Thursday, January 23, 2025

రూ.27.50కే కిలో గోధుమ పిండి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఊరట కల్పించడం కోసం సామాన్యులు మొదలుకొని దేశంలో అత్యధిక సంఖ్యాకులు ఉపయోగించే గోధుమపిండిని తక్కువ ధరకే అందించేందుకు కేంద్రప్రభుత్వం భారత్ గోధుమపిండి విక్రయాలను ప్రారంభించింది. కిలో గోధుమపిండి ప్యాకెట్‌ను రూ.27.50 దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. భారత్ గోధుమపిండి విక్రయాలను కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ఢిల్లీలో ప్రారంభించారు. నేషనల్ కో ఆపరేటివ్ కన్జూమర్ ఫెడరేషన్( ఎన్‌సిసిఎఫ్), నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్(నాఫెడ్) ద్వారా దేశంలోని 2 వేల దుకాణాలకు 800 వాహనాలు భారత్ దాల్, గోధుమపిండి, ఉల్లిపాయలను సరఫరా చేస్తాయని కేంద్ర పౌరసరఫరాల శాఖ తెలిపింది.

భారత్ గోధుమపిండి కోసం భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ)నుంచి 2.5లోల మెట్రిక్ టన్నుల గోధుమలను కిలో రూ.21.50లకే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ ఏజన్సీలకు కేటాయించారు. అక్కడ తయారైన పిండిని దేశవ్యాప్తంగా విక్రయిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రయోగాత్మకంగా భారత్ గోధుమపిండిని కోఆపరేటివ్ ఔట్‌లెట్లలో కిలో రూ.29.50కే కేంద్రప్రభుత్వం విక్రయించింది.‘ రైతులు, వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. దేశంలో ఆహారపదార్థాల ధరలు పెరిగిన ప్రతిసారీ కేంద్రప్రభుత్వం వాటిని సేకరించి సబ్సిడీలో ప్రజలకు అందజేస్తోంది. టమాటా ధరలు పెరిగిన సమయంలో వాటి ధరలను తగ్గించేందుకు చర్యలు చేపట్టాం.పప్పుధాన్యాలను అందుబాటులో ఉంచడానికి భారత్ దాల్‌ను పరిచయం చేశాం. ఉల్లి ధరల విషయంలోనూ ఇదే విధమైన చర్యలను చేపడుతున్నాం’ అని పీయూష్ గోయల్ చెప్పారు.

ప్రస్తుతం దేశంలో నాన్ బ్రాండెడ్ గోధుమ పిండి కిలో రూ.36కు, బ్రాండెడ్ గోధుమపిండిని రూ.70ల దాకా విక్రయిస్తున్నారు. ఏటా ఈ ధర 6.5 శాతం పెరుగుతోంది. మరో వైపు గోధుమ ఆధారిత ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం భారత్ గోధుమపిండిని ప్రవేశపెట్టింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆహార శాఖ సహాయమంత్రులు అశ్వినీ కుమార్ చౌబే, సాధ్వి నిరంజన్ జ్యోతి, ఆ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా, నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్, కేంద్రీయ భాండార్‌కు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News