Wednesday, January 22, 2025

పటిష్ట పునాది విద్య ఆవశ్యకత

- Advertisement -
- Advertisement -

నూతన విద్యా విధానం -2020 ప్రకారం కొత్త పుస్తకాలను తయారు చేసే పనిలో ఎన్‌సిఇ ఆర్‌టి నిమగ్నమై ఉన్నది. ఎన్‌సిఎఫ్- 2022 ప్రకారం ముఖ్యంగా ప్రీ స్కూల్ మూడు సంవత్సరాలు, ఒకటవ, రెండవ తరగతుల పుస్తకాలు ముద్రిస్తున్నారు. మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు గల విద్యార్థులకు బోధన అభ్యసన ప్రక్రియలు నిర్వహించడానికి పుస్తకాలు తయారు చేస్తున్నారు. 2024 -25 విద్యా సంవత్సరం నుంచి (ఆరంభ బాల్య సంరక్షణ విద్య) ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ ఎడ్యుకేషన్ (ఇసిసిఇ) లో భాగంగా అన్ని భాషల విద్యార్థులు వినియోగించడానికి వీలుగా సుమారు 22 భాషల్లో పుస్తకాలను ముదిరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నాలుగు భాషలలో పుస్తకాల ముద్రణ పూర్తి అయింది. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, సంస్కృత భాషలలో భాష, గణితానికి సంబంధించిన అయిదు తరగతుల పుస్తకాల ముద్రణ పూర్తయింది. గణితం అన్నిభాషల్లో ముద్రణ పూర్తయింది. మిగిలిన భాషల్లో ముద్రించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఎస్‌సిఆర్‌టిల సహకారం తీసుకోనున్నారు.
ప్రీ స్కూల్‌లో మొదటి మూడు సంవత్సరాల పాఠ్యప్రణాళికలో భాషాపరమైన, గణితపరమైన నైపుణ్యాలను ప్లేవే మెథడ్ ద్వారా బోధించనున్నారు.

దీని కోసం దేశీయంగా తయారైన ఆట వస్తులను ఎక్కువగా వినియోగించాలని నిర్ణయించారు. విభిన్నవర్గాల నుంచి వచ్చే పిల్లలకు ఇంట్లో ఆట వస్తువుల అందుబాటు ఒకే రీతిగా ఉండదు. కాబట్టి విద్యార్థులలో కాగ్నేనేటివ్ స్కిల్స్‌లో వైవిధ్యాలను, అంతరాలను గమనించడం జరిగింది.కుటుంబ ఆర్థిక, సామాజిక అభివృద్ధి పిల్లల నైపుణ్యాలపై ప్రభావం చూపిస్తుందని దేశ వ్యాప్తంగా జరిగిన పరిశోధనలో తేలింది. దీనిని బాల్య దశలోనే ప్రీ స్కూల్ స్థాయిలో విద్యార్థులు అధిగమించేటట్లు పాఠ్యప్రణాళిక తయారు చేయడం జరిగింది. వీటన్నింటిని అధిగమించడానికి పాఠ్యప్రణాళికలో ఆటలకు, ఆట వస్తువులకు,ఆట వస్తువుల ద్వారా విద్యాబోధనకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. స్థానికంగా చాలా కాలం నుంచి వాడుకలో ఉన్న ఆట వస్తువుల వినియోగం ముఖ్యమైనది. వాటిని పాఠ్యప్రణాళికకు అనుగుణంగా స్వల్ప మార్పులు చేర్పులతో పాఠశాలల్లో ఉపయోగించాలని కొత్త విద్యా విధానం ప్రతిపాదించింది. ఇది అమలు చేస్తే స్థానిక బొమ్మల తయారీదారులకు మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉన్నది. ఇసిసిఇ ద్వారా ముఖ్యంగా భాష, గణితం అంశాల్లో అభ్యసన సంక్షోభాన్ని తొలిగిస్తారు.

అదే విధంగా ఇసిసిఇ చదువుకోలేని పేద వర్గాలకు, ఉన్నత వర్గాలకు మధ్య విద్యలో తీవ్రమైన వ్యత్యాసాన్ని తగ్గిస్తారు. అందుకే ఇసిసిఇని ప్రభుత్వం ఎన్‌ఇపి- 2020లో అతిముఖ్యమైన అంశంగా పేర్కొన్నది. దీని ద్వారా సమాజంలోని అనేక అసమానతలను తొలిగించవచ్చు. బాల్యాన్ని కనీసం సమానంగా అనుభవించే అవకాశం గ్రామీణ బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అందించినట్లవుతుంది. ఎందుకంటే ఉన్నత వర్గాల పిల్లల ఆట వస్తువులు కావొచ్చు, వేసుకునే డ్రెస్‌లు కావొచ్చు, వారు తినే ఆహారం కావొచ్చు, వాళ్లకు వచ్చే ఆరోగ్యం, పరిశుభ్రమైన మద్దతు కావొచ్చు తప్పకుండా చాలా విభిన్నంగా ఉంటుంది. అదే మురికివాడల్లో, అపరిశుభ్రమైన పరిస్థితుల్లోనో ఆరోగ్య విషయాలను పట్టించుకోనటువంటి ఒక పరిసర ప్రాంతాల్లో భారతీయ బాల్యానికి భరోసాను ఇస్తూ, మంచి పౌష్టికాహారం కలిగి ఒక చక్కటి వాతావరణంలో పెరిగేటువంటి భావిభారత పౌరులను తీర్చిదిద్దడానికి ఇసిసిఇ సెంటర్లు ఉపయోగపడుతాయి. ఇసిసిఇపైన ఒక రూపాయి పెట్టుబడి పెడితే అది పది రూపాయల ప్రయోజనాన్ని ఇస్తుందని విశ్వసిస్తున్నారు. కాబట్టి ఇసిసిఇ అతి ముఖ్యమైన విభాగం.

ఈ దేశంలో ఇసిసిఇ ని గ్రామీణ ప్రాంత బడుగు, బలహీన వర్గాలకు అందజేయాలని అనేక సంవత్సరాలుగా బలమైన డిమాండ్ ఉన్నది. ఎన్‌ఇపి-2020 ద్వారా దీన్ని ప్రవేశపెట్టడంతో విద్యార్థులు అందరికీ అవకాశం లభించింది. ఇసిసిఇ లోనూ కరికులం వైవిధ్యంగా ఉంటుంది. ఎందుకంటే విభిన్న ప్రాంతాల భాష, మాండలికం, అక్కడ ఉన్న పౌష్టికాహార అలవాట్ల ఇసిసిఇ పాఠ్యప్రణాళికలో చేర్చనున్నారు. ఒకే రకమైన పాఠ్యప్రణాళిక భాషలో ఉండదు. గణితంలో కొంత వరకు ఉన్నా, గణితం బోధన ప్రక్రియకు సంబంధించి తీసుకునేటువంటి ఉదాహరణలు స్థానిక పరిస్థితుల ద్వారా బోధించే బోధనా పద్ధతిగాని తప్పకుండా విభిన్నతకు ఆస్కారం కల్పిస్తుంది. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూనే పిల్లలకు అనవసరమైన ఒత్తిడిని కలిగించకుండా మాతృభాషను జోడించుకుంటూ భాష అసలు సిసలు నైపుణ్యాన్ని కల్పించడం. భాష అసలు సిసలు నైపుణ్యాలు అంటే వినడం, మాట్లాడటం, మాట్లాడిన దానిని అర్థం చేసుకోవడం, అనంతరం రాయడం వస్తుంది. కానీ చాలా చోట్ల రాయడాన్నే మొదట నేర్పిస్తుంటారు.

వినడం, మాట్లాడటం, విన్న దానిని అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్న దాన్ని తనదైనటువంటి భాషలో కొంత నూతనంగా వ్యాఖ్యానం చేయడం ఇవి మొదలు మనకు కావాలి. పిల్లలను పెంచేటప్పుడు ఇవే పద్ధతులను మనం గమనిస్తాం. కానీ ప్లే స్కూల్ కూర్చోబెట్టి అక్షరాలు రుబ్బి రుబ్బి దిద్దించే కార్యక్రమాలు చేస్తున్నారు. అలా కాకుండా శాస్త్రీయ పద్ధతిలో ఇసిసిఇ బోధనా విధానాన్ని తీసుకుని రాబోతున్నారు. బోధనా విధానం, పాఠ్యప్రణాళిక, అంచనా వేసే పద్దతి ఈ మూడు చాలా భిన్నంగా ఉంటాయి. ఇసిసిఇలో తెచ్చిన పాఠ్యప్రణాళిక ఆధారంగానే తర్వాతపై తరగతుల్లోనూ ప్లే వే పద్ధ్దతిలో మనకు ప్రాథమిక స్థాయి పాఠ్యప్రణాళిక పుస్తకాలు ఉంటాయి. ఇసిసిఇలలో విద్యార్థుల ఆరోగ్యం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. ఇప్పటికే అంగన్వాడీలలో అందిస్తున్న ఆహారానికి అదనంగా పోషక విలువలు ఉన్న పదార్థాలను జోడించడం ద్వారా అదనపు పౌష్టికాహారాన్ని అందించనున్నారు.

మన దేశంలో 14.8 లక్షల పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 28 వేల పాఠశాలల్లో సిబిఎస్‌సి బోర్డు, 2000ల ఐసిఎస్‌ఇ, 345 ఐబి స్కూల్స్ ఉన్నాయి. మిగిలినవన్నీ వివిధ రాష్ట్రాల బోర్డుల పరిధిలో ఉన్నాయి.ప్రతి పాఠశాలలో ‘జాదూయీ పిటారా’ పేరుతో ఒక మ్యాజిక్ బాక్స్‌ను అందుబాటులో ఉంచనున్నారు. ఎన్‌సిఎఫ్ 2022 ప్రకారం ఐదు పద్ధతుల విద్యాభ్యాసన నిర్వహించబడుతుంది. ఈ ప్రక్రియకు ‘పంచాది’ అని నామకరణం చేశారు. భారతీయ విద్యామూలాల ఆధారంగా ఈ ఐదు దశలను రూపొందించినట్లు ప్రకటించింది. ప్రీ స్కూల్‌ని పునాది స్థాయిగా భావిస్తారు. ఇక్కడ విద్యార్థులకు మేధోపరమైన, శారీరక అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఎన్‌సిఎఫ్‌లో ఐదు బోధన పద్ధతులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇన్ని రోజులు మనం బట్టి పట్టి నేర్చుకునే విధానానికి తిలోదకాలు ఇవ్వడానికి శాస్త్రీయమైన పద్ధతిలో పుస్తకాలను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. గతంలో పిల్లలతో రైమ్స్ (rhymes) బట్టి వేయించేవాళ్లం.

అలా కాకుండా ఒక అర్థవంతంగా ఐదు పద్ధతుల్లో అతిథి, బోధ్, అభ్యాస్, ప్రయోగ్, ప్రసార్ అంశాల ఆధారంగా పుస్తకాలను అభివృద్ధి చేయనున్నారు. cognitive skills, critical thinking అభివృద్ధి చెందుతాయి. అంటే జ్ఞానానికి సంబంధించిన నైపుణ్యాలు, సునిశితంగా పరిశీలించి ప్రతిస్పందించే అలవాటునే చిన్నప్పటి నుంచే అభివృద్ధి చేస్తారు. సంస్కృత పదాలు కావడం వల్ల కొత్తగా అనిపిస్తున్నాయి. ఈ ఐదు దశలను తెలుగులో చెప్పాలంటే పరిచయం, భావనలపై అవగాహన, సాధన, వినియోగం, విస్తృత పరచడం. ఇవి ఎన్‌సిఎఫ్ 2005లో ప్రతిపాదించినవే. అయినప్పటికీ స్వల్ప మార్పులతో ప్రస్తుతం అమలు చేస్తున్నారు. విద్యార్థులపై సంస్కృత భాషా పదాలను బలవంతంగా రుద్దినట్టు కొత్తగా పెట్టిన పేర్లు పదబంధాలను బట్టి అర్థమవుతుంది. జ్ఞానం, విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలు అభివృద్ధి చెందితేనే విద్యార్థికి నిజ జీవిత సమస్యల పరిష్కారానికి సంబంధించిన నైపుణ్యాలు పెంపొందుతాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని పాఠ్యప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని ఎన్‌సిఇఆర్‌టి ప్రకటించింది. ఈ రోజు కూడా ఒకటి, రెండవ తరగతి పుస్తకాలు ప్రైవేట్ పబ్లిషర్స్ చేతిలోనే ఉన్నాయి.

వీటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పుస్తకాలు తయారు చేసినప్పటికీ కూడా పెద్ద పెద్ద పబ్లిషింగ్ హౌసెస్ ఆక్స్‌ఫర్డ్ లాంటి పెద్ద సంస్థల గుత్తాధిపత్యంలో ముద్రితమయ్యే పుస్తకాలు ఖరీదైనవి. సామాన్యులు కొనలేని ధరల్లో పుస్తకాలు ఉండే వి. అలా కాకుండా ఇప్పుడు ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలను తయారు చేయడం ద్వారా అందరికీ ఒక విధమైన పుస్తకాలు అందేటువంటి అవకాశముంది. ఈ పుస్తకాలను తయారు చేసిన తర్వాత విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి సూచనల స్వీకరించేందుకు పబ్లిక్ డొమైన్‌లో పెట్టడం జరుగుతుంది. అయితే కొన్ని పబ్లిషింగ్ సంస్థలు ఎన్‌సిఎఫ్ 2022కు అనుగుణంగా ఇప్పటికే పుస్తకాలు తయారు చేసినట్లు ప్రకటించడం విమర్శలకు దారి తీస్తున్నది. ఎన్‌సిఇఆర్‌టి తయారు చేయక ముందే ప్రైవేట్ సంస్థలు ఎలా తయారు చేశాయి, ఎందుకు ఈ విధంగా ప్రచారం చేసుకుంటున్నాయి? వీటిపైన చర్యలు ఏమి ఉంటాయని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం అంగన్వాడి సెంటర్లు, ప్రాథమిక పాఠశాలలకు మూడు సంవత్సరాల నర్సరీ విద్యా ప్రణాళికకు అనుగుణంగా పాఠశాల భవనాలు, ఇతర వసతులు సిద్ధంగా లేవు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసులో పిల్లల సంఖ్య 6.5 లక్షల పైగా ఉంది. పుస్తకాల సిద్ధం చేయగానే సరిపోదు. వాటిలో ఉన్న ప్రణాళికను అమలు చేయడానికి అవసరమైన నిధులు మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయడం ముఖ్యం. వీటి ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన నిధులు ఖర్చు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా పూర్వప్రాథమిక విద్యా బోధన చేసే ఉపాధ్యాయుల కోసం విస్తృత స్థాయిలో శిక్షణ కళాశాలలు కూడా ఏర్పాటు చేయవలసి ఉంది. ఇసిసిఇపై అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కోర్సు ప్రారంభించారు. ప్రస్తుతం ఉపాధ్యాయులను వినియోగించుకోవాలన్నా వారికి ప్రత్యేకమైన శిక్షణ అవసరం ఉంటుంది. ఇసిసిఇ రాష్ట్రంలో 2024 నుంచి ప్రారంభం కానున్నాయి.

ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయి. వాటిని విద్యాశాఖ పరిధిలోకి తెచ్చి ప్రీ స్కూల్‌లో పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు, పౌష్టికాహారాన్ని అందించాలంటే దానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న ఆయా, అంగన్వాడీ టీచర్‌తో పాటు మరో ఇద్దరు అవసరమవుతారు. ఇసిసిఇ పాఠ్యప్రణాళికను అమలు చేయాలంటే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరం. అప్పుడే పిల్లలకు మెరుగైన బోధన చేయగలరు, బోధించగలుగుతారు. అలాగే మౌలిక సదుపాయాలు కల్పించాలి. పిల్లలకు బొమ్మల ద్వారా ఒత్తిడి లేకుండా చదువు నేర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు నూతన బోధన అభ్యసన ప్రణాళిక అమలు కోసం రాబోయే సంవత్సర కాలంలో అన్ని రకాల సదుపాయాలను సిద్ధం చేసుకోవాలి. అందులో భాగంగా కొత్త పుస్తకాలలో పేర్కొన్న అభ్యసన సామాగ్రి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మంచి నైపుణ్యంతో కూడిన ప్రీ ప్రైమరీ టీచర్లను ఎంపిక చేయవలసి ఉంటుంది. ఆరంభ దశలో విద్యార్థులకు మంచి పునాది పడితే మధ్యమ,సెకండరీ స్థాయిలో విద్యార్థులు ఆశించిన నైపుణ్యాలతో ప్రపంచంతో పోటీపడ గల సామర్థ్యాలను సాధిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News