Wednesday, January 22, 2025

ప్లాస్టిక్‌తో మానవాళికి ప్రమాదమా?

- Advertisement -
- Advertisement -

ప్లాస్టిక్ వస్తువుల కన్నా ప్లాస్టిక్ సంచుల వాడకమే ప్రమాదం. పలుచగా ఉండే ఈ ప్లాస్టిక్ సంచులను అతిగా వాడి, ఎక్కడపడితే అక్కడ పడేయడం, వీటిని రీసైకిల్ చేసే అవకాశం లేకపోవడం వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదమే ఎదురవుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు వంద మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతున్నది.ప్రాథమికంగా ప్లాస్టిక్ హానికరమైనది కాదు. కానీ ప్లాస్టిక్ సంచుల తయారీ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రమాదకరమైన రసాయనరంగులు, ప్లాస్టిసైజర్లు కలుపుతున్నారు. రసాయన రంగుల్లో ఆరోగ్యానికి హాని చేసే కాడ్మియం, సీసం వంటివి ఉన్నాయి. ఇవి భూమిలో కలిసిపోవు సరికదా భూసారాన్ని కూడా నాశనం చేస్తాయి. వాటిని తిని జంతువులు అనారోగ్యాల బారినపడుతున్నాయి.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించింది. అయితే క్షేత్రస్థాయిలో పాలిథిన్ కవర్ల వాడకాన్ని ఆపాలంటే పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. ఒకప్పుడు ప్లాస్టిక్ ఒక వరం. ఇప్పుడొక శాపం. ఆధునిక నాగరిక ప్రపంచంలో ప్లాస్టిక్ ఆవిష్కరణ మానవ జీవితాన్ని ఎంతో సౌకర్యవంతంగా మార్చింది. గతంలో వాడిన లోహ పాత్రలు, చెక్క ఫర్నీచర్ స్థానంలో ప్లాస్టిక్ వస్తువులు వచ్చి చేరాయి. మార్కెట్‌కు వెళ్లి ఏ వస్తువు కొనుగోలు చేసిన గతంలో పేపర్‌లో కట్టి ఇచ్చేవారు. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లులో వేసి ఇస్తున్నారు. ప్లాస్టిక్ కవర్ల వాడకం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. దాని వల్ల ప్లాస్టిక్ చెత్త పెరిగిపోయింది. చివరకు అది మానవాళికి ముప్పు కలిగించే వాతావరణ కాలుష్యం కలిగిస్తున్నది. దీనితో ప్లాస్టిక్ వదిలించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

వివిధ అధ్యయనాల ప్రకారం ఏటా ప్రపంచంలో 5 ట్రిలియన్ ప్లాస్టిక్ బ్యాగులువాడుతున్నారు. అంటే సెకండ్‌కు 1,60,000 బ్యాగులున్నమాట. ఈ బ్యాగులన్నింటిని ఒక చోట కుప్ప పోస్తే ఫ్రాన్స్ దేశమంతా భూభాగాన్ని ఆక్రమిస్తాయట. ఒక లెక్కప్రకారం ఒక బ్యాగ్‌ను మనం 25 నిమిషాల కంటే ఎక్కువ సేపు వాడం. వాడిన తర్వాత పడేస్తాం. అదిచెత్తలోకి చేరుతుంది. కుళ్లిపోయి మట్టిలో కలిసిపోయేందుకు 100 నుంచి 500 సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. సముద్రంలో తేలేచెత్తలో 80 శాతం ప్లాస్టికే. అందువల్లే ఈ స్పృహ ప్రజలలో కలిగించేందుకే అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల వాడక నిషేధ దినం ఏటా జూలై 3న పాటిస్తున్నారు. ప్లాస్టిక్ అనేది ప్రమాదవశాత్తు తయారయింది.

1933లో ఇంగ్లండ్ నార్విచ్‌లో ఒక కెమికల్ ప్లాంట్‌లో తయారయిది. అక్కడి ప్లాంట్‌లో పాలిమర్స్ మీద చేస్తున్న ఒక ప్రయోగం విఫలమయింది. ఫలితంగా తెల్లగా మైనం వంటి పదార్థం తయారయింది. ఇది పాలిఇథైలీన్. దీనినే పాలిథీన్ అంటారు. ఈ మైనం లాంటి పదార్థం తయారుకావడం ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్న జార్జ్ ఫీకెమ్ అనే కుర్ర కెమిస్టు పసిగట్టాడు. ప్రయోగంలో వచ్చిన పదార్ధం చూస్తుండగానే ప్రపంచాన్ని జయిస్తుందని జార్జి ఊహించలేదు. జార్జి ఫ్లాస్టిక్ కనిపెట్టిన విషయం 2009లో తెలిసింది. ఆయనకు సంబంధించిన పాత సామాన్లను శోధిస్తున్నపుడు ఒక చిన్న ముక్కోణపు బిల్ల కనిపించింది. దాని మీద జిఎఫ్ అనే అక్షరాలున్నాయి. తాను డ్యూటీలో ఉన్నపుడు తయారైన మైనపు బిల్ల ఇది. దీనిని ఆయన గుర్తుగా చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు. దీనిని అతని మనవడుబిబిసి హిస్టరీ ప్రాజక్టు వారికి ఇచ్చాడు. తీరా చూస్తే అదే పాలిధీన్.

అయితే, ఈ కీర్తి ఎరిక్ ఫాసెట్ రెజినాల్ గిబ్సన్ అనే శాస్త్రవేత్తలకు దక్కింది. వాళ్లు కూడా పొరపాటుగానే ప్లాస్టిక్ తయారు చేశారు. అయితే దీనిని పర్‌ఫెక్ట్‌గా తయారు చేసేందుకు ఐసిఐ కంపెనీకి అయిదేళ్లు పట్టింది.
1938 నాటికి పాలిధీన్ తయారు చేయడం మొదలయింది. దీన్నుంచి ప్లాస్టిక్ బ్యాగ్ తయారు కావడానికి మరొక 25 సంవత్సరాలు పెట్టింది. మొట్టమొదట ప్లాస్టిక్ బ్యాగ్ తయారు చేసింది స్వీడెన్‌కు కెందిన సెల్లోప్లాస్ట్ అనే కంపెనీ. దీనికి మొదటి పేటెంట్ వచ్చింది. దీనిని డిజైన్ చేసిన వ్యక్తి స్టెన్ గుస్తాఫ్ థూలిన్ అంతకు వరకు యూరోప్‌లో వాడుకలో ఉన్న బట్ట సంచులను అదే చేసంచులను ఈప్లాస్టిక్ సంచులు తరిమేయడం మొదలయింది.

ఈ బ్యాగులు 1979లో అమెరికాలో ప్రవేశించాయి. 1982లో సేఫ్ వే, క్రోగర్ సూపర్ మార్కెట్‌లో అమెరికాలో ఈప్లాస్టిక్ బ్యాగ్‌లను ప్రవేశపెట్టి పాపులర్ చేశాయి. ప్రతి ఏడాది రెండు మిలియన్ల పక్షులు, సముద్ర జీవులు కేవలం ప్లాస్టిక్ సంచుల వల్లే చనిపోతున్నాయి. అందుకే ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం మంచిది. వాటి స్థానంలో జనప నార సంచుల వాడకాన్ని పెంచాలి. బ్రిటన్, జపాన్లలో ‘స్పడ్ వేర్’గా పిలిచే బంగాళాదుంపలతో చేసిన సంచుల్ని వాడుతున్నారు. ఇది ప్లాస్టిక్ కంటే చాలా తక్కువ ధరకే వస్తుంది. బంగాళదుంప నుండి తయారు చేసే స్టార్చ్‌కు బయో పాలిమర్ ప్లాస్టిక్ లక్షణాలు ఉంటాయి. దీనికి భూమిలో కరిగిపోయే గుణం చాలా ఎక్కువ. కనుక హాని కారకం కాదు.

కావాలనుకుంటే రీసైక్లింగ్ పద్ధతిలో కొత్త వస్తువులు తయారు చేసుకోవచ్చు. 1997లో చార్లెస్ మూర్ అనే నావికుడు, శాస్త్రవేత్త సముద్రంలో చెత్తలోకి పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వచ్చిచేరుతూ ఉందని, అది సముద్ర జీవులకు హాని కలిగిస్తూ ఉందని చెప్పారు. ఒకపుడు ప్లాస్టిక్ బ్యాగ్ చేతిలో పట్టుకుని తిరగడం ఫ్యాషన్. అది ముదరడంతో ముప్పు వస్తుంది. అందుకే ప్లాస్టిక్ సంచుల వాడకం ఆపాలని ఈ రోజున ప్రచారం చేస్తూ, వస్త్రంతో తయారైన సంచులు వాడకం ప్రోత్సహిస్తున్నారు. మనం కూడా ప్లాస్టిక్ కవర్లను నిషేధిద్దాం. వివిధ వేడుకల సందర్భంగా ఒకసారి ఉపయోగించి పారవేసే కప్పులు, కవర్ల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. వీటిని ఒక్కోసారి జంతువులు తినడం వల్ల అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇవి మురికి కాల్వల్లో దీర్ఘకాలం నిల్వ వుండటం వల్ల దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు ఉమ్మడిగా కృషి చేస్తే ప్లాస్టిక్ భూతం నుంచి భవిష్యత్తరాలను రక్షించవచ్చు.

యం. రాం ప్రదీప్
9492712836

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News