Saturday, September 21, 2024

అన్నదాతలతో చర్చలు విఫలం

- Advertisement -
- Advertisement -

అన్నదాతలతో చర్చలు విఫలం
కమిటీ ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదన.. తిరస్కరించిన రైతు నేతలు
మళ్లీ గురువారం చర్చలకు ప్రతిపాదన

న్యూఢిల్లీ: రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమైనాయి. వ్యవసాయ చట్టాలపై అన్నదాతల ఆందోళనల నేపథ్యంలో చట్టాలపై చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. అయితే దీనికి రైతు సంఘాల ప్రతినిధులు ససేమిరా అన్నారు. కొత్తగా కమిటీ ఏర్పాలు ప్రతిపాదనను తోసిపుచ్చారు. తెచ్చిన చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న 35 రైతు సంఘాల ప్రతినిధులతో మంగళవవారం సాయంత్రం కేంద్రమంత్రులు సమావేశమైనారు. విజ్ఞాన్ భవన్‌లో దాదాపు మూడున్నర గంటల సేపు సుదీర్ఘంగా జరిగిన ఈ చర్చల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో పాటుగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి, పంజాబ్ ఎంపి కూడా అయిన సోమ్ ప్రకాశ్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కమిటీ ఏర్పాటు ప్రతిపాదనను మంత్రులు రైతు సంఘాల ప్రతినిధుల ముందుంచగా, వారు దాన్ని తోసిపుచ్చారు. కమిటీ ఏర్పాటు సమస్యకు పరిష్కారం కాదని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. సమావేశం అనంతరం భారత్ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు జోగిందర్ సింగ్ ఉగ్రాహన్ మాట్లాడుతూ.. చర్చలు అసంపూర్తిగా ముగిశాయని గురువారం మరోసారి సమావేశమవుతామని కేంద్రం చెప్పిందన్నారు. ‘వారి సమస్యలను పరిష్కరించడం కోసం చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం.. చూద్దాం’ అని సమావేశం ప్రారంభానికి ముందు తోమర్ విలేఖరులతో అన్నారు. రైతు సంఘాల ప్రతినిధులు ఏం చెప్తారో విన్న తర్వాత ప్రభుత్వం ఒక పరిష్కారానికి వస్తుందని కూడా ఆయన చెప్పారు.

‘కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాల ప్రతినిధులు తోసిపుచ్చారు’ అని భారత్ కిసాన్ యూనియన్ సభ్యుడు రూప్‌సింగ్ సన్హా చెప్పారు. అయితే సమస్యల పరిశీలనకోసం కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, రైతు ప్రతినిధులు ఈ అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు ఇంత భారీ సంఖ్యలో రైతు సంఘాలతో చర్చించి నిర్ణయానికి రావడం కష్టమని, అందువల్ల చిన్న గ్రూపును ఏర్పాటు చేయాలని మంత్రులు సమావేశంలో సూచించారు.అయితే రైతు సంఘాల నేతలు మాత్రం తామంతా కలిసికట్టుగానే సమావేశమవుతామని ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. తమ ఐక్యతను దెబ్బతీయడం కోసమే ప్రభుత్వం ఈ ప్రతిపాదన తెచ్చి ఉండవచ్చని రైతుసంఘాల నేతలు అంటున్నారు. కాగా చర్చల సందర్భంగా విజ్ఞాన్ భవన్ వద భారీభద్రతా ఏర్పాట్లు చేశారు. రైతు సంఘాలతో సమావేశానికి ముందు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, తోమర్, గోయల్‌తో పాటుగా బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాలు రైతుల ఆందోళనపై సుదీర్ఘ చర్చలు జరిపారు.

మాకు మీ టీ వద్దు

మీరే మా లంగర్‌కు వచ్చి జిలేబి ఆస్వాదించండి
మంత్రి ప్రతిపాదనను తిరస్కరించిన రైతు నేతలు
ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలు మంగళవారం విజ్ఞాన్ భవన్‌లో చర్చల సందర్భంగా కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన తేనీటి ప్రతిపాదనను తోసిపుచ్చారు. తాము కోపంతో మంత్రి చేసిన తేనీటి ఆఫర్‌ను తోసిపుచ్చామని, దానికి బదులుగా తాము ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న ‘లంగర్’ (సామూహిక వంటశాల)కు ఆహానించామని రైతు నేతలు చెప్పారు. ‘మాకు మీ టీ ఏమీ వద్ద్దు. ఎందుకంటే మేము మీ పకోడాలను ఎంజాయ్ చేస్తున్నామని మీ ప్రెస్ అనవచ్చు. మీరే మా లంగర్‌కు వచ్చి మా జిలేబిలను ఆస్వాదించండి’ అని మేము కోపంతో తోమర్ సాబ్‌కు చెప్పాం’ అని పంజాబ్ కిసాన్ యూనియన్ నాయకుడు నుండు సింగ్ ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు చంద్ర సింగ్ కూడా దాదాపుగా ఇదే మనోభావాన్ని వ్యక్తం చేశారు. ‘ మేము ఏం కోరుతున్నామో నవంబర్ 13న జరిగిన సమావేశంలో మేము స్పష్టంగా చెప్పాం. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఈ రోజు ఒక ప్రతిపాదనతో వస్తుందని ఆశించాం. అలాంటిదేమీ జరగలేదు. అందుకే కోపంతో మంత్రి తేనీటిని తిరస్కరించాం. మాకు నచ్చచెప్పడానికి వ్యవసాయ మంత్రి చాలా ప్రయత్నించారు. అయితే మేము చాలా నిరాశకు గురయ్యాం’ అని ఆయన అన్నారు.

Central Govt Negotiation failed with Farmers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News