న్యూఢిల్లీ: దేశీయంగా బియ్యం ధరలను నియంత్రించేందుకు ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా ఉల్లి ఎగుమతుల విషయంలో అలాంటి నిర్ణయమే తీసుకుంది. ఉల్లి ధరలను కట్టడి చేసి దేశీయంగా సరఫరాలను మెరుగుపరిచేందుకు ఎగుమతులపై 40 శాతం సుంకం విధించాలని నిర్ణయించింది. డిసెంబర్ 31 వరకు ఈ పన్ను అమలులో ఉంటుందని తెలిపింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఒక నోటిఫికేషన్‌లో తెలియజేసింది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్‌బిఐతో కలిసి కేంద్రం ఓ వైపు కృషి చేస్తుండగా ఇటీవల బియ్య ధరలు పెరగడం ప్రారంభమైంది.
దీంతో బియ్యం ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. మధ్యలో భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతిని టమాటా ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. దీంతో టమాటా ధరలను తగ్గించడానికి చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. మరో వైపు సెప్టెంబర్‌లో ఉల్లి ధరలు పెరుగుతాయన్న వార్తలతో అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. బఫర్ స్టాక్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన కేంద్రం ఎగుమతులను తగ్గించే ఉద్దేశంతో ఉల్లి ఎగుమతులపై భారీగా సుంకం విధించింది.