Monday, December 23, 2024

రిజర్వేషన్లను పెంచని కేంద్రం : కడియం శ్రీహరి

- Advertisement -
- Advertisement -

హనుమకొండ: కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను పరోక్షంగా ఎత్తివేసే కుట్ర చేస్తుండడం సిగ్గు చేటని, ప్రధాని మోడి నేతృత్వంలోని కేంద్రం వైఖరి అసమానతలను పెంచేలా ఉందని ఎంఎల్‌సి కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపి పసునూరి దయాకర్, మాజీ ఎంపి సీతారాంనాయక్‌తో కలిసి మాజీ డిప్యూటి సిఎం, ఎంఎల్‌సి కడియం శ్రీహరి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కులమతాల మధ్య బిజెపి చిచ్చుపెడుతూ, ఎస్సి, ఎస్టిలపై వివక్ష చూపుతుందని ఆరోపించారు. అసమానతలను పెంచేలా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని కడియం మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సిలకు 7.30 శాతం, ఎస్‌టిలకు 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తుందన్నారు.

ఇది ఇప్పుడున్న 14.7 శాతం, ఎస్టి 7.5 శాతం ఎస్సి జనాభా ప్రాతిపదికన నిర్ణయించడం జరిగిందన్నారు. 1961 నుండి 2021 వరకు అంటే దాదాపు 60 ఏండ్లలో ఎస్సి, ఎస్టి రిజర్వేషన్లను కేంద్రం పెంచలేదని వెల్లడించారు. పెరిగిన జనాభాకు ఆధారంగా ఎస్సి, ఎస్టిల రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం కేంద్రానికి ఎంతైనా ఉందన్నారు. అయినా కేంద్రానికి ఉలుకుపలుకు లేదని విమర్శించారు. ఆహారపు అలవాట్లను కూడా నియంత్రణ చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో దళితబంధు, గిరిజన బంధు అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ మాడల్‌గా దేశవ్యాప్తంగా దళితబంధు, గిరిజన బంధు అమలు చేయాలని డిమాండు చేశారు. ఈనెల 18న ఖమ్మంలో జరిగే టిఆర్‌ఎస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం మాజీ ఎంపి సీతారాంనాయక్ మాట్లాడుతూ.. 60 ఏండ్లుగా ఎస్సి, ఎస్టిల రిజర్వేషన్లను పెంచకపోవడంపై ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర ఉందని ఆరోపించారు. ఎస్సి, ఎస్టిల రిజర్వేషన్లు పెంచాలని ఆయన డిమాండు చేశారు. రిజర్వేషన్ల పెంపుపై బిజెపి నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 50 శాతం కంటే ఎక్కువైనా ప్రత్యేక చట్టం ద్వారా రిజర్వేషన్లు పెంచాలని పేర్కొన్నారు. ఎంపి పసునూరి దయాకర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దళితులపై వివక్ష చూపుతోందని మండిపడ్డారు. బండి సంజయ్ మసీదులను కూలగొట్టాలంటుండు సంజయ్‌కు బుద్ధుందా అని ప్రశ్నించారు. బిజెపి నాయకులు యువతను వక్రమార్గంలో తీసుకెళ్తున్నారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News