న్యూఢిల్లీ : పవన్ హన్స్ విక్రయ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ హెలికాప్టరు సంస్థను కొనుగోలుచేసే విజేతల బృందంలో భాగమైన అల్మాస్ గ్లోబల్‌కు వ్యతిరేకంగా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) ఆదేశాలు వెలువరించింది. ఈ ఆదేశాలను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు అప్పటివరకూ సేల్‌ను పక్కకు పెడుతున్నట్లు కేంద్రం తెలిపింది. ఎన్‌సిఎల్‌టి ఆదేశాలపై పరిశీలన తరువాతనే తుది నిర్ణయం ఉంటుంది. అమ్మకాలు కొనుగోళ్ల లెటర్ ఆఫ్ అవార్డు ఇంతవరకూ వెలువరించలేదని వివరించారు. పవన్ హన్స్ విక్రయ ప్రక్రియ జరిగింది. ఇందులో వివిధ కంపెనీల సమాఖ్యగా రూపొందిన స్టార్9 మొబిలిటి పవన్ హన్స్ కొనుగోళ్లకు రూ 211. 14 కోట్ల ఆఫరు ఇచ్చింది. ఇది రిజర్వ్ ధర రూ 199 కోట్లు కన్నా ఎక్కువగా ఉండటంతో దీనికే కట్టబెట్టడానికి నిర్ణయించారు. అయితే కన్సార్టియంలో భాగస్వామ్యమైన అల్మాస్ గ్లోబల్ నిర్ధేశిత పద్దతి ప్రకారం కొల్‌కతాకు చెందిన పవన్ హన్స్ కంపెనీకి చెల్లింపులు ఇవ్వలేకపోయింది. దీనిని గుర్తించి ఎన్‌సిఎల్‌టి వెలువరించిన ఆదేశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. పవన్ హన్స్ ప్రభుత్వ ఆధీనంలోని హెలికాప్టరు సేవల సంస్థగా ఉంది.