ఎఫ్‌సిఐ నిర్ణయం రైతులకు గొడ్డలిపెట్టు వంటిది
అర్ధంతరంగా ఆపివేయడం తగదు
సిఎం కెసిఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రం
వ్యవసాయ అనుకూల విధానాలతో
ముందుకు సాగుతోంది
ఎఫ్‌సిఐ సేకరణకు 141.01 లక్షల మెట్రిక్ టన్నుల
వరి ధాన్యాన్ని ఇచ్చి దేశంలోనే రెండో స్థానం
అలంకరించింది
వ్యవసాయ రంగంలో 14వ స్థానం నుంచి
5వ స్థానానికి చేరుకుంది
కేంద్రం అధిక నిధులిచ్చి ప్రోత్సహించాలి :
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శోభ కరంద్లాజేకు
మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగితేనే రైతులకు రెట్టింపు ఆదాయం లభిస్తుందని ఆ దిశగా దృష్టి సారించాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శోభ కరంద్లాజే అన్నారు. సోమవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన మంత్రి శోభ బిఆర్కే భవన్‌లో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి శోభ మాట్లాడుతూ అన్ని పరిశ్రమలకు ప్రాధాన్యాత ఇచ్చినట్టే పరిశ్రమల శాఖ ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వ్యవసాయ ఉద్యాన అధికారులతో పాటు పరిశ్రమల అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దేశంలో మనం పండించిన పంటలు అధికశాం మన వినియోగానికే పరిమితం అవుతున్నాయని తెలిపారు. పంటల సాగులో ఎరువులు , రసాయనాల వినియోగం తగ్గించి ,వరిధాన్యం , కూరగాయలు ,పండ్ల ఉత్పత్తుల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించినప్పుడే ఇతర దేశాలకు వాటిని ఎగుమతి చేయగలుగుతామన్నారు. ఈ దిశగా రైతులు దృష్టి సారించాలని , అధికారులు అందుకు తగ్గట్టుగా రైతులను చైతన్యం చేయాలన్నారు.
వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజలతోపాటు పప్పుగింజల సాగుకు తప్పకుండా కేంద్రం నుంచి సహకారం అందిస్తామని ప్రకటించారు. పంట ఉత్పత్తులకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పటుకు చర్యలు తీసకుంటామన్నారు. ఆయిల్ పామ్ సాగుకు వందశాతం సబ్సిడి విషయాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. మొదటిదశలో 3లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడంపై రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రతిరాష్ట్రం స్వయం సంమృద్ధి దిశగా అడుగులు వేయాలన్నారు. డిజిటలైజేషకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రి శోభ కరంద్లాజే పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యవసాయశాఖ దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయాలని:మంత్రి నిరంజన్ రెడ్డి
సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పండించిన దొడ్డు రకం వడ్లను కేంద్రం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని కేంద్ర మంత్రి శోభ కరంద్లాజేకు విజ్ణప్తి చేశారు. ఎఫ్‌సిఐ నిర్ణయం రాష్ట్ర రైతులకు గొడ్డలిపెట్టు అని ,అర్ధాంతరంగా కొనుగోళ్లు చేయమని ప్రకటించడం రైతులను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అనుకూల విధానలతో ముందుకు సాగుతుందన్నారు. వరిసాగునుండి నూనెగింజలు, పప్పుగింజలు, ఆయిల్ పామ్ సాగువైపు రైతాంగాన్ని మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత రెండు సీజన్లలో కలిపి 141.01లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఎఫ్‌సిఐ ద్వారా సేకరించి తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందని తెలిపారు. పంటల మార్పిడి అనేది నిరంతర ప్రక్రియ అని, ఆ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఒకేసారి ఆకస్మికంగా రైతులు ఇతర పంటలకు మళ్లడం కష్టతరమే అని ,దొడ్డువడ్ల సేకరణ చేయమనే నిర్ణయం వాయిదా వేసుకోవలన్నారు.
వ్యవసాయం , దాని అనుబంధ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రైతుబంధు కింద రూ.15వేలకోట్లు , రైతుబీమా ద్వారా 1440కోట్లు, సాగునీటిప్రాజెక్టులకు రూ.25వేలకోట్లు ఖర్చు చేస్తుమన్నారు. ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రతిఏటా వ్యవసాయరంగానికి రూ.60వేలకోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. రాష్ట్ర స్థూల ఆదాయంలో వ్యవసాయరంగం వాటా 201314లో రూ.1.12 లక్షల నుండి 201920కి 103 శాతం వృద్దితో రూ.2.28లక్షలకు చేరుకుని దేశంలో 14వ స్థానం నుండి 5వ స్థానానికి చేరుకున్నదని వివరించారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టి చెంది ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయన్నారు . పంటల ఉత్పత్తిలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రాలు అభివృద్ది చెందేందుకు కేంద్రం తోడ్పాటునందించాలని కోరారు. తెలంగాణ మామిడి అంతర్జాతీయ ప్రసిద్ది పొందినప్పటికీ కేంద్రం నుంచి మాత్రం తగినంత సహకారం లేదన్నారు.
వరికి ప్రత్యామ్నాయంగా 20లక్షల ఎకకారల్లో ఆయిల్ పామ్ సాగును అత్యంత ప్రాధాన్యతగా ముందుకు తీసుకుపోతున్నామన్నారు. కేంద్రం ఆయిల్‌పామ్‌కు వంద శాతం రాయితీపై నిధులు కేటాయించాలన్నారు. వంటనూనెల దిగుమతుల మీద కేంద్రం ఏటా రూ.70వేలకోట్లు ఖర్చు చేస్తుందని , ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా ఈ ఖర్చును తగ్గించవచ్చని తెలిపారు. వ్యవసాయరంగంలో ప్రాధాన్యత లేని రాష్ట్రాలకు బదులుగా వ్యవసాయనికే అధిక ప్రాధాన్యత ఇచ్చే తెలంగాణ , ఎపి, మహారాష్ట్ర, కర్టాటక, చత్తిస్‌గడ్ ,తమిళనాడు వంటి రాష్ట్రాలకు కేంద్రం ప్రాధన్యతనిచ్చి అధిక నిధులు కేటాయించాలచి కోరారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా దేశంలో పంటల ఉత్పత్తి ఉండేలా రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహం ఉండాలన్నారు. రాష్ట్రాల అవసరాలు, వ్యవసాయ పధకాల ప్రాధాన్యతను గుర్తించి దానికి అనుగుణంగా కేంద్రం నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రికి నిరంజన్‌రెడ్డి విజ్ణప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ , వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు మాట్లాడుతూ రాష్ట్రలో అమలు చేస్తున్న వివిధ వ్యవసాయ పథకాలను వివరించారు. రైతుబంధు ద్వారా ఇప్పటివరకూ రూ.43,037కోట్లు, రైతుబీమా కింద 3017కోట్లు చెల్లించినట్టు తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన లబ్దిదారులు వివరాలను అడిగిన కేంద్రమంత్రికి వాటివివరాలను తెలియజేస్తూ రాష్ట్రంలో ఈ పధకం కింద 35.19లక్షల మంది లబ్దిదారులు ఉన్నారని , వీరికి ఇప్పటివరకూ రూ.5443.02కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యదర్శి హన్మంతు, విసిలు డా,ప్రవీణ్ రావు, నీరజా ప్రభాకర్‌లతో పాటు డా, మరళీధర్ , డా, చంద్రశేఱ్ ,డా,విలాస్ ,లక్ష్మీబాయి ,కేశవులు , రాములు , వెంకట్రామిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.