Wednesday, January 22, 2025

నిధుల విడుదల్లో కేంద్రం నిర్లక్ష్యం..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదల్లో జాప్యం చేయడంతో రాష్ట్రంలో స్మార్ట్‌సిటీ పథకం పనులు నత్తనడకన జరుగుతున్నాయి. గ్రేటర్ వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ఇంకా 117 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. కరీంనగర్‌లో కేవలం 10శాతం, వరంగల్ సుమారు 35 శాతం పనులు పూర్తయ్యాయని, మొత్తం 144 ప్రాజెక్టుల్లో 27మాత్రమే పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లోని ద్వితీయ శ్రేణి నగరాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా తెలంగాణ నుంచి గ్రేటర్ వరంగల్, కరీంనగర్ నగరాలను స్మార్ట్‌సిటీలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ రెండు నగరాలో మౌలిక వసతుల కోసం ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి రూ.100 కోట్లను ఈ పథకంలో భాగంగా ఖర్చు చేయాలని నిర్ణయించాయి. అయితే, కరీంనగర్‌లో స్మార్ట్‌సిటీ కింద 62 ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉండగా 8, గ్రేటర్ వరంగల్ జిల్లాలో 82 ప్రాజెక్టులకు గాను 18 మాత్రమే పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.
వర్క్ ఆర్డర్ దశలో వరంగల్‌లో 18, కరీంనగర్‌లో 09…
గ్రేటర్ వరంగల్‌లో 12 ప్రాజెక్టులు డిపిఆర్ దశలో ఉండగా, కరీంనగర్‌లో 31 ప్రాజెక్టులున్నాయి. టెండర్ దశలో గ్రేటర్ వరంగల్ లో 9, కరీంనగర్‌లో 6 ప్రాజెక్టులున్నాయి. పని అప్పగించే దశ (వర్క్ ఆర్డర్)లో వరంగల్ 18, కరీంనగర్‌లో 9 ఉన్నాయని అధికారులు తెలిపారు. సకాలంలో కేంద్రం తమవంతుగా నిధులు కేటాయించి, ఖర్చు చేసి ఉంటే ఈ ప్రాజెక్టులు ఇదివరకు పూర్తయ్యేవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 2022 మార్చి 4వ తేదీ వరకు కేంద్ర గృహ నిర్మాణ, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలోని 100 స్మార్ట్‌సిటీలకు గాను రూ.59,959 కోట్లు ఖర్చు చేసి 3,576 ప్రాజెక్టులను మాత్రమే పూర్తి చేసింది.

Centre Govt delay to releasing funds

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News