Tuesday, December 17, 2024

ఉలుకూ పలుకూ లేదు

- Advertisement -
- Advertisement -

వరద సాయంపై నిమ్మకు నీరెత్తిన కేంద్రం

వరదల నష్టం రూ.1400కోట్లు తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ఇవ్వాలన్న తెలంగాణ
కేంద్రం స్పందన కరవు ఇది ముమ్మాటికీ రాష్ట్రంపై కక్ష సాధింపే

మన తెలంగాణ / హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ తెలంగాణ రాష్ట్రానికి సహాయ నిరాకరణ చేయడమే కాకుండా న్యాయంగా, ధర్మంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా సతాయిస్తోందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. చట్టప్రకారం రుణాలను సేకరించుకునేందు కు అనుమతులు ఇవ్వకుండా వేధించడమే కాకుండా రాష్ట్రానికి ఇవ్వాల్సిన 34 వేల కోట్ల రూపాయల బకాయిలు కూడా ఇవ్వకుండా సతాయిస్తున్నదే కాక చివరకు ఇటీవల గోదావరి నదికి వచ్చిన వరదలు సృష్టించిన భారీ నష్టాలను పూడ్చేందుకు 1,400 కోట్లివ్వమని అడిగితే కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేదని అధికారులు వివరించారు. ప్రాథమిక అంచనాల్లో 1,400 కోట్ల రూపాయల వరకూ నష్టం వాటిల్లిందని, తక్షణ సా యంగా కేవలం వెయ్యి కోట్లివ్వాలని మా త్రమే కేంద్రాన్ని అడిగామని, ఆ కొద్దిపాటి నిధులను కూడా ఇవ్వకపోతే ఎలా?, తెలంగాణను కేంద్రం పూర్తిగా విస్మరించినట్లుగా ఉందని ఆ అధికారులు వ్యాఖ్యానించారు. ప్రకృతి వైపరీత్యాల నిధి (సి.ఆర్.ఎఫ్) నిధు ల నుంచి ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా కేంద్రం వేధింపులకు గురిచేస్తోందని, ఇది ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రంపై కక్షసాధింపు చర్యేనని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

గోదావరి నదికి అనూహ్యంగా వచ్చిన వరదల మూలంగా ఉత్తర తెలంగాణలోని నదీ పరివాహక ప్రాంతాలు, ఆయకట్టు భూము లు, వేలాది గ్రామాలు నీట మునిగి ప్రాణనష్టాలు, ఆస్తి నష్టాలు, పంటలు, పశు సంపదను కోల్పోయి ఆపదలో ఉన్న లక్షలాది మంది ప్రజానీకాన్ని ఆదుకునేందుకు కేం ద్రం సిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ పథకాల కింద రాష్ట్రాలకు నిధులను ఇచ్చి ఆర్ధికంగా ఆదుకోవాల్సి ఉంది. ప్రకృతి వైపరీత్యాల్లో జరిగిన మొత్తం నష్టాల్లో 75శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ఆర్ధిక సహాయం చేసి రాష్ట్రాలను ఆదుకోవాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకూ ఒక్క రూపాయిని కూడా ఇవ్వకపోవడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రకృతి వైపరీత్యాల్లో రాష్ట్రాలను ఆదుకోకుండా నిర్లక్షం వహించిన ప్రభుత్వాల్లో కేంద్రంలోని బి.జే.పీ.యే మొదటిదని అంటున్నారు. 2018-19వ ఆర్ధిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ గడచిన నాలుగేళ్ళల్లో తెలంగాణ రాష్ట్రంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులను కూడా ఇవ్వలేదని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారీ కేంద్రానికి నివేదిక పంపించడం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక్క రూపాయిని కూడా విడుదల చేయలేదని ఆ అధికారులు వివరించారు.

ఇదే అంశంపై రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాలు, ఐ.టి., పరిశ్రమల శాఖామంత్రి కె.టి.రామారావు కూడా ట్విట్టర్‌లో నేరుగా ప్రధానమంత్రినే నిలదీశారని, అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని వివరించారు. గోదావరి నదీ వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో కేంద్రం నుంచి నిపుణులు, అధికారుల బృందాలు పర్యటించాయి కూడా. ఆ నిపుణుల బృందాలు కేంద్రానికి నివేదికలను కూడా ఇచ్చాయని, అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదని ఆ అధికారులు వివరించారు. అంతేగాక గోదావరి నదికి రికార్డుస్థాయిలో వచ్చిన వరదల మూలంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర గవర్నర్ తమిళ్‌సై సౌందర్‌రాజన్ కూడా ఇటీవల న్యూఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కూడా కలిసి వరదలు సృష్టించిన నష్టాలపై నివేదికను కూడా సమర్పించారు. అంతేగాక తెలంగాణలో గోదావరి నది వరదల మూలంగా జరిగిన నష్టాలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, ఆర్ధిక సహాయం కూడా చేస్తారని గవర్నర్ తమిళ్ సై సౌందర్‌రాజన్ న్యూఢిల్లీలో మీడియాకు చెప్పారు. కానీ ఇప్పటి వరకూ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని, తెలంగాణకు ఆర్ధిక సహాయం చేస్తారా? చేయరా? అనేది కూడా తెలియడంలేదని ఆ అధికారులు వివరించారు.

ఇటీవల రాజస్థాన్, నాగాలాండ్ రాష్ట్రాల్లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల్లో ఆ రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 1,043 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి ఆర్ధికంగా ఆదుకొందని, కానీ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయిని కూడా విడుదల చేయకపోవడంతోనే కేంద్రం తీరును ఆక్షేపించాల్సి వస్తోందని అంటున్నారు. కేవలం రాజకీయపరమైన కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలను కేంద్రం ఆదుకోకుండా నిర్లక్షం వహిస్తోందని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయని అంటున్నారు. పోనీ కేంద్రం వద్ద నిధులు లేకపోవడం మూలంగా తెలంగాణకు ఆర్ధిక సాయం చేయడంలేదా…?

అని ఆలోచిస్తే అదీకాదని, కేంద్ర ప్రభుత్వ ఖజానాలో లక్షల కోట్ల రూపాయల నిధులు మూలుగుతున్నాయని, ఆర్ధికంగా ఎంతో బలంగా ఉన్న కేంద్రం కేవలం 1,400 కోట్ల రూపాయలను ఇవ్వలేకపోవడంలో వేరే కారణాలు ఏమీలేవని, కేవలం రాజకీయపరమైన కారణాలతోనే తెలంగాణను వేధిస్తోందని స్పష్టమయ్యిందని విమర్శిస్తున్నారు. ఇకనైనా మనసుమార్చుకొని కేంద్రం తెలంగాణను ప్రకృతి వైపరీత్యాల నిధులు ఇచ్చి ఆదుకోవాలని ఆ కోరుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆదుకోకపోతే తెలంగాణ ప్రజలకు కేంద్రంలోని బి.జే.పి.ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం సన్నగిల్లుతుందని, ఇది మంచి పరిణామం కాదని అధికారులే కాకుండా కొందరు టి.ఆర్.ఎస్.పార్టీ నాయకులు కూడా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం మనసు మార్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News