డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజలను తప్పుతోవ పట్టించి డబ్బు కాజేస్తున్న వారి ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్‌సభలో తెలియజేశారు.లోక్‌సభలో ఓ ప్రశ్నకు బండి సంజయ్ కుమార్ సమాధానమిస్తూ “ ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 7.81 లక్షల సిమ్ కార్డులు , 83 వేల వాట్సప్ ఖాతాలను నిలిపివేశాం. మొత్తం 2,08,469 ఐఎమ్ ఈఐలను భారత ప్రభుత్వం నిలిపివేసింది” అని సభకు తెలిపారు. “ ఇంటర్నేషనల్ మొబైల్ ఐడెంటిటీ అనేది ప్రతి ఫోన్‌కు కేటాయించే ఒక ప్రత్యేక సంఖ్య. ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (14c)… డిజిటల్ అరెస్టు
కోసం వినియోగించే 3962 కి పైగా స్కైప్ ఐడీలు, 83,668 వాట్సాప్ ఖాతాలను ముందుగానే గుర్తించి బ్లాక్ చేసింది. 14c నేతృత్వంలో సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ 2021లో ఏర్పాటైంది. ఇప్పటివరకు 13.36 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయి. దీని ద్వారా దాదాపు రూ.4386 కోట్లు కాపాడాం ” అని తెలిపారు. మహిళలు, చిన్నారులే లక్షంగా జరిగే నేరాలపై దృష్టి సారించామన్నారు. అన్నిరకాల డిజిటల్ నేరాలకు సంబంధించి ప్రజలు ఫిర్యాదు చేసేందుకు (https://cybercrime.gov.in) సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రారంభించామన్నారు. ఈ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదును పరిగణన లోకి తీసుకుని పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారని … వీటిపై సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అధికారులు చర్యలు చేపడతారని వివరించారు.