Friday, January 10, 2025

దక్షిణాదిపై కేంద్రం వివక్ష!

- Advertisement -
- Advertisement -

దేశంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. సాధారణంగా ఎన్నికలంటేనే హైవోల్టేజ్. ఇప్పుడు ఎన్నికలు వేసవి కాలంలో జరుగుతున్నందున మరింత హీట్ రాజుకోనున్నాయి. మరోవైపు కేంద్రంలో తిరిగి ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సర్వేలతో ఎన్‌డిఎ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేసినా అధికారం వైపుగా తగినన్ని సీట్లు వస్తాయనడంలో అనుమానమేనని ఇప్పటివరకూ విడుదలైన సర్వేలు చెబుతున్నాయి. ప్రధానంగా బిజెపికి దక్షిణాది రాష్ట్రాల్లో తగిన ప్రాతినిధ్యం తక్కువే అని చెప్పాలి. అయితే నిన్నమొన్నటి వరకు బిజెపి కర్నాటక రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆ తరువాత స్థానంలో తెలంగాణ రాష్ట్రమనే చెప్పాలి. అయితే ఇక్కడి బిజెపికి ఆశించినన్ని స్థానాలు లభించకపోయినా పార్టీ బలం గా పని చేస్తుందని చెప్పొచ్చు. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఇప్పటికే రెండు దఫాలు పాలన సాగించింది. మూడోసారి హ్యాట్రిక్ సాధించేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది.

మొదటి నుండీ ఎన్‌డిఎ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందన్న విమర్శలు వస్తూనే ఉన్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం దక్షిణాదిలో బిజెపి పార్టీని బలోపేతం చేసుకోవడానికే చూస్తోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని పలువురు వాదిస్తున్నారు.పన్ను రాబడిలో తమకు తక్కువ వాటా ఇస్తున్నారని తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల మధ్య ఆర్థిక సమాఖ్య ఏర్పాటు చేయాలని కూడా కర్నాటక డిమాండ్ చేస్తోంది. పన్నుల ద్వారా తమకు రావాల్సిన వాటాలో తక్కువ నిధులు పంపిణీ చేస్తున్నారని గత కొద్ది రోజులుగా కేరళ, కర్నాటక రాష్ట్రాలు కేంద్రంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం సుదీర్ఘ కాలంగా ఆరోపణ చేస్తుండగా, తాజాగా ఇతర దక్షిణాది రాష్ట్రాలు కూడా ఆ రాష్ట్రానికి మద్దతుగా నిలిచాయి. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక సమాఖ్య ఏర్పాటుకు కర్నాటక ప్రయత్నిస్తోంది. 2024 ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం మధ్యంతర ఆర్థిక బడ్జెట్ సమర్పించిన తర్వాత, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సోదరుడు,

కాంగ్రెస్ ఎంపి డికె సురేశ్ మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలను ఇలా నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక దేశం డిమాండ్‌ను లేవనెత్తాల్సి వస్తుందని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు భారీ చర్చకు దారి తీశాయి. అంతేకాదు నిధుల పంపిణీలో కర్నాటకను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫిబ్రవరి 7న ఢిల్లీలో నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు.ఆ మరునాడు కేరళకు చెందిన ఎంఎల్‌ఎలు, ఎంపిలు కూడా తమ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఢిల్లీలో నిరసనకు దిగారు. ఆ కార్యక్రమానికి ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించారు. తమిళనాడులోని డిఎంకె కూడా ఈ నిరసనలో పాల్గొంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదే రకమైన ప్రకటన చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపకానికి సంబంధించి గత కొన్నేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రాల నుంచి సేకరించిన నిధులు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత తిరిగి ఆయా రాష్ట్రాలకు పంపిణీ అవుతాయి. ఈ నిధుల కేటాయింపు వివిధ ప్రమాణాల ఆధారంగా జరుగుతున్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ఈ నిధుల కేటాయింపు ఎలా చేయాలో నిర్ణయించడానికి ప్రతి ఐదేళ్లకు ఒక ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఈ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు పంచుకుంటాయి. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు (2021- 2026) అమలులో ఉన్నాయి.

అయితే 13వ ఆర్థిక సంఘం ఉన్నంత వరకు ఆదాయంలో 32% మాత్రమే రాష్ట్రాలకు పంపిణీ అవుతుంది. అయితే 14వ ఆర్థిక సంఘం ఈ విధానాన్ని కాస్తంత మార్చింది. రాష్ట్రాలకు నిధుల కేటాయింపును 32 నుంచి 42 శాతానికి పెంచింది. ప్రతి రాష్ట్రం ఈ 42 శాతం నిధులను ఎలా పంచుకోవాలో 14వ ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుంది. ఈ భాగస్వామ్యం ఆరు అంశాలను దృష్టిలో పెట్టుకొని మంజూరు చేస్తారు. అందులో రాష్ట్రాల విస్తీర్ణం (15% ), రాష్ట్రాల జనాభా (15%), అత్యల్ప తలసరి ఆదాయం (45%), అటవీ, పర్యావరణం (10%), పన్ను వసూలులో రాష్ట్రాల సామర్థ్యం (2.5%) ఉన్న రాష్ట్రానికి అదనపు నిధులు, జనాభా నియంత్రణలో రాష్ట్రాల పని తీరు (12.5%) ఉన్నాయి.
70వ దశకం మధ్యలో భారత దేశం తన జనాభా పెరుగుదలను నియంత్రించే ప్రయత్నాలను ముమ్మరం చేయడం ప్రారంభించింది.తొలి జాతీయ జనాభా విధానాన్ని 1976లో రూపొందించారు. దీని తర్వాత ఒక్కో రాష్ట్రం ఒక్కో స్థాయిలో జనాభా నియంత్రణ ప్రారంభించింది. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు తగ్గడం మెదలైంది.కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో అలా జరగలేదు. జనాభా వేగంగా పెరగడం కొనసాగింది. ఆ విధంగా 1976 తర్వాత ఏర్పాటైన ఫైనాన్స్ కమిషన్లు 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా ఉపయోగించాయి. 14వ ఆర్థిక సంఘం వరకు ఇదే పద్ధతి ఉంది. కానీ, 15వ ఆర్థిక సంఘం తాజా జనాభా లెక్కలను ఉపయోగించాలని ఆదేశించింది. దీంతో 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

‘కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం వచ్చే రాష్ట్రాలు దక్షిణ భారత రాష్ట్రాలు. కానీ వాటిని ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి మాత్రమే ఉపయోగిస్తున్నారు’ అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతం లో ఆరోపించారు.15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన సిఫార్సులు దక్షిణాది రాష్ట్రాలకు మరో షాక్ ఇచ్చాయి. జనాభా నియంత్రణలో మెరుగైన పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు అదనపు పాయింట్లు ఇస్తామని ఫైనాన్స్ కమిషన్ చెప్పగా, ప్రారంభ సంవత్సరంగా 1976కి బదులు 2011ని పరిగణనలోకి తీసుకున్నారు. దీని ఫలితంగా 1970, 80లలో జనాభాను భారీగా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు ఆశించిన ప్రయోజనం పొందలేదు. అనంతరం మీడియాలో దీనికి సంబంధించిన చర్చలు, కథనాలు వచ్చాయి. కానీ రాజకీయంగా ముందుకు కదల్లేదు. అయితే పన్నుల వసూళ్లు పంచివ్వడంలో దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తున్నారనే వాదన గత కొద్ది కాలంగా మళ్లీ మొదలైంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం రూ. 2,12,680 కోట్లు కేటాయించారు. రూ. 1,92,514 కోట్లు కర్ణాటక రాష్ట్రానికి పంపిణీ అయ్యింది. రూ. 2,34,013 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు.

గుజరాత్‌కు రూ. 1,84,154 కోట్లు పంపిణీ చేశారు. అయితే ఉత్తరప్రదేశ్‌కు రూ. 8,55,000 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ. 3,82,010 కోట్లు, బీహార్‌కు రూ. 4,78,751 కోట్లు పంపిణీ చేయడంతో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రానికి చిన్నచూపు ఉందనేది ఈ లెక్కలతో తేలిపోయింది. ఈ వాదనను బిజెపి తమిళనాడు ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి వ్యతిరేకిస్తున్నారు. కర్నాటక, తమిళనాడు మొదలైనవి అధిక ఉత్పత్తి కలిగిన రాష్ట్రాలు. అందువల్ల అక్కడ పన్ను ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నివాసితులు ఈ రాష్ట్రాల్లోని ఉత్పత్తులను కొని పన్నులు చెల్లిస్తారు. తమిళనాడు తీరప్రాంత రాష్ట్రం, ఇక్కడ ఓడరేవులు ఉన్నాయి. ఓడరేవులు ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే ఫ్యాక్టరీలు ఏర్పాటవుతాయి. కాబట్టి నిధులను పంచుకోవాలి’ అంటున్నారు. ‘మరోవైపు తమిళనాడు వంటి రాష్ట్రాలు పన్ను మినహాయింపు ఉన్న కార్ల వంటి ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో వ్యవసాయం ఎక్కువగా జరుగుతుంటుంది. వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను లేదు. కాబట్టి రెండు రాష్ట్రాలను పోల్చలేం.

అంతేకాకుండా ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాల మధ్య నిధులు పంపిణీ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. నిజానికి కాంగ్రెస్ హయాంలో కంటే ఎక్కువ నిధులు పంపిణీ చేస్తున్నారు’ అని నారాయణన్ అన్నారు. ఇపుడు దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక సమాఖ్యను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా పెరిగింది. 2018లో 15వ ఆర్థిక సంఘం నిబంధనలను విడుదల చేసినప్పుడు దక్షిణాదిరాష్ట్రాలు అసంతృప్తితో ఉన్నందున ఆర్థిక మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ సూచించారు. ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. అయితే దక్షిణాది రాష్ట్రాల పన్నుల విషయం తెరపైకి తేవడం ఎప్పటిలాగే కాంగ్రెస్ విభజన స్వభావాన్ని ప్రతిబింబిస్తోందని బిజెపి ఆరోపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో లేనందున వారు విభజన గురించి మాట్లాడటం ప్రారంభించారు, వారు అధికారంలోకి రావడానికి ఏదైనా చేస్తారని ఇది నిరూపిస్తోంది అని నారాయణన్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News