కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : దేశంలో విద్యుత్, ఎరువుల తయారీకి వాడే సహజవాయువు రేట్లను కేంద్ర ప్రభుత్వం గురువారం రెండింతలు చేసింది. ఈ సహజవాయువును సిఎన్‌జిగా కొన్ని ఇళ్లకు పైపులైన్ల ద్వారా వంటింటి పనులకు వాడుతున్నారు.అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు విపరీతంగా పెరగడంతో ఇందుకు అనుగుణంగానే ఈ సిఎన్‌జి ధరలు పెంచేశారు. ఒఎన్‌జిసికి చెందిన అతి పెద్ద ప్రాచీన నియంత్రిత ఒఎన్‌జిసి చమురు క్షేత్రాలలో ఉత్పత్తి అయ్యే గ్యాసు ధరలు ఇప్పుడు మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు అత్యధిక స్థాయిలో 6.10 డాలర్లు చేశారు. ఇంతకు ముందు ఇది 2.90 డాలర్లుగా ఉండేది. పెరిగిన ధరల వివరాలను చమురు మంత్రిత్వశాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అనాలిసిస్ సెల్ (పిపిఎసి) తెలిపింది. ఇకపై పెరిగే సిఎన్‌జి , పైప్డు వంటగ్యాసు ధరలు వచ్చే ఆరు నెలల పాటు అమలులో ఉంటాయి. దేశంలో ఓ వైపు గత పదిరోజుల నుంచి వరుసగా పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. సిఎన్‌జి, పైప్డు వంటగ్యాసు ధరలు ఢిల్లీ , ముంబై వంటి నగరాలలో ఇప్పుడు 10 15 శాతం పెరుగుతాయి. ఇది ఇంతకు ముందెన్నడూ లేని హెచ్చింపుగా మారింది.