న్యూఢిల్లీ: ఒక మెడికల్ ప్రొఫెషనల్‌కు స్టేట్‌మెంట్ ఆఫ్ నీడ్ ఇచ్చేందుకు లంచం అడిగిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖలోని అండర్ సెక్రటరీని సిబిఐ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అమెరికాలో వైద్య శాస్త్రానికి చెందిన ఉన్నత విద్యను అభ్యసించేందుకు భారతీయ డాక్టర్లకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ స్టేట్‌మెంట్ ఆఫ్ నీడ్ జారీచేస్తుంది.
అమెరికాలో నివసిస్తున్న ఒక భారతీయ డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు అండర్ సెక్రటరీ సోను కుమార్‌ను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. ఆ డాక్టర్ ఆరోగ్య మంత్రిత్వశాఖలో స్టేట్‌మెంట్ ఆఫ్ నీడ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్టేట్‌మెంట్‌కు చెందిన ఒరిజినల్ హార్డ్ కాపీని ఇవ్వడానికి సోను కుమార్ రూ. 1.5 లక్షల లంచం కోరినట్లు డాక్టర్ ఫిర్యాదు చేశారు. ఆ డాక్టర్ తన ఫిర్యాదుకు తన మిత్రుడు ఒకరికి ఇమెయిల్ ద్వారా సోను కుమార్ పంపిన సర్టిఫికెట్ ప్రింట్‌ఔట్‌ను జతచేసినట్లు సిబిఐ ప్రతినిధి తెలిపారు.