Friday, January 17, 2025

సీనియర్ ఐఎఎస్,ఐపిఎస్‌లకు కేంద్రం షాక్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఐఏఎస్, ఐపిఎస్‌ల కేడర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదమూడు మంది అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చిన కేంద్రం గతంలో కేటాయించిన రాష్ట్రానికే వెళ్లాలని స్పష్టం చేసింది. తెలంగాణలో ఉన్న ఐఏఎస్ అధికారులు వాణిప్రసాద్, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, ఆమ్రాపాలి, మల్లెల ప్రశాంతిలతో పాటు ఐపిఎస్‌లు అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిని ఎపికి వెళ్లాలని డిఓపిటి ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఐఏఎస్‌లు అనంతరాము, ఎస్‌ఎస్ రావత్, ఎల్.శివశంకర్, సృజన, హరికిరణ్‌లు తెలంగాణలో ఈనెల 16లోగా రిపోర్టు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.

2016లో ఐఏఎస్, ఐపిఎస్‌లకు అనుకూలంగా క్యాట్ తీర్పు
ఉమ్మడి రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపిఎస్‌లను 2014లో తెలంగాణ, ఎపి మధ్య విభజిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ఐఏఎస్ అధికారులు సోమేష్ కుమార్, వాణిప్రసాద్, రొనాల్ రోస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి, ప్రశాంతిలతో పాటు ఐపిఎస్‌లు అంజనీకుమార్, సంతోష్ మెహ్రా, అభిలాష బిస్త్, అభిషేక్ మొహంతిలను ఎపికి కేటాయించగా తెలంగాణకు ఐఏఎస్ అధికారులైన అనంతరాము, సృజన గుమ్మిళ్ల, ఎస్‌ఎస్ రావత్, ఎల్.శివశంకర్, సి.హరి కిరణ్‌లతో పాటు ఐపిఎస్ అధికారి ఏవి రంగనాథ్‌లను తెలంగాణను కేటాయించారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు విభజన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2014లో క్యాట్‌ను ఆశ్రయించారు. ఆ తర్వాత రంగనాథ్, సంతోష్ మెహ్రా తమ పిటిషన్‌లను వెనక్కి తీసుకున్నారు. మిగతా పిటిషన్‌లపై విచారణ జరిపిన క్యాట్ 2016లో అధికారులకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది.

2017లో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన డిఓపిటి
క్యాట్ తీర్పులను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని డిఓపిటి 2017లో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. మొదట పిటిషన్లపై వేర్వేరుగా విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సోమేష్ కుమార్ తెలంగాణ కేడర్‌ను రద్దు చేసి ఎపికి వెళ్లాలని గతేడాది జనవరిలో ఆదేశించింది.
మిగతా పిటిషన్‌లను కలిపి విచారణ జరిపిన హైకోర్టు అధికారుల అభ్యర్థనలు, అభ్యంతరాలను మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది మార్చిలో తీర్పు వెల్లడించింది.

ఐఏఎస్, ఐపిఎస్‌ల అభ్యర్థనలు, వాదనల పరిశీలన
హైకోర్టు ఆదేశాల మేరకు కేడర్ కేటాయింపుల పునఃపరిశీలన కోసం డిఓపిటి మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి దీపక్ ఖండేకర్‌ను కేంద్రం నియమించింది. దీపక్ ఖండేకర్ ఏకసభ్య కమిటీ ఐఏఎస్, ఐపిఎస్‌ల అభ్యంతరాలు, అభ్యర్థనలు, వాదనలను పరిశీలించారు. అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చి గతంలో డిఓపిటి నిర్ణయమే సరైనదని దీపక్ ఖండేకర్ సిఫార్సు చేసింది. కమిటీ సిఫార్సుల మేరకు తాజాగా డిఓపిటి తాజాగా ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఐఏఎస్ అధికారులు వాణిప్రసాద్, రొనాల్ రోస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి, ఎం.ప్రశాంతి ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మొహంతి ఎపిలో చేరాలని ఆదేశించింది. ఐఏఎస్ అధికారులు అనంతరాము, ఎస్‌ఎస్ రావత్, ఎల్.శివశంకర్, శ్రీజన, హరికిరణ్ తెలంగాణలో ఈనెల 16లోగా చేరాలని ఆదేశించింది.

ఇప్పటికే తెలంగాణలో తగినంత మంది ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు లేక ఇబ్బందులు పడుతుండగా ఉన్న వాళ్లలో సీనియర్‌లను అక్కడకు పంపిస్తే పాలనలో ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. తెలంగాణలో ఐఏఎస్‌ల కేడర్ స్ట్రెంత్ 218 కాగా, ప్రస్తుతం 170 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఐఏఎస్‌ల్లో వాకాటి కరుణ (2004) బ్యాచ్ కాగా, రోనాల్డ్‌రాస్ (2006), వాణిప్రసాద్ (1995), ఆమ్రపాలి కాట (2010), ప్రశాంతి (2009), ఐపిఎస్‌ల్లో అంజన్‌కుమార్ (1990) బ్యాచ్ కాగా, అభిలాష బిస్త్ (1994), అభిషేక్ మహంతి (2011) బ్యాచ్‌కు చెందిన వారు. ప్రస్తుతం వీరంతా తెలంగాణలో కీలక పదవులను నిర్వహిస్తుండగా వీరు ఎపికి వెళ్లిపోతే వారి స్థానంలో ఎవరిని నియమిస్తారన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News