Sunday, November 17, 2024

ఆర్థిక సంఘాలు అలంకారప్రాయమేనా?

- Advertisement -
- Advertisement -

రెండేళ్లుగా అమలుకు నోచుకోని సిఫారసులు
రాష్ట్రాలను ఆర్థికంగా నష్టపరుస్తున్న కేంద్రం, తెలంగాణకు రూ.25వేల కోట్లు
ఎగనామం, 15వ ఆర్థ్ధిక సంఘం కాలపరిమితిలో ఇప్పటికే రెండేళ్లు ఆవిరి
స్థానిక సంస్థల గ్రాంట్లకు కేంద్రం ససేమిరా, హెల్త్ గ్రాంట్లకూ మంగళం

మన తెలంగాణ/హైదరాబాద్: దేశాన్ని పాలిస్తున్న బిజెపి ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. (నీతి ఆయోగ్ ప్రణాళికా సంఘం), 14, 15వ ఆర్థిక సంఘం వంటి అత్యంత కీలకమైన వ్యవస్థలను అలంకారప్రాయంగా మార్చిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజ ల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నైపుణ్యంతో కూడిన సలహాలు, సూచనలు చేస్తూ ముందుకు నడిపించే అత్యంత కీలకమైన వ్యవస్థలుగా ఒక వెలుగు వెలిగిన ఈ సంస్థలు ఇప్పుడు నిరుపయోగ వ్యవస్థలుగా మిగిలిపోయాయనే ఆవేదన వ్యక్తమవుతోంది.

రాష్ట్రాల విన్నపాలు, విజ్ఞప్తులు వినడమే కాకుండా వాటి అవసరాలను తెలుసుకొని దేశంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక సమానత్వాన్ని సాధించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ముందుండి నడిపించే మహోన్నతమైన వ్యవస్థలను మోడీ ప్రభుత్వం ఆ వ్యవస్థల సలహాలు, సూచనలు, సిఫారసులను బుట్టదాఖలు చేస్తూ వాటి ప్రతిష్టను దిగజార్జించిందని ఆర్ధికవేత్తలు, నిపుణులు, ఆర్ధికశాఖల్లో పనిచేస్తున్న పలువురు సీనియర్ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రణాళికా సంఘంగా విశేష సేవలందిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలకూ, కేంద్ర ప్రభుత్వానికి పెద్దన్నగా వ్యవహరించిన వ్యవస్థను నీతి ఆయోగ్‌గా పేరుమార్చి ఆ సంస్థ అధికారాలను పరిమితం చేశారని, దాని సిఫారసులను కూడా అమలుచేయకుండా బుట్టదాఖలు చేస్తూ కేంద్ర సర్కార్ ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. నీతి ఆయోగ్‌ను నిర్వీర్యం చేయడం మూలంగా రాష్ట్రాలన్నీ ఆర్ధికంగా ఎంతో నష్టపోయాయని, తెలంగాణ రాష్టం ఏకంగా 25వేల కోట్ల రూపాయలు నష్టపోయిందని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

అదే విధంగా 14వ ఆర్థ్ధిక సంఘం సిఫారసులను కూడా కేంద్రం బుట్టదాఖలు చేయడంతో తెలంగాణ సహా చివరకు జమ్ము-కాశ్మీర్, లఢఖ్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఆర్ధికంగా నష్టపోయాయని వివరించారు. మరీ ముఖ్యంగా 15వ ఆర్థ్ధిక సంఘం సిఫారసులను కూడా అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో నిర్లక్షం వహిస్తోందన్నారు. సంఘం సిఫారసులను అమలుచేసే ఉద్దేశం ఉందా..? లేదా? అనే చర్చ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నూజరుగుతోంది.15వఆర్థ్ధిక సంఘం కాలపరిమితి 2021 నుంచి 2026వ ఏడాది వరకూ ఉండగా ఇప్పటికే రెండు ఆర్ధిక సంవత్సరాల్లో చేసిన సిఫారసులు పూర్తిగా అమలుకు నోచుకోకపోగామూడో ఏడాది లో ఇప్పటికే రెండు నెలల సమయంవృధాఅయ్యిందన్నవిమర్శలున్నాయి.

రెండేళ్లు గడుస్తున్నా గ్రాంట్‌లు లేవు…
స్థానిక సంస్థల పనితీరును ఆధారంగా చేసుకొని 4.36 లక్షల కోట్ల రూపాయల నిధులను గ్రాంటుగా రాష్ట్రాలకు నిధులు విడుదల చేయాలని కూడా 15వ ఆర్ధిక సంఘం సిఫారసు చేసిందని, కానీ రెండేళ్ళు గడుస్తున్నా ఆ సిఫారసులను కేంద్రం అమలు చేయకపోవడంతోనే ఇలాంటి విమర్శలు చేయాల్సి వస్తోందని ఆ అధికారులు వివరించారు. అందులో గ్రామీణ స్థానిక సంస్థలకు 2.4 లక్షల కోట్ల రూపాయలు, మరో 1.2 లక్షల కోట్ల రూపాయల నిధులను పట్టణ స్థానిక సంస్థలకు నిధులను విడుదల చేయాల్సి ఉందని వివరించారు. అంతేగాక గ్రామీణ ప్రజలకు వైద్య సేవలందించే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సి)కు, తెలంగాణ రాష్ట్రం మాదిరిగా హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేసి డయాగ్నస్టిక్ పరికరాలను ఏర్పాటు చేయాలని 15వ ఆర్ధిక సంఘం సిఫారసు చేసిందని, ఈ సిఫారసులు ఇప్పటి వరకూ అమలుకు నోచుకోలేదని తెలిపారు.

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు హిమాలయన్ రాష్ట్రాలకైతే 90ః10 నిష్పత్తితో (కేంద్రం 90 శాతం, రాష్ట్రాలు 10 శాతం) నిధులను విడుదల చేసి ఆదుకోవాలని, దేశంలోని మిగతా రాష్ట్రాల్లో విపత్తులు సంభవించినప్పుడు కేంద్రం 75 శాతం, రాష్ట్రాలు 25 శాతం నిధులను భరించే విధంగా (75ః25 నిష్పత్తిలో) కేంద్రం ఆదుకోవాల్సి ఉందని కూడా 15వ ఆర్ధిక సంఘం సిఫారసులు చేసిందని వివరించారు. ఈ నేపధ్యంలో గోదావరి నదికి వరదలు వచ్చి ఉత్తర తెలంగాణలోని 450 గ్రామాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం నీట మునిగి తీవ్రస్థాయి ఆస్తులు, ప్రాణ నష్టాలు, పశు సంపదను కోల్పోయినా కేంద్రం ఒక్క రూపాయిని కూడా విడుదల చేయకపోవడంతోనే ఇలాంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. అంతేగాక రాష్ట్రాల ద్రవ్యలోటును కూడా పూడ్చాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉందని 15వ ఆర్ధిక సంఘం కీలకమైన సిఫారసు చేసిందని, కానీ ఈ విషయంలో ఏ ఒక్క రాష్ట్రానికి కూడా కేంద్రం ఆర్ధికంగా సహకరించింది లేదని పేర్కొన్నారు.

జిఎస్‌టిపైనా సిఫారసులకు దిక్కులేదు..
జిఎస్‌టి పన్నుల విధానాన్ని కూడా 12శాతం, 18 శాతాలకు పరిమితం చేయాలని, మిగతా పన్నుల శ్లాబులను ఈ రెండింటి పరిధిలోకి సర్దుబాటు చేసి రాష్ట్రాలకు కాస్తంత వెసులుబాటు కల్పించాలని కూడా 15వ ఆర్ధిక సంఘం కీలకమైన సిఫారసు చేసింది. ఇలా 25 రకాల సిఫారసులు చేసిందని, కానీ కేంద్రం రెండేళ్ళు పూర్తయినప్పటికీ ఇంత వరకూ అమలు చేయలేదని పేర్కొన్నారు.

ఆర్ధిక సంఘాల సిఫారసులు, నీతి ఆయోగ్ సిఫారసులను కూడా అమలు చేయకపోతే దేశంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అర్ధంకావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వాస్తవానికి 15వ ఆర్ధిక సంఘం ఎన్‌కె సింగ్ అధ్యక్షతన 2021 ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌కు నివేదికను సమర్పించింది. తన సిఫారసులను 2021 నుంచి 2026వ ఏడాది వరకూ అయిదేళ్ళ పాటు దేశంలో అమలుచేస్తే దేశ ప్రజల కనీస మౌలిక సదుపాయాలు కల్పించినట్లవుతుందని, వైద్యరంగానికి సహకరిస్తే గ్రామీణ ప్రజలకు వైద్య సేవలందుతాయని 15వ ఆర్ధిక సంఘం భావించింది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల్లో ఒకట్రెండు మినహా మిగతా సిఫారసులన్నింటినీ తుంగలో తొక్కిందని, అందుకే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ తీరు విమర్శల పాలయ్యిందని అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News