Tuesday, November 5, 2024

ట్విటర్ గిల్లికజ్జాలు

- Advertisement -
- Advertisement -

Central Govt issues one last notice to Twitter

ఉపరాష్ట్రపతి, ఆర్‌ఎస్‌ఎస్ నేతల బ్లూ టిక్ మార్కులు తొలగింపు,
పునరుద్ధరణ గంటల వ్యవధిలోనే కేంద్రం హెచ్చరిక
ఐటి నిబంధనలు పాటించాలని ఫైనల్ వార్నింగ్, లేకపోతే చట్టపరమైన
చర్యలు తప్పవని ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు

న్యూఢిల్లీ: సోషల్ మీడియా సంస్థ ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త ఐటి నిబంధనల ప్రకారం భారత్‌లో ఇంకా అధికారులను నియమించక పోవడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్త చేసింది. ఈ విషయంలో ఇదే చివరి అవకాశమని, శనివారం తుది నోటీసులు జారీ చేసింది. తక్షణమే అధికారులను నియమించకుంటే  పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. డిజిటల్ మాధ్యమాల్లో కంటెంట్ నియంత్రణ కోసం కేంద్రం కొత్త ఐటి నిబంధనలను తీసుకొచ్చింది. గత నెల 26 నుంచి ఇవి అమలు లోకి వచ్చాయి. అయితే ఈ నిబంధనల ప్రకారం చీఫ్ కాంప్లియన్స్ అధికారిని నియమించాల్సి ఉండగా ట్విటర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అలాగే రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీస్, నోడల్ కాంటాక్ట్ అధికారులను భారత్‌కు చెందిన వ్యక్తులను నియమించలేదని కేంద్రం ఆగ్రహించింది. కొత్త నిబంధనలు పాటించక పోతే ట్విటర్ తన మధ్యవర్తిత్వ హోదాను కోల్పోవలసి వస్తుందని అలా జరిగితే సంస్థ చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్రం హెచ్చరించింది.

ఉపరాష్ట్రపతి బ్లూటిక్ వివాదం
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విటర్ ఖాతాకు బ్లూ వెరిఫైడ్ టిక్ మార్క్‌లను సోషల్ మీడియా సంస్థ శనివారం తొలగించింది. అయితే కొద్ది గంటల తరువాత మళ్లీ ఆయన ఖాతాకు టిక్‌లు పెట్టడం గమనార్హం. గత కొన్ని నెలలుగా ఈ ఖాతాను ఉపయోగించక పోవడం వల్లనే ఈరోజు ఉదయం బ్లూటిక్‌లను తీసి వేసిసట్టు ట్విటర్ ప్రతినిధులు తెలిపారు. ఈ ఖాతా నుంచి జులై 23,2020 న చివరి ట్వీట్ చేశారు. ఆ తరువాత నుంచి ఎలాంటి ట్వీట్లు చేయలేదు. సాధారణంగా ఒక ఖాతా ఆ వ్యక్తికి చెందినదే అని అధికారికంగా చెప్పేందుకు ట్విటర్ ఈ వెరిఫైడ్ టిక్‌ను ఇస్తుంది. అయితే ట్విటర్ నిబంధనల ప్రకారం అకౌంట్ పేరు ( అ తో మొదలయ్యే పేరు ) మార్చినా … ఆరు నెలలకు పైగా ఖాతాను వాడక పోయినా … వెరిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా… ఎలాంటి నోటీసు లేకుండానే ఈ బ్లూటిక్‌లను సంస్థ తొలిగిస్తుండడం పరిపాటి. అయితే దేశానికి ఉప రాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడు వ్యక్తిగత ఖాతాను ట్విటర్ అన్‌వెరఫై చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో కొద్ది గంటల తరువాత తిరిగి ఆయన ఖాతాను బ్లూటిక్‌లను యాడ్ చేసినట్టు తెలుస్తోంది. కేంద్రం, ట్విటర్ మధ్య వివాదం కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ఖాతా బ్లూటిక్ తొలగింపు
ఆర్‌ఎస్‌ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ ట్విటర్ ఖాతాకు కూడా బ్లూటిక్ ట్విటర్ తొలగించింది. భగవత్‌తోపాటు ఆర్‌ఎస్‌ఎస్ నేతలు సరేష్ సోనీ, అరుణ్‌కుమార్, సురేష్ జోషి, కృష్ణకుమార్ వ్యక్తిగత ట్విటర్ ఖాతాలకు బ్లూటిక్‌ను ట్విటర్ తొలగించింది. ఆరు నెలల పాటు ఇనాక్టివేట్‌గా ఉన్న ఖాతాలకు బ్లూటిక్‌ను తొలగిస్తున్నట్టు ట్విటర్ పేర్కొంది. భగవత్‌కు ట్విటర్‌లో సుమారు 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నా ఆయన నుంచి ఒక్క ట్వీట్ కూడా లేక పోవడం గమనార్శం. ఇదే సమయంలో 2019 లో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ ఖాతాలకు ఇప్పటికీ ట్విటర్ బ్లూటిక్ కొనసాగిస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. అయితే సుష్మా ఖాతాను ఆమె భర్త కౌశల్ స్వరాజ్ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అయితే బ్లూ టిక్ తొలగింపుపై విమర్శలు రావడంతో ట్విటర్ తిరిగి ఆయా ఆర్‌ఎస్‌ఎస్ నేతల బ్లూటిక్‌ను పునరుద్ధరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News