పరిస్థితి వేగంగా మారొచ్చు, సిద్ధంగా ఉండాలి
5-10 శాతం కేసులకే ఆస్పత్రుల అవసరం
రోజువారీ సమీక్షలు నిర్వహించాలి
రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయినవారిలో 5-10 శాతం మందిని మాత్రమే ఆస్పత్రుల్లో చేర్చాల్సి వస్తున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే, పరిస్థితిలో వేగంగా మార్పు వచ్చే వీలున్నందున ఆస్పత్రులు, వైద్య సిబ్బందిని సిద్ధం చేయాలని రాష్ట్రాలకు సూచించింది. రోజువారీగా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఈమేరకు రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్ సోమవారం లేఖ రాశారు. రెండో ఉధృతిలో 20-23 శాతం కేసులకు ఆస్పత్రులు అవసరమయ్యాయని లేఖలో గుర్తు చేశారు. ఇప్పుడు కేసుల పెరుగుదలకు ప్రధాన కారణం ఒమిక్రాన్ వేరియంట్ అయినప్పటికీ డెల్టా వైరస్ కూడా కొనసాగుతున్నదని తెలిపారు. యాక్టివ్ కేసులు, హోం ఐసోలేషన్ కేసులు, ఆస్పత్రుల్లో చేరుతున్న కేసులు, ఆక్సిజన్ అవసరమైన పడకలు, ఐసియు పడకలు, వెంటిలేషన్ ఎందరికి అవసరమవుతోందనేది రోజువారీగా సమీక్షించాలని తెలిపారు.
రెండో ఉధృతి సమయంలో జరిపిన రోజువారీ పర్యవేక్షణ, సమీక్షలను తిరిగి నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా వైద్య సదుపాయాలు, సిబ్బంది అవసరాన్ని ఎప్పటికపుడు సమీక్షించాలని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉన్న వైద్య సదుపాయాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ నెల 9న కేంద్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన సూచనలను కఠినంగా అనుసరించాలని రాష్ట్రాలను ఆదేశించారు. అవసరమైతే రిటైర్డ్ వైద్యులు, ఎంబిబిఎస్ విద్యార్థుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. టెలీకమ్యూనికేషన్ సేవలతోపాటు సామాజిక కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు వారిని వినియోగించుకోవాలన్నారు. పేషెంట్ల తరలింపునకు అదనపు అంబులెన్స్‌లు లేదా ప్రైవేట్ వాహనాలను సమకూర్చుకోవాలని సూచించారు.