న్యూఢిల్లీ: ఇప్పటివరకు మంకీపాక్స్ కేసులు లేని దేశాల్లో ఇప్పుడు మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం జిల్లాల అధికార యంత్రాంగానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ఎక్కడ ఏ ఒక్కకేసు బయటపడినా సమగ్ర వ్యాధి పర్యవేక్షణ కార్యక్రమం (ఇంటెగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్) కింద పూర్తిగా పరిశీలించాలని సూచించింది. ఈమేరకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కొత్త కేసులను వేగంగా గుర్తించాలని, ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అలాంటి లక్షణాలు కనిపిస్తే వారిని ఐసొలేషన్‌లో ఉంచాలని, క్లినికల్ కేర్ తీసుకోవాలని, ఎవరివల్ల సంక్రమించిందో ఆ కాంటాక్టులను గుర్తించాలని సూచించింది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, నిబంధనలు అనుసరించాలని సూచించింది. హెల్త్‌వర్కర్లను, సిబ్బందికి ఎలాంటి వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. పొలిమెరేజ్ ఛైన్ రియాక్షన్(పిసిఆర్), లేదా జన్యువిశ్లేషణ ద్వారా వైరస్ డిఎన్‌ఎను గుర్తించి లేబొరేటరీ నిర్ధారించిన మంకీపాక్స్ కేసులను తక్షణమే నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. వ్యాధి లక్షణాలు కనిపించగానే దాదాపు 21 రోజుల పాటు వ్యాధిగ్రస్తులను పర్యవేక్షించాలని, వ్యాధి రిస్కుపై అవగాహన కల్పించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
అనుమానిత కేసుల శాంపిళ్లను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపాలని సూచించింది. గత 21 రోజుల్లో మంకీపాక్స్ సోకిన దేశాలకు ప్రయాణించిన చరిత్ర ఉన్న ఏ వయసు వారైనా, తీవ్రమైన దద్దుర్లు, వాపు, జ్వరం, తలనొప్పి, ఒళ్లంతా నొప్పులు, తీవ్రమైన బలహీనత వంటి ఇతర లక్షణాలు ఉంటే మంకీపాక్స్ వైరస్ అని అనుమానిస్తున్నారు. వీరికి కొద్ది రోజులు రూరంగా ఉండాలని కేంద్రం సూచించింది. మంకీపాక్స్ సోకిన వారు మూడు వారాల పాటు పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఎలుకలు, కోతులు, వంటి జంతువుల నుంచి ఈ వైరస్ ప్రబలుతున్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు. ఈ వైరస్ మధ్య, పశ్చిమాసియాలో ఎండెమిక్ దశకు చేరగా, బ్రిటన్, అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 20 దేశాల్లో 200కు పైగా మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి.
Central Govt issues guidelines for Monkeypox