Friday, December 20, 2024

పేదోడిపై భారాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట  : పీక్ డిమాండ్ సమయంలో 20శాతం ఛార్జీలు పెంచాలంటూ తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి ఆర్థిక ద్రోహానికి పాల్పడటమేనని రాష్త్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేద వర్గాల పై పడే ఏ భారాన్నైనా ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచాలంటూ ఈఆర్‌సి సిఫారసు చేసిన పట్టించుకోకుండా 12వేల కోట్ల అదనపు భారాన్ని భరించైనా ముఖ్యమంత్రి కెసిఆర్ పేదల పై భారం లేకుండా చూశారని గుర్తు చేశారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు, ఉదయం 5గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్‌ను వినియోగించే వినియోగదారుల పై భారం మోపుతామంటూ కేంద్రం తాఖీదులు జారీ చేస్తే భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంగా తాము సిద్ధంగా లేమని వెల్లడించారు.

పీక్ డిమాండ్ పేరుతో 20శాతం పెంచడం అంటే గృహ వినియోగదారులతో పాటు పారిశ్రామిక వేత్తలకు మోయలేని భారం మోపినట్లు అవుతుందన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వస్తే దేశంలో విద్యుత్ కాంతుల ప్రసరింపజేస్తామంటూ మాట్లాడి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ వినియోగం నుండి సామాన్యుడిని దూరం చేసే కుట్రలకు తెరలేపిందన్నారు. గత ప్రభుత్వాల పాలనను విమర్శించిన మోడీ ఇప్పుడు వ్యాపారుల కోసం మాత్రమే పని చేస్తున్నట్లు నిరూపించుకున్నారని అన్నారు. పేదలకు ఇచ్చే సబ్సిడీలను ఎత్తి వేసే చర్యలకు బిజెపి ప్రభుత్వం కుట్రలు సాగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టిన ప్రతి కనెక్షన్‌కు మీటర్ పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ సిఫారసును వ్యతిరేకించినందుకే ఇక్కడి ప్రభుత్వానికి పెర్‌ఫార్మెన్స్‌తో రావాల్సిన అప్పులను మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుందని అన్నారు.

ఈ క్రమంలోనే ఎఫ్‌ఆర్‌బిఎం ఇచ్చే పరిమితులలో మోకాలడ్డుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ నిర్ణయం తీసుకున్న అది పేదల పక్షంగానే ఉంటుందని మరోమారు స్పష్టం చేశారు. దుర్మార్గాలకు చెల్లుచీటి పాడి మోడీ పాలనకు చెరమగీతం పాడే రోజులు ఎంతో దూరంలో లేవని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, పెన్‌పహాడ్ ఎంపిపి నెమ్మాది భిక్షం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News