న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నప్పటికీ ఇప్పటికీ అనేక చోట్ల కిలో వంద రూపాయలకు పైగానే ఉంది. ఈ సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20నుంచి నేషనల్ కో ఆపరేటివ్ కన్సూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌సిసిఎఫ్),నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్) కిలో 40 రూపాయలకే రిటైల్ ధరకు టమాటాలు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ధరల పెరుగుదల సమయంలో కూడా కేంద్రం తక్కువ ధరకే టమాటాలు అందించిన సందర్భాలు ఉన్నాయి.
ఈ నెల 15న ప్రభుత్వం టమాటా ధరలను కిలో రూ.50కి తగ్గించింది. తాజాగా ఈ ధరలను మరింత తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు కేంద్రం ఏకంగా 15 లక్షల కిలోల టమాటాలను విక్రయించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోనే కాకుండా రాజస్థాన్, యుపి,బీహార్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కూడా అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.గత 15 రోజుల్లోనే ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కేంద్రం 500 టన్నుల టమాటాలను విక్రయించింది. ఇదిలా ఉండగా గత కొద్ది రోజలుగా తగ్గుముఖం పట్టిన టమాటా ధరలు మరో వారం రోజుల్లో కిలో రూ.30 మామూలు స్థాయికి రావచ్చని అధికారులు అంటున్నారు.