Wednesday, January 22, 2025

కేంద్రానిది డబుల్ దోపిడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం సెస్, సర్‌చార్జీల పేరుతో లక్షల కోట్ల రూపాయలను వసూలు చేస్తున్న వైనం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు జి.ఎస్.టి. రూపంలో నెలకు సగటున 1.50 లక్షల కోట్లను వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం సెస్, సర్‌చార్జీల రూపంలో కూడా అంతే మొత్తాన్నీ వసూలు చేస్తోందనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయంలో ఒక్క జి.ఎస్.టి. రూపంలోనే 86 శాతం నిధులు వస్తున్నాయని, దీనికి అదనంగా సెస్, సర్‌చార్జీల రూపంలో కూడా మరో 86 శాతం నిధులు కేంద్ర ఖజానాకు చేరుతున్నాయనే అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేగాక పార్లమెంటుకు కేంద్ర ఆర్ధికశాఖా మంత్రి సమర్పించిన లెక్కలను కూడా ఉటంకిస్తూ సోషల్ మీడియాలో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్ళ బాగోతం వైరల్ అవుతోంది.

జి.ఎస్.టి. రూపంలో పన్నులు పెంచి వసూళ్ళు చేసుకుంటే అందులో నుంచి అన్ని రాష్ట్రాలకు దామాషా ప్రాతిపదికన వాటాలు ఇవ్వాల్సి ఉంటుందని, అందుకే రాష్ట్రాలకు ఇచ్చే వాటా నిధులను ఎగ్గొట్టడానికే సెస్-సర్‌చార్జీల పేరుతో భారీగా పన్నులు వసూలు చేసుకుంటూ కేంద్రం ఖజానాను లక్షల కోట్ల రూపాయలతో నింపుకుంటోందని ఆర్ధికశాఖ వర్గాలు వివరించాయి. 2022 మార్చి నెలాఖరు నాటికి సెస్, సర్‌చార్జీల రూపంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు 27.07 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని కేంద్ర ప్రభుత్వమే అప్పట్లో అధికారికంగా ప్రకటించిందని ఆ అధికారులు వివరించారు. అంతేగాక జి.ఎస్.టి. రూపంలో నెలకు సగటున 1.50 లక్షల కోట్ల రూపాయల నిధులు కేంద్ర ఖజానాకు చేరుతున్నాయని, జి.ఎస్.టి. రూపంలో కేంద్ర ఖజానాకు ప్రతి నెలా ఎంత మేరకు నిధులు వస్తున్నాయో అంతేస్థాయిలో సెస్-సర్‌చార్జీల రూపంలో నిధులు వస్తున్నాయని వివరించారు.

ఎందుకంటే జి.ఎస్.టి. పన్నుల స్లాబులు ఎంత ఉన్నాయో, అంతే మొత్తంలో సర్‌చార్జీల పన్నుల స్లాబులు కూడా ఉన్నాయని, అందుకే రెండు విధాలుగా భారీ ఆదాయం వస్తోందని వివరించారు. సెస్, సర్‌చార్జీల పేరుతో వసూలు చేస్తున్న ఆదాయంలో ఒక్క రూపాయిని కూడా రాష్ట్రాలకు వాటాలు ఇచ్చే అవకాశం లేనందున ఆ నిధులన్నీ కేంద్ర ప్రభుత్వ ఖజానాలోనే మూలుగుతున్నాయని వివరించారు. అంటే ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ నుంచి నవంబర్ నెలాఖరు వరకూ ఎనిమిది నెలల్లో మరో 12 లక్షల కోట్ల రూపాయల ఆదాయం సెస్, సర్‌చార్జీల రూపంలో వచ్చి ఉంటుందని ఆ అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే గత మార్చి వరకూ వచ్చి 27.07 లక్షల కోట్లకు అదనంగా ఈ ఎనిమిది నెలల్లో వచ్చిన 12 లక్షల కోట్ల రూపాయలను కలుపుకొని 39.07 లక్షల కోట్ల రూపాయలకుపైగా నిధులు కేంద్ర ఖజానాలో మూలుగుతున్నాయని వివరించారు.

పన్నులు చెల్లించే దేశ ప్రజల నుంచి జి.ఎస్.టి. స్లాబులకు అదనంగా వస్తువులపై సర్‌చార్జీల రూపంలో 10 శాతం, 15 శాతం, 25 శాతం, 37 శాతం పన్నులను వసూలు చేస్తున్నారు. ఇవి కాకుండానే సెస్ రూపంలో అన్నింటిపైనా 4 శాతం ఫిక్స్‌డ్‌గా పన్నులు విధిస్తున్నారు. ఇప్పటి వరకూ దేశ ప్రజల నుంచి వసూలు చేసిన నిధులు చాలవన్నట్లుగా సెస్, సర్‌చార్జీల వసూళ్ళను 2026వ సంవత్సరం మార్చి నెలాఖరు వరకూ కొనసాగించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆ అధికారులు వివరించారు. 2013-14వ సంవత్సరంలో 15 రంగాలపైనే సెస్-సర్‌చార్జీలను వసూలు చేసేవారు. అదే 2019-20వ సంవత్సరానికి వచ్చేసరికి 25 రంగాలకు సెస్, సర్‌చార్జీల బాదుడును విస్తరించారని ఆ అధికారులు వివరించారు. దీంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో 2021 నాటికి సెస్-సర్‌చార్జీల బాదుడును తొమ్మిది రంగాలకే పరిమితం చేసినప్పటికీ ఆ పేరుతో పన్నుల వసూళ్ళ శాతాలను భారీగా పెంచడంతో 3,72,971 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని వివరించారు.

2019వ సంవత్సరం వరకూ సెస్-సర్‌చార్జీల రూపంలో 1,10,180 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చేది. రెండేళ్ళు తిరక్కుంగానే తొమ్మిది రంగాలపై సెస్, సర్‌చార్జీల ఆదాయం 3.73 లక్షల కోట్లకు పెరగడంతో మొత్తం ఆర్ధిక మంత్రిత్వశాఖ పెద్దలే ఆశ్చర్యానికి గురయ్యారని తెలిపారు. జిఎస్‌టితో పాటుగా సెస్, సర్‌చార్జీల రూపంలో దేశ ప్రజల నుంచి వసూలు చేసిన నిధులే రికార్డుస్థాయిలో 39 లక్షల కోట్ల రూపాయలు ఖజానాలో మూలుగుతున్నాయని, ఇందులో ఏ ఒక్క రూపాయిని కూడా రాష్ట్రాలకు వాటాలు ఇవ్వకుండా కేంద్రం మొండివైఖరినే ప్రదర్శిస్తోందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. సెస్, సర్‌చార్జీల ఆదాయంలో కూడా తమకు వాటాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంతోపాటుగా ఒరిస్సా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని డిమాండ్ చేయడమే కాకుండా మార్చి నెలలో జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఆ తర్వాత జరిగిన వానాకాలం సమావేశాల్లో కూడా ప్రతిపక్ష, మిత్రపక్ష పార్టీల ఎంపీలు గళమెత్తారు.

అయినప్పటికీ కేంద్రం రాష్ట్రాలపై కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తంచేశారు. సెస్, సర్‌చార్జీల ఆదాయం లో వాటాలు ఇవ్వకపోగా కనీసం రాష్ట్రాల్లో అమలులో ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలనైనా కొనసాగిస్తారా? అంటే అదీలేదని, ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన పథకాలను కేంద్రం చెప్పాపెట్టకుండా రద్దు చేయడంతో ఆ యా పథకాలను అమలుచేస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు తీవ్రమైన ఆర్ధిక భారం పడుతోందని ఆ అధికారులు వివరించారు. లక్షల కోట్ల రూపాయల నిధులు ఖజానా లో మూలుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం చలించకుండా ఉంటోందని, ఇప్పటికైనా తెలంగాణ రా ష్ట్రానికి ఇవ్వాల్సిన 34,149 కోట్ల రూపాయల బకాయిలనైనా విడుదల చేస్తుందా.. అంటే అదీలేదని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2021-22వ ఆర్ధిక సంవత్సరానికి రూపొందించుకొన్న బడ్జెట్ పన్నుల రూపంలో 22.17 లక్షల కోట్ల రూపాయల ఆదా యం వస్తుందని అంచనా వేసిందని, కానీ ఆర్ధిక సంవత్స రం ముగిసేనాటికి అంటే గత నెల మార్చి 31 నాటికి రికార్డుస్థాయిలో 27.07 లక్షల కోట్ల రూపాయల ఆదా యం వచ్చిందని,

ఇది అంచనాల కంటే ఏకంగా అయిదు లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చిందని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖాధికారులు అధికారికంగా ప్రకటించడంతో రాష్ట్రంలోని ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు ఇకనైనా కేంద్రం తెలంగాణ రా ష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు, నిధులను విడుదల చేస్తుం దా? అనే ఆశాభావంతో చర్చించుకొంటున్నారు. ఈ ఒరవడి చూస్తుంటే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరమైన 2022-23 ముగిసే నాటికి కేంద్ర ప్రభుత్వ పన్నుల ఆదాయం 32 లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుందని ఆశాభావా న్ని వ్యక్తంచేస్తున్నారు. అందుచేతనే తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరుతున్నారు. అసలే పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు ఇచ్చే 41 శాతం నిధులు కూడా తగ్గిపోయాయని, ఆ వాటా నిధులను కూడా పెంచాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా నిధు లు పెరగాల్సిందిపోయి తగ్గిపోతున్నాయని ఆ అధికారు లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 2022-23వ ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి కేవలం 23,165 కోట్ల రూపాయలు మాత్రమే పన్నుల వాటా నిధులు వస్తాయని, వాస్తవానికి 30 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు రావాల్సి ఉందని అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News