ఆసియాలోనే అతిపెద్ద జాతరకు కేంద్రం నిధులేవి
బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రశ్నించిన ఎంఎల్‌సి కవిత
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన మేడారం జాతరపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ జాతరకు కేంద్రం నుంచి నిధులు రాకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రాన్ని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ అడగడం లేదని నిలదీశారు. స్వరాష్ట్రంలో నాలుగు సార్లు వైభవంగా జరిగిన మేడారం జాతర నిర్వహణ కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మొత్తం రూ.332.71 కోట్లను విడుదల చేశారన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు ఇప్పటి వరకు ఒక్క పైసా నిధులు కూడా ఇవ్వలేదన్నారు. ఇది రాష్ట్రం బిజెపి నేతలు కనిపించడం లేదా? ఆమె నిలదీశారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని ఆమె విమర్శించారు.
ఇది గిరిజనుల పట్ల బిజెపి ప్రభుత్వాని ఉన్న ప్రేమ, గౌరవం అని అన్నారు. గిరిజనులకు జనాభా ప్రాతిపదికన 10 శాతం రిజర్వేషన్ల ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం కూడా చేశామన్నారు. దీనిని ఆమోదించాలని కేంద్రాన్ని కోరితే ఇప్పటి వరకు ఉలుకు..పలుకు లేకుండా పోయిందన్నారు. రోజుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే బండి సంజయ్‌కు దమ్ముంటే తాను అడిగిన వాటికి సమాధానం చెప్పాలని కవిత సవిల్ విసిరారు. అలాగే మేడారం జాతరకు జాతీయ హోదా, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సత్యవతి రాథోడ్ రాసిన తాజా లేఖలను జతచేస్తూ కవిత సోమవారం ఒక ట్వీట్ చేశారు.