జనవరి మూడోవారంలో హజ్ పిలిగ్రీమ్స్ ఎంపిక
మన తెలంగాణ / హైదరాబాద్ : హజ్ 2024 కార్యాచరణను కేంద్ర హజ్ కమిటీ ప్రకటించింది. ఇప్పటికే హజ్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన విషయం విదితమే. జనవరి 15 వరకు హజ్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. స్వీకరించిన దరఖాస్తులను స్క్రూటినీ చేసి జనవరి మూడో వారంలో డ్రా ద్వారా హజ్ పిలిగ్రీమ్స్‌ను ఎంపిక చేస్తారు. ఎంపికైన హజ్ పలిగ్రీమ్స్ వారం రోజుల్లో తొలి విడుత హజ్ రుసుము చెల్లించాల్సి ఉంటుందని హజ్ కమిటి తెలిపింది.
ఆ తర్వాత ఫిబ్రవరి 10వ తేదీ లోగా ఎంపికైన హజ్ పిలిగ్రీమ్స్ తమ పాస్‌పోర్టులను సమర్పించాల్సి ఉంటుందని రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ అధికారి బి.షఫిఉల్లా తెలిపారు. ఏప్రిల్ నెలలో హజ్ పిలిగ్రీమ్స్ శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మే 5వ తేదీ నుండి హజ్ యాత్ర ప్రారంభమవుతుంది. జూన్ 10న హజ్ యాత్రికుల చివరి విమానం హైదరాబాద్ నుండి బయలు దేరనుంది. ఈ షెడ్యూల్ ప్రకారం హజ్ యాత్రకు పూర్తి ఏర్పాట్లు చేయాలని కేంద్ర హజ్ కమిటీ ఆదేశించింది.