Friday, November 22, 2024

ప్రైవేటు చేతికి బీమా!

- Advertisement -
- Advertisement -

Central Govt plan to sell stake in LIC

 

దేశ ప్రజలకు ‘బీమా నుంచి ధీమా’ అనేది ఇక ముందు గుండు సున్నాగా మారిపోనున్నదా? ఒకవైపు జీవిత బీమా (ఎల్‌ఐసి) సంస్థ వాటాలను నడి బజార్లో పెట్టి రూ. లక్ష కోట్లను సేకరించడానికి సిద్ధమైన కేంద్ర ప్రభుత్వ చర్యను గాని, సాధారణ బీమా రంగంలోకి ప్రైవేటుకు భారీగా ప్రవేశం కల్పించడానికి మొన్న 2 తేదీన పార్లమెంటు ఆమోదం పొందిన సవరణ బిల్లు గాని ఈ ప్రశ్నకు ఔనని బిగ్గరగా సమాధానం చెపుతున్నాయి. 1956 నాటి జీవిత బీమా చట్టానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 27 మార్పుల అమలుకు రంగం సిద్ధం చేశారు. ఐపిఒ ద్వారా జీవిత బీమా వాటాలను ప్రైవేటుకు అమ్మడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వచ్చే ఐదేళ్లలో 75 శాతం షేర్లను మాత్రమే కేంద్రం తన వద్ద ఉంచుకొని మిగతా వాటిని ప్రైవేటుకు ధారాదత్తం చేస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం తన వాటాను 51 శాతానికి తగ్గించుకుంటుంది. ఈ విధంగా సాధారణ, మధ్య తరగతి ప్రజలకు గట్టి దన్నుగా ఉంటున్న ఎల్‌ఐసి భవిష్యత్తును అంతర్జాతీయ, జాతీయ ప్రైవేటు పెట్టుబడిదార్ల దయాదాక్షిణ్యాలకు వదిలివేసే క్రమం జోరందుకుంటున్నది. ప్రస్తుతం తలపెట్టిన ఐపిఒ ద్వారా 5 శాతం ఎల్‌ఐసి వాటాలను ప్రైవేటుకు ప్రభుత్వం అమ్ముకోదలచినట్టు తెలుస్తున్నది.

ఎల్‌ఐసి ఈ ఆర్థిక సంవత్సరంలో షేర్ మార్కెట్‌కు వెళుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలోనే వెల్లడించారు. స్టాక్ మార్కెట్‌లో చేరిన తర్వాత ఎల్‌ఐసి ఎకాఎకీ రిలయన్స్ ఇండస్ట్రీనే తలదన్నుతుందని, మార్కెట్ కేపిటలైజేషన్‌లో అతి పెద్ద కంపెనీ అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే అదే సమయంలో ఇంత వరకు క్షేమంగా, భద్రంగా ఉన్న ఎల్‌ఐసి నిధులు షేర్ మార్కెట్‌లోకి వెళ్లడం ద్వారా ప్రమాదంలో పడతాయని విజ్ఞులు చాలా కాలంగా చేస్తున్న హెచ్చరిక ఇప్పుడు వాస్తవ రూపం ధరిస్తున్నది. ఇటు పాలసీదార్లకు, అటు కేంద్ర ప్రభుత్వానికి అత్యవసరాల్లో అక్కరకు వచ్చే బంగారు గుడ్ల బాతు షేర్ మార్కెట్‌లో ప్రవేశించడం ద్వారా జరిగే అనర్థాలను ముందు ముందు అనుభవించక తప్పదు. ఇప్పటికే ఐడిబిఐ వంటి దివాలా బ్యాంకులకు తిరిగి ఊపిరి పోయడానికి ఎల్‌ఐసి నిధులు వాడిన ఘన చరిత్ర ఉన్నది. దేశంలో గల ప్రైవేటు పారిశ్రామిక రంగం చాలా వరకు ఆశ్రిత పెట్టుబడిదారీ పద్ధతులతో నెట్టుకొస్తున్నది. ప్రభుత్వాల మద్దతు మీద ఆధారపడి లేదా ప్రభుత్వ రంగ బ్యాంకుల సొమ్మును భారీగా దొరకబుచ్చుకోడం ద్వారానూ అవి తమ బండిని నడిపిస్తున్నాయి.

అలవికానప్పడు ప్రజా ధనాన్ని కైంకర్యం చేసి చేతులు దులుపుకుంటున్నాయి. ఇందువల్ల బ్యాంకులకు కలుగుతున్న భారీ నష్టాలను పూడ్చడానికి కేంద్రం బడ్జెట్‌లో వాటికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించవలసి వస్తున్నది. ప్రధాని మోడీ ప్రభుత్వం సంస్కరణల ఉబలాటం వల్ల ఎల్‌ఐసి వంటి బంగారు పర్వతాలను కూడా బజారు పాలు చేస్తే అత్యవసరాల్లో దేశాన్ని ఆదుకునే వనరులే కరువవుతాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 202122 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఈ ఏడాదిలో రెండు పబ్లిక్ రంగ బ్యాంకులను, ఒక సాధారణ బీమా కంపెనీని (జనరల్ ఇన్సూరెన్స్) ప్రైవేటుకు అప్పజెప్పడానికి నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఆ మేరకు త్వరలోనే బీమా చట్టం సవరణ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకు వస్తామని వెల్లడించారు. ఈ పని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే జరిగిపోయి ఉండవలసింది. కాని కొవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత వల్ల అది జరగలేదు. ఇప్పుడు పెగాసస్, రైతు ఉద్యమం వంటి తీవ్ర వ్యవహారాల మీద ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభలను స్తంభింప చేస్తున్నప్పటికీ ఏదో ఒక సందు చూసుకొని తాను కోరుకున్న బిల్లులకు ఆమోద ముద్రను ప్రభుత్వం వేయించుకుంటున్నది.

చర్చకు నోచుకోకుండా చేసి బిల్లులకు శాసన రూపం ఇవ్వడం కంటే అప్రజాస్వామికమైన పార్లమెంటరీ చర్య వేరొకటి ఉండదు. ఈ విషయం తెలిసి కూడా, దేశం కొవిడ్ ముప్పులో కూరుకుపోయి ఉందన్న సంగతిని సైతం గమనించకుండా సంస్కరణలపై ప్రధాని మోడీ ప్రభుత్వం అవధులు మీరిన మక్కువను ప్రదర్శిస్తున్నది. సాధారణ బీమా పరిశ్రమను 1972లో జాతీయం చేశారు. ఇప్పటి వరకు గల 107 ఇన్సూరెన్స్ కంపెనీలు, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ది జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే నాలుగు కంపెనీలుగా రూపాంతరం చెందాయి. ఇవన్నీ భవిష్యత్తులో పూర్తిగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోనున్నాయి. అలా వాటాలను అమ్మడం ద్వారా వచ్చే సొమ్మును ప్రభుత్వం పప్పు బెల్లాలుగా ఆరగిస్తుంది. దేశ ప్రజలకు అండగా నిలిచేదేదీ ముందు ముందు లేకుండా పోతుంది. బీమా పాలసీల ప్రీమియంలు కూడా భారీగా పెరిగిపోయి సాధారణ ప్రజలు కట్టుకోలేక, తట్టుకోలేక ఊహించని విపత్తుల్లో పడి దిక్కులేనివారైపోతారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News