కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..
జులై నుంచి పెరగనున్న జీతాలు
మూడు విడతల డీఏ ఒకేసారి అమలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఏడో వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా జూలై 1 నుంచి వారి జీతాలు పెరగనున్నాయి. కోవిడ్-19 సంక్షోభం కారణంగా మొత్తం మూడు విడతల డీఏ పెంపును వాయిదా వేసిన కేంద్రం, జూలై 1 నుంచి వాటిని అమలు చేయనుంది. దీంతో 50 లక్షలకు పైగా కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, 61 లక్షల మంది పెన్షనర్లకు లాభం చేకూరనుంది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 17 శాతం డీఏ అమల్లో ఉంది. అయితే కరోనా కారణంగా గత ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వస్తున్న మూడు విడతల డీఏ జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇప్పటి వరకు 17 శాతంగా ఉన్న డీఏ, తాజా 11 శాతంతో కలిపి 28 శాతానికి చేరుకోనుంది. ఈ 11 శాతం డీఏ పెరిగిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నెలసరి జీతంలో పెద్ద మార్పు కనిపిస్తుంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఫిట్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుంది, ఈ ఫిట్‌మెంట్ పెరిగితే, బేసిక్ పే కూడా పెరుగుతుంది. మీరు కేంద్రప్రభుత్వ ఉద్యోగయి ఉంటే మీ బేసిక్ పేను 2.57 తో గుణించి మొత్తం జీతాన్ని లెక్కగట్టాలి.
Central Govt will hike salaries of Employees