారు. ఇంతకు ముందు ఇది రూ 3950 ఉండగా దీనిని ఇప్పుడు రూ 4300 చేశారు. పొద్దుతిరుగుడు గింజలకు మద్దతు ధరలను ఇంతకు ముందు రూ 6015 ఉండగా ఇప్పుడు దీనిని రూ 6400 చేశారు. ఆవాల ధరలను ఇంతకు ముందు రూ 6930 ఉండగా దీనిని ఇప్పుడు క్వింటాలుకు రూ 7287 చేశారు. తృణధాన్యాల విషయానికి వస్తే రాగుల ధరలను మద్దతు ధర ఇంతకు ముందు రూ 3377 ఉండగా దీనిని ఇప్పుడు రూ 3578 ఖరారు చేశారు. ఇక జొన్నల రకాలలో హైబ్రిడ్ రకం ఇంతకు ముందు రూ 2738 ఉంది . దీనిని రూ 2970చేశారు. జొన్నలు మల్దానీ రకానికి ఇంతకు ముందు రూ 2758 ఉంది. దీనిని ఇప్పుడు రూ 2990 చేశారు .ఇప్పుడు మద్దతు ధరలు పెంచిన వాటిలో ఎనిమిది పంటలలకు ఎంఎస్‌పి వాటి సాగు వ్యయంతో పోలిస్తే ఒకటిన్నర శాతం ఎక్కువగా ఉంటాయని మంత్రి ఠాగూర్ తెలిపారు. మిగిలినవి 51 నుంచి 85 శాతం మధ్యలో ఉంటాయని వివరించారు. ఇప్పుడు ప్రకటించిన ఖరీఫ్ పంటల మద్దతు ధరలు 201415 సంవత్సరంతో పోలిస్తే మొత్తం మీద 46 131 శాతంవరకూ ఎక్కువగా ఉన్నాయని, ఇది మోడీ ప్రభుత్వ హయాంలో ఘనత అని మంత్రి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News