న్యూఢిల్లీ: పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత(బిఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(బిఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష అధినీయం(బిఎస్‌ఎ) అనే మూడు కొత్త క్రిమినల్ జస్టిస్ చట్టాలను జనవరి 26 వతేదీ కల్లా నోటిఫై చేస్తామని, ఏడాదిలోగా దేశవ్యాప్తంగా అమలు చేస్తామని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ఈ మూడు చట్టాలు ఆమోదం పొందగా డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీటికి ఆమోద ముద్ర వేశారు. ఈ కొత్త చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్(ఐపిసి), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సిఆర్‌పిసి), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్(ఐఇఎ) స్థానంలో అమలులోకి వస్తాయి.
దేశంలోని 850 పోలీసు జిల్లాలలో ఉంచేందుకు గాను 900 ఫోరెన్సిక్ వ్యాన్లను సేకరించే ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టింది. వీటిని ఏదైనా నేరం జరిగితే వెంటనే ఫోరెన్సిక్ సాక్షం సేకరించి, నేరం జరిగిన ప్రదేశాన్ని వీడియో తీయడం సాధ్యపడుతుంది. ఈ మూడు కొత్త చట్టాలను నోటిఫై చేసిన తర్వాత పోలీసు అధికారులు, దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్ రంగంతో సంబంధం ఉన్నవారికి శిక్షణా కార్యక్రమాన్ని కేంద్ర హోం శాఖ ప్రారంభించనున్నది. జవనరి 26వ తేదీలోగా మూడు చట్టాల నోటిఫికేషన్ వెలువడుతుందని ఆ అధికారి చెప్పారు. ఈ కొత్త చట్టాల కింద మొట్టమొదటి తీర్పు మూడు నోటిఫై చేసిన నాటి నుంచి మూడేళ్లలోపల రావచ్చని ఆయన చెప్పారు.