వంట నూనెల ధరల కట్టడికి కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ: కనీ వినీ ఎరుగని రీతిలో పెరిగిపోతున్న వంటనూనెల ధరలను అదుపు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకునే పామాయిల్, సోయాబీన్, సన్ ఫ్లవర్ నూనెలపై బేస్ కస్టమ్స్ డ్యూటీలను తగ్గించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దిగుమతి చేసుకునే ముడి పామాయిల్‌పై బేస్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతంనుంచి 2.5 శాతానికి తగ్గించినట్లు, అలాగే ముడి సోయాఆయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 7.5 శాతంనుంచి 2.5 శాతానికి తగ్గించినట్లు శుక్రవారం రాత్రి పొద్దుపోయాక విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారంనుంచి ఈ నోటిఫికేషన్ అమలులోకి వచ్చింది. ఈ తగ్గింపుతో ముడి పామాయిల్, ముడి సోయా ఆయిల్, ముడి సన్‌ఫ్లవర్ నూనెలపై వాస్తవ సుంకం 24.5 శాతానికి తగ్గుతుందని, రీఫైన్డ్ పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ నూనెపై వాస్తవ సుంకం 35.75 శాతానికి తగ్గుతుందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఇఎ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బివి మెహతా పిటిఐకి తెలిపారు.
తాజాగా సుంకాల తగ్గింపుతో వంటనూనెల రిటైల్ ధరలు లీటర్‌కు రూ.45 మేరకు తగ్గుతాయని ఆయన చెప్పారు. అయితే భారత్ తన దిగుమతి సుంకాలను తగ్గించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో వంటనూనెల ధరలు పెరిగాయని, అందువల్ల వాస్తవంగా తగ్గుదల ప్రభావం లీటరుకు రూ.2 3 మాత్రమే ఉంటుందని ఆయన తెలిపారు. ధరలు తగ్గడం కోసం ప్రభుత్వం ఆవ నూనెలపై కూడా దిగుమతి సుంకాన్ని తగ్గించాలని మెహతా అన్నారు. గత కొద్ది నెలల్లో ప్రభుత్వం వివిధ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో పాటుగా టోకు వ్యాపారులు, మిల్లర్లు, రిఫైనర్లు, స్టాకిస్టుల వద్దనుంచి వంటనూనెలు, నూనె గింజల స్టాక్స్ వివరాలను తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. అంతేకాకుండా వంట నూనెల సాగును ప్రోత్సహించడం కోసం రూ.11,040 కోట్ల పామాయిల్ మిషన్‌ను కూడా ప్రకటించింది. గత చమురు సంవత్సరం (నవంబర్ అక్టోబర్) మన దేశం దిగుమతి చేసుకున్న వెజిటబుల్ ఆయిల్స్ 98,25,433 టన్నులు కాగా 2020 నవంబర్ నుంచి 2021వరకు దిగుమతి చేసుకున్నవెజిటబుల్ ఆయిల్స్ 96, 54,636 టన్నులుగా ఉందని, అంటే క్రితం ఏడాదితో పోలిస్తే దిగుమతులు 2 శాతం తగ్గాయని ఎస్‌ఇఎ తెలిపింది. కాగా దేశంలో వంటనూనెల సరఫరాలను పెంచడం కోసం కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు గత నెల ముడి సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని సగానికి అంటే 7.5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.