న్యూఢిల్లీ : టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సీరియస్‌గా స్పందించారు. తప్పుడు సమాచారానికి సంబంధించి ప్రస్తుతం డీప్ ఫేక్స్ అత్యంత ప్రమాదకరమైనవిగా, హానికరమైనవిగానూ పరిణమిస్తున్నాయంటూ సోమవారం ట్వీట్ చేశారు. ఇలాంటి తప్పుడు వీడియోలు పోస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు ట్విటర్ వేదికగా ఐటీ చట్టంలోని పలు నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌పాంలకు కూడా కొన్ని సూచనలు అందించారు. అలాగే ఇంటర్నెట్ వినియోగదారులకు భద్రత, విశ్వాసాన్ని కలిగించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
డీప్ ఫేక్ టెక్నాలజీతో తప్పుడు సమాచారం వైరల్ అయ్యే ఆస్కారం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆయన ట్వీట్ చేశారు. టాలీవుడ్ నటి రష్మికకు సంబంధించి అభ్యంతర రీతిలో ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు ప్రముఖులతోపాటు, నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇలాంటి తప్పుడు వీడియోలపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గుడ్‌బై మూవీతో బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న రష్మిక బిగ్‌బితో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.