టెట్‌కు శాశ్వత వ్యాలిడిటీ నిర్ణయంతో రాష్ట్రంలో 2.50 లక్షల మందికి ప్రయోజనం
2011 నుంచి మొత్తం ఆరు సార్లు టెట్ నిర్వహణ
2017 జూలై 23న చివరి టెట్
మనతెలంగాణ/హైదరాబాద్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)లో ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలం చెల్లుతుందన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు 2.50 లక్షల మంది అభ్యర్థులను ప్రయోజనం చేకూరనుంది. గతంలో దీని చెల్లుబాటు కాలం ఏడేళ్ళు ఉండేది, తాజాగా దీనిని జీవిత కాలానికి పొడిగించింది. ఈ పొడిగింపు 2011 నుంచి వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన టెట్‌తో కలిపి మొత్తం ఆరు సార్లు టెట్ నిర్వహించారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సిటిఇ) నిబంధనల మేరకు 2011 జూలై 1వ తేదీన ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం మొదటి టెట్ నిర్వహించింది. అనంతరం 2012 జనవరి 8న రెండవ టెట్, 2012 జూన్ 1న మూడవ టెట్ నిర్వహించారు. ఆ తర్వాత 2014, 2016, 2017లలో టెట్ నిర్వహించారు. 2017 జూలై 23న చివరి టెట్ నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో టెట్ నిర్వహించలేదు. ఈ ఆరు టెట్ పరీక్షల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 2.50 లక్షల మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇదివరకు ఉన్న ఏడేళ్ల నిబంధనతో ఇందులో సుమారు 2 లక్షల మంది అభ్యర్థుల వ్యాలిడిలీ ముగిసింది. కేంద్రం తాజా నిర్ణయంతో వ్యాలిడిటీ ముగిసిన అభ్యర్థులకు ప్రయోజనం చేకూరనుంది.
మూడేళ్లుగా వెలువడని నోటిఫికేషన్
రాష్ట్రంలో మూడేళ్లుగా టెట్ నోటిఫికేషన్ వెలువడలేదు. 2017 జూలై 23న చివరి టెట్ నిర్వహించారు. ఆ తర్వాత మూడు విద్యా సంవత్సరాల్లో బి.ఇడి, డి.ఇడి పూర్తి చేసుకున్న వారు లక్షన్నర మంది వరకు ఉన్నారు. వీరందరూ టెట్ నోటిఫికేషన్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ అభ్యర్థులు టెట్‌లో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయ పోస్టులకు అర్హులు అవుతారు. టెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా స్కోర్ పెంచుకునేందుకు మళ్లీ పరీక్ష రాస్తుంటారు. అయితే ప్రభుత్వం 50 ఉద్యోగాల భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అందులో టీచర్ పోస్టులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉండనున్నట్లు తెలిసింది. టెట్ నిర్వహించకుండా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయవద్దని నిర్ణయించినట్లు సమాచారం. ఇదివరకు టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టిఆర్‌టి) నోటిఫికేషన్ ఇచ్చే ముందు కూడా టెట్ నిర్వహించారు. నిరుద్యోగ అభ్యర్థులు గురుకుల టీచర్ పోస్టులకుగానీ, టిఆర్‌టికి గానీ దరఖాస్తు చేసుకునేందుకు టెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెట్‌లో అభ్యర్థులు సాధించిన స్కోర్‌కు ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ, ఉపాధ్యాయ నియామక పరీక్షకు 80 శాతం వెయిటేజీ ఉంటుంది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా టెట్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలిసింది. మూడేళ్ల తర్వాత మళ్లీ టెట్ నోటిఫికేషన్ వెలువడనుంది.
కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు: అలవాల మధుసూదన్
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)లో ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలం చెల్లుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల రాష్ట్ర బి.ఇడి, డిఎస్‌సి అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు అలవాల మధుసూదన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల లక్షల మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్‌కు శాశ్వత వ్యాలిడిటీ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
Central Govt increase TET Certificate Validity for lifetime