లీటరు పెట్రోల్ రూ.9.50 డీజిల్ రూ.10తగ్గే అవకాశం
వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.200సబ్సిడి
ఉక్కు స్టీల్‌పైసుంకాల తగ్గింపు
మనతెలంగాణ/హైదరాబాద్ : వాహన వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ,డీజిల్‌పై వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటిని తగ్గించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గనున్నాయి. తగ్గించిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నట్టు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. లీటరుకు పెట్రోల్ పైన రూ.8, డీజిల్ పైన రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు.ఈ తగ్గింపుతో లీటర్ పెట్రోల్‌పైన రూ.9.50, డీజిల్ పైన రూ.10తగ్గే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం ప్రతిఏటా దాదాపు లక్ష కోట్లు ఆదాయం కోల్పోతుందని మంత్రి వివరించారు.
దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో చమురు ధరలను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. పెట్రో ధరలు పెరగటంతో దాని ప్రభావం అన్నిరంగాలపై పడుతుంది. రవాణారంగంతో ముడిపడ్డ ప్రతివస్తువ ధరలు పెరిగాయి. ప్రత్యేకించి నిత్యావసర వస్తువులతో పాటు అన్ని రకాల వస్తువుల ధరలపై ఈ ప్రభావం పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒకవైపు కరోనా కారణంగా అన్ని రంగాలు గత రెండేళ్లనుంచి దెబ్బతిన్నాయి. కరోనా ప్రభావం నుంచి కోలుకుంటున్న దశలో ఇంధన ధరల పెరిగుదల మరింత భారంగా మారింది. పెరిగిన పెట్రోల్ ,డీజిల్ ధరల కారణంగా ప్రైవేటుతోపాటు ఆర్టీసి బస్ చార్జీలు కూడా పెరిగాయి. సరుకుల రవాణపై పెనుభారం పడింది. దీంతో అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్య ప్రాజనీకం విలవిలలాడిపోంతోంది. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల తగ్గింపు పెద్ద ఊరటనివ్వనుంది.
గ్యాస్ సిలిండర్‌పై రూ.200సబ్సిడి:
గ్యాస్ సిలిండర్‌పై కూడా సబ్సిడి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద దేశంలోని 9 కోట్ల మంది లబ్దిదారలకు ఏడాదికి 12 సిలిండర్ల చొప్పున సరఫరా చేస్తూ రూ.200 సబ్సిడి ఇవ్వాలని నిర్ణయించింది. దీని ద్వారా సుమారు రూ.6100కోట్లు రెవెన్యూనష్టం వస్తుందని ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. దిగుమతులపై ఆధికంగా ఆధారపడే ప్లాస్టిక్ ఉత్పత్తుల ముడి పదార్దాలపై కూడా కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. దీనిద్వారా తయారీ ఖర్చుతగ్గుతుందన్నారు. అలాగే ఇనుము, స్టీల్ ఉత్పత్తుల ధరలు తగ్గించేందుకు ముడి సామాగ్రిపై కస్టమ్స్ డ్యూడి తగ్గిస్తున్నట్టు తెలిపారు సిమెంట్ ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకోసం మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుతెలిపారు.
మాకు ప్రజలే తొలి ప్రాధాన్యం:ప్రధాని మోడి
పెట్రోల్ ,డీజిల్ ,వంటగ్యాస్ ధరల తగ్గింపు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతుందని ప్రధాని నరేంద్రమోడి తెలిపారు. తమకు ప్రజలే తొలి ప్రాధాన్యం అన్నారు. ఇంధన ధరల తగ్గింపు దేశ ప్రజలకు ఊరట కలిగిస్తుందన్నారు. జనజీవనాన్ని మరింత మెరుగు పరుస్తుందని ప్రధాని ధరల తగ్గింపుపై తన స్పందన తెలియజేశారు.