Monday, December 23, 2024

జమిలి కోసం.. మెరుపు భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపు నిచ్చింది. ఇది అసాధారణ, ఆకస్మిక నిర్ణయమే అయింది. ఈ నెల ( సెప్టెంబర్) 18 నుంచి 22 వ తేదీ వరకూ ఐదురోజుల పాటు ఈ ప్రత్యేక సెషన్ జరుగుతుందని గురువారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. అయితే ఈ ప్రత్యేక సెషన్ ఎందుకు? అజెండా ఏమిటనేది ప్రభుత్వం అధికారికంగా తెలియచేయలేదు. కానీ అత్యంత కీలకమైన ఓన్ నేషన్ ఒన్ ఎలక్షన్, ఉమ్మడి పౌరస్మృతి, మహిళా బిల్లులు ఈ సెషన్‌లో ప్రవేశపెడుతారని వెల్లడైంది. దేశ రాజధాని ఢిల్లీలో జి 20 సమ్మిట్ ఈ నెల 9, 10 తేదీలలో జరుగుతుంది.దీని తరువాత కొద్దిరోజులకే ఈ ప్రత్యేక సెషన్ జరుగుతుంది. 17వ లోక్‌సభ 13వ సెషన్, రాజ్యసభ 261వ సెషన్ ఈ ప్రత్యేక సెషన్‌లో భాగంగా ఏర్పాటు చేశారని మంత్రి వివరించారు. ఇది ఐదురోజుల సిట్టింగ్‌గా ఉంటుంది. అమృత్‌కాల్ దశలో సభలలో ఫలప్రదమైన సంప్రదింపులు, ఆలోచనలను ఆశిస్తున్నామని మంత్రి తమ ప్రకటనలో తెలిపారు.

అయితే ఈ సెషన్‌లో ఏమైనా ప్రత్యేక బిల్లులు ఉంటాయా? చర్చనీయాంశాలు ఏమిటనే విషయంపై అధికార వర్గాలు పెదవి విప్పడం లేదు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇటీవలే మణిపూర్ సంకట స్థితిపై సరైన రీతిలో చర్చలకు అవకాశం లేకుండానే వాయిదా పడ్డాయి. అయితే పార్లమెంట్ కొత్త భవనంలోకి అధికారికంగా సభాకార్యక్రమాల నిర్వహణను ఆరంభించేందుకు ప్రభుత్వం ఈ విధంగా స్పెషల్ సెషన్‌కు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా పార్లమెంట్ పాత భవనంలో సెషన్ ఆరంభం అయ్యి, కొత్త భవనంలో ఇది ముగుస్తుందని భావిస్తున్నారు. దేశ స్వాతంత్య్ర అమృతకాల ఉత్సవాల నిర్వహణ, అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా అవతరణ వంటి విషయాలపై చర్చించేందుకు వీలుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా కీలకమైన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదని , అయితే దీనిపై ఇప్పటికైతే ఎటువంటి స్పష్టత లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

పార్లమెంట్‌కు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు?
ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి)ని తీసుకువచ్చే అవకాశం?
ఈ సెషన్‌లో కేంద్రం అత్యంత కీలకమైన ఏకకాల ఎన్నికల బిల్లు రాజకీయ సంచలనానికి దారితీస్తోంది. దేశంలో లోక్‌సభకు , అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగే ప్రక్రియ ఉంది. దీనికి భిన్నంగా ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ పద్దతిలో లోక్‌సభకు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒపకే దశలో ఎన్నికలు నిర్వహించే ప్రక్రియపై చాలా కాలంగా దీనిపై ఆలోచన జరుగుతోంది. ఇటీవలే లా కమిషన్ కూడా దీనిని పరిశీలించి కేంద్రానికి అంతర్గతంగా నివేదిక పంపించినట్లు వెల్లడైంది. ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ ప్రక్రియతో ఇక దేశంలో ఒకే ఒక్కరోజు ఎన్నికలకు వీలేర్పడుతుంది. అసెంబ్లీలు, లోక్‌సభ ఏర్పాట్ల ప్రక్రియ పూర్తవుతుంది.
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఏదో కీలక విషయంపై ఆలోచనలతోనే ఈ ప్రత్యేక పార్లమెంట్ సెషన్‌ను ఏర్పాటు చేసి ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చాలా కాలంగా ఆలోచనలో ఉన్న ఉమ్మడి పౌర స్మృతి యుసిసి బిల్లును తీసుకురావడం ద్వారా ప్రతిపక్షాలను ఇరకాటంలోకి నెట్టేందుకు సర్కారు సంకల్పించిందని ఓ రాజకీయ పార్టీ నేత తెలిపారు.

దేశంలో ఇప్పటివరకూ మతాలు, ఆచార వ్యవహారాలు , సాంప్రదాయాలకు అనుగుణంగా వేర్వేరుగా పర్సనల్ లా (వ్యక్తిగత చట్టాలు) నిర్ధేశితం అయి ఉన్నాయి. దీని స్థానంలో ఇప్పుడు వీటికి అతీతంగా ఇక దేశంలో ఉమ్మడి పర్సనల్ చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన ఆలోచనలకు అనుగుణంగా రంగం సిద్ధం చేసుకుందని, ఈ క్రమంలోనే ఈ అత్యంత కీలకమైన యుసిసిని తీసుకురానుందని వెల్లడైంది. దకుభారతదేశం ఆతిధ్యంలో జి 20 నిర్వహణ గురించి భారీ స్థాయిలో పార్లమెంట్ వేదికగా ఘనతను చాటుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసుకొంటోందని వెల్లడైంది. మతాలు కులాలు, తెగలు, లైంగికకోణాలు, జెండర్ వంటి వేర్వేరు అంశాలకు అతీతంగా దేశంలోని ప్రజలంతా ఒకే చట్టం పరిధిలోకి రావడానికి సూత్రీకరణ కీలక అంశం కానుంది. ఓ వైపు దేశంలోని ప్రతిపక్షాలు సంఘటితం అయ్యి, ఇండియా కూటమిగా బిజెపితో తలపడేందుకు ఉమ్మడి ప్రణాళికతో వ్యూహాలు ఖరారు చేసుకునే దశలో ఏర్పాటు అయ్యే పార్లమెంట్ స్పెషల్ సెషన్ వెనుక పూర్తి స్థాయి రాజకీయ ఉద్ధేశాలే ఉండి ఉంటాయని భావిస్తున్నారు.
గణేష్ ఉత్సవాల దశలో సెషన్
సభా సమావేశాలపై ప్రతిపక్షాల స్పందన
దేశంలో అత్యంత కీలకమైన, జనబాహుళ్య ప్రాతినిధ్యపు గణేష్ ఉత్సవాల దశలోనే పార్లమెంట్ ప్రత్యేక సెషన్ తేదీలు ఖరారు చేయడం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ముంబైలో ఇండియా కూటమి వేదిక నుంచి ఈ విషయంపై ప్రతిపక్ష నేతలు స్పందించారు. ముంబై తదితర ప్రాంతాలలో గణేష్ ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ సమయంలో సెషన్ ఏర్పాటు దురదృష్టకరం, హిందువుల మనోభావాలకు ఇబ్బందికరం అవుతుందని శివసేన యుబిటికి చెందిన ప్రియాంక చతుర్వేది తెలిపారు. ఉన్నట్లుండి ప్రభుత్వం ఈ తేదీలను ఖరారు చేయడం విస్మయకరం అన్నారు. తేదీలను మార్చాల్సి ఉందని ఎన్‌సిపి నాయకురాలు సుప్రియా సూలే తెలిపారు. సెషన్‌లో ఫలప్రదమైన చర్చలు జరగాలనేదే ఉద్ధేశం అయితే, ఇందుకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని స్పష్టం చేశారు. ప్రత్యేకించి మహారాష్ట్రలో ఇది ఘనంగా జరిగే పండుగ , ఉత్సవాలు కొనసాగుతూ ఉంటాయని దీనిని దృష్టిలో పెట్టుకుని , రీషెడ్యూల్ చేయాలని తాను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిని కోరుతున్నట్లు సుప్రియా ట్విట్టర్ ( ఇప్పుడు ఎక్స్) వేదికగా తెలిపారు.

కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ వార్తల వలయం నిర్వహణ మోడీ స్టయిల్‌లో సాగుతోందని ట్వీటు చేశారు. ఇప్పుడు మోదాని స్కామ్ గురించి వార్తలు ప్రాదాన్యత సంతరించుకున్నాయి. తరువాత రెండు మూడు రోజులు ఇండియా భేటీ వార్తలు ప్రచారంలోకి వస్తాయి. వీటిని కౌంటర్ చేసేందుకు ఇప్పుడు ఈ స్పెషల్ సెషన్ ఆలోచన చేసినట్లు విమర్శించారు. మూడు వారాల క్రితమే వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఇప్పుడు ఈ ఐదురోజుల సెషన్ నిర్ణయం ఎందుకు ఆదరాబాదరాగా తీసుకున్నారని ప్రశ్నించారు. సెషన్ సంగతి ఏ విధంగా ఉన్నా , అదానీ వ్యవహారంపై జెపిసి డిమాండ్లను పార్లమెంట్‌లోనే కాకుండా వెలుపల కూడా విన్పిస్తూనే ఉంటామని తెలిపారు. వర్షాకాల సెషన్ జరిగిన తీరు వల్ల ప్రజలలో సర్కారు పట్ల తలెత్తిన స్పందనను గుర్తించి దీనిని చక్కదిద్దుకునేందుకు ఈ సెషన్ ఆలోచనకు దిగారని భావిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు విషయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు కేంద్రం సుముఖంగా ఉందని న్యాయస్థానానికి తెలియచేశారు.

జమ్మూ కశ్మీర్‌లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. ఆర్టికల్ 370 ఎత్తివేత సరైనదే అని భావిస్తే , దీనిని ఎన్నికల నిర్వహణ ద్వారా నిర్థారించుకోవచ్చునని కూడా సుప్రీంకోర్టు తెలిపింది అయితే ఎన్నికల నిర్వహణ ఎప్పుడనేది కేంద్ర, రాష్ట్ర స్థాయి ఎన్నికల సంస్థలపై ఆధారపడి ఉందని ఈ విచారణల దశల్లో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఇక జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్రప్రతిపత్తి ఇచ్చే విషయంపై స్పందిస్తూ ఈ మార్పిడికి నిర్ణీత సమయం గురించి ఇప్పటికిప్పుడు తెలియచేయలేమన్నారు. జమ్మూ కశ్మీర్ విషయం కూడా ప్రధానంగా స్పెషల్ సెషన్‌లో చర్చకు వస్తుందని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News