Friday, December 20, 2024

డీప్‌ఫేక్‌పై కేంద్రం చర్యలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో సెలబ్రిటీలు, పౌరుల ప్రతిష్ట దెబ్బతీస్తూ వస్తున్న డీప్‌ఫేక్ బెడదపై కేంద్రం శుక్రవారం స్పందించింది. ఈ ఆన్‌లైన్ సమస్యను పరిశీలించి, తగు చర్యలు తీసుకునేందుకు ఓ ప్రత్యేకాధికారిని కేంద్రం నియమిస్తుంది. డీప్‌ఫేక్‌కు గురైన ఇతరత్రా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధితులు అయిన పౌరులు ఎవరికైనా తగు విధంగా సాయం చేసేందుకు ఈ స్పెషల్ ఆఫీసర్ వ్యవస్థ ఉపయోగపడుతుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. బాధితులు కేసులు దాఖలు చేసుకునేందుకు పౌరులకు ఈ ప్రత్యేకాధికారి ద్వారా తగు సాయం అందుతుందని మంత్రి వెల్లడించారు. తమను తప్పుడు రీతిలో చిత్రీకరించే వీడియోలు గుర్తించినట్లు అయితే వెంటనే అధికార వ్యవస్థకు పౌరులు తెలియచేసుకునేందుకు ఈ ఏర్పాటు దోహదం చేస్తుంది. సినీనటులు, సమాజంలోని ప్రముఖులు, కొందరు పౌరులు , చివరికి ప్రధాని మోడీ కూడా ఇటీవల డీప్‌ఫేక్ బాధితులు అయ్యారు.

స్పెషలాఫీసరు ఏర్పాటుతో పాటు డీప్‌ఫేక్ సమస్యను ఎప్పటికప్పుడు విశ్లేషించుకునేందుకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తారని మంత్రి తెలిపారు. వెబ్‌సైట్లు ఈ డీప్‌ఫేక్ చర్యలకు వేదికలు అవుతున్నందున ఇటువంటి పరిణామాలపై ఆయా మీడియాలు వెంటనే చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా వాటికి తగు విధమైన ఆదేశాలు వెలువరించడం జరిగిందని మంత్రి వివరించారు. సంబంధిత సంస్థలు పూర్తి స్థాయిలో ఎటువంటి ఉపేక్ష వహించకుండా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సామాజిక సంస్థలు డీప్‌ఫేక్ విషయాలపై స్పందించేందుకు వారికి వారం రోజుల గడువు విధించారు. ఈ లోగా చర్యలకు దిగాల్సి ఉంటుంది. లేకపోతే వారిపై చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు. శుక్రవారం నుంచి సామాజిక మాధ్యమాలపై కేసులు పెడుతారు. వారి నుంచి తగు వివరణ ఉంటే , డీప్‌ఫేక్ బాధ్యులపై నేరుగా చట్టపరమైన చర్యలకు దిగుతారని తెలిపారు.

సామాజిక మాధ్యమాలు తమ సామాజిక బాధ్యతగా వెంటనే తమ టర్మ్ అండ్ యూజ్ పద్ధతులను వెంటనే ఐటి నిబంధనలకు అనుగుణంగా మార్చాల్సి ఉంటుందని చంద్రశేఖర్ తెలిపారు. డీప్‌ఫేక్ మరింత విస్తరించకుండా చేయడంలో సామాజిక సంస్థల బాధ్యత ఎంతైనా ఉందన్నారు. తగు అధికారాలు, చట్టపరంగా వ్యవహరించేరూల్ 7 ఆఫీసరు డీప్‌ఫేక్ కట్టడికి స్పెషలాఫీసరుగా ఉంటారని మంత్రి తెలిపారు. ఈ అధికారి పౌరుల ఫిర్యాదులు తీసుకునేందుకు, వీటిని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు అవసరం అయిన వేదికను రూపొందించుకోవల్సి ఉంటుంది. ఈ అధికారి నియామకం తరువాత ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటుతో పౌరులు తమకు తలెత్తే సాధకబాధకాలను నెట్ ద్వారా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి తీసుకువచ్చేందుకు వీలేర్పడుతుంది. డీప్‌ఫేక్ బెడదపై శుక్రవారం ఇంటర్నెట్ నిర్వాహకులు, సోషల్ మీడియా ప్రతినిధులతో సుదీర్ఘ చర్చల తరువాత మంత్రి మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News