డిఎపి సబ్సిడీని 140 శాతం పెంచిన కేంద్రం
రూ.500 నుంచి రూ.1200కు పెంపు
రూ.2400 బస్తా రూ.1200కే రైతుకు..!!
అంతర్జాతీయంగా పెరిగిన ధరలకనుగుణంగా సబ్సిడీ పెంచాలని ప్రధాని ఆదేశం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరిగినా గతేడాది లభించిన ధరకే రైతులకు డిఎపిని మార్కెట్లో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రైతులు విరివిగా వినియోగించే ఎరువు డిఎపి ఒక్కో బస్తాకిచ్చే సబ్సిడీని రూ.1200కు పెంచింది. ఇప్పటివరకూ ఇచ్చిన సబ్సిడీతో పోలిస్తే ఇది 140 శాతం అదనం. ఇప్పటివరకు ఒక్కో బస్తాకు కేంద్రం తరఫున రూ.500 చొప్పున సబ్సిడీ ఇచ్చారు. అంతర్జాతీయంగా ఎరువుల్లో ఉపయోగించే ముడిసరుకులైన ఫాస్పారిక్ యాసిడ్, అమ్మోనియావంటివాటి ధరలు పెరిగినా, గతంలో రైతులు ఏ ధరకు పొందారో ఆమేరకు సబ్సిడీ ఇవ్వాలని ప్రధాని మోడీ ఆదేశించారని ప్రధానమంత్రి కార్యాలయం(పిఎంఒ) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎరువుల ధరలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధాని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పిఎంఒ పేర్కొన్నది.
డిఎపిలో వినియోగించే ముడి పదార్థాల ధరలు అంతర్జాతీయంగా 60 నుంచి 70 శాతంమేర పెరిగాయి. దాంతో,కంపెనీలు డిఎపి బ్యాగ్ ధరను రూ.2400గా నిర్ణయించి విక్రయిస్తున్నాయి. ఇంతకుముందు ఇచ్చిన రూ.500 సబ్సిడీ పోగా, రైతులకు అది రూ.1900కు లభిస్తుంది. ఇప్పుడు కేంద్ర సబ్సిడీని రూ.700 పెంచడంతో రైతులకు రూ.1200కు బస్తా చొప్పున పాత ధరకే(గతేడాది ధరకే) డిఎపి లభించనున్నది. రైతుల ఎరువులకిచ్చే సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా రూ.80,000 కోట్లమేర ఖర్చు చేస్తోంది. తాజాగా డిఎపి సబ్సిడీని పెంచడంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో కేంద్రంపై రూ.14,775 కోట్లమేర అదనపు భారం పడనున్నది.