న్యూఢిల్లీ: అఫ్గనిస్థాన్ తాలిబన్ల ఆధిపత్యంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తాలిబన్ల నుంచి ప్రమాదమని భావించి ఆ దేశం విడిచి రావాలనుకునే అఫ్గన్లకు ఎమర్జెన్సీ ఇ-వీసా ఇవ్వనున్నట్టు కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. మతంతో సంబంధంలేకుండా ఎవరైనా ఇ-వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి వీలు కల్పించారు. భారత్‌లోకి ప్రవేశించడానికి అనుమతి పత్రంగా ఉపయోగపడే వీసాను ‘ఇఎమర్జెన్సీ ఎక్స్‌మిస్క్ వీసా’గా జారీ చేయనున్నారు. ప్రస్తుతం కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసినందున ఢిల్లీలోనే వీసాలు మంజూరు చేయనున్నారు. తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించిన తర్వాత ఆ నగర ప్రజల్లో అలజడి మొదలైన విషయం తెలిసిందే. తాలిబన్ల నుంచి తప్పించుకొని విమానాశ్రయంలోని దొరికిన విమానమెల్లా ఎక్కి, ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలనే తొందరలో పలువురు మృత్యువాతపడ్డారు. కాబూల్ విమానాశ్రయంలోనే కనీసం ఏడుగురు చనిపోయినట్టు అమెరికా అధికారులు తెలిపారు.