Friday, January 24, 2025

కోర్టుల్లో కేసులు ముగిశాకే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విధితమే. సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో టిఆర్‌ఎస్ ఎంపి రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.‘తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు పెంపునకు సంబంధించిన బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందింది.

ఆ రిజర్వేషన్లను పది శాతం వరకు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్ర హోంశాఖకు చేరింది. రిజర్వేషన్లకు సంబంధించిన కొన్ని కేసులు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. న్యాయస్థానంలో కేసుల పరిష్కారం తర్వాతే దీనిపై ముందకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

2017లో గిరిజన రిజర్వేషన్ల బిల్లుకు తీర్మానం..

దశాబ్దాలుగా అణచివేతకు, దోపిడీకి గురైన గిరిజనులకు న్యాయం చేసేందుకు రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తమిళనాడులో మొత్తం రిజర్వేషన్లు 1994లో 50 శాతాన్ని దాటి 69 శాతానికి పెరిగిపోయిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో పెరిగిన రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం ద్వారా కేంద్రం రాజ్యాంగ బద్ధత కల్పించింది. తమిళనాడు మాదిరి తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి కేంద్రం వద్దనున్నది.ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 17వ తేదీన ఆదివాసీ, బంజారా భవనాలు ప్రారంభించినప్పుడు కూడా దీనిపై మరోసారి విస్పష్ట ప్రకటన చేశారు.

టిఆర్‌ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో సైతం దీనిపై హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపుపై విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎస్ చెల్లప్ప నేతృత్వంలో కమిషన్ కూడా వేశారు. ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను 2017లో ఏప్రిల్ 15న రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. ఆ తర్వాతి రోజే శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఏళ్లు గడుస్తున్నా… కేంద్రం సాగదీత ధోరణి అవలంభిస్తుడంతో మరోసారి తీర్మానం చేసి.. స్వయంగా రిజర్వేషన్లు పెంచుతూ సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 30న నోటిఫికేషన్ జారీ చేసి.. అక్టోబరు 1 శనివారం నుంచి పెరిగిన రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ ఉత్తర్వులలో సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో రిజర్వేషన్ల వాటా 46 శాతం మాత్రమే అమల్లో ఉన్నట్లవుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే.. తాజాగా ఎస్టీలకు 6 శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచడం ద్వారా తిరిగి 50 శాతం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News