నిబంధనల అమలులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగ్గకూడదని సూచన
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ కేసులతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతుండడంతో కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కట్టడికి ఇప్పటికే డిసెంబర్ 21 న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలని ఆదేశాలిచ్చింది. ఈమేరకు పరీక్ష, కనుగొనడం, చికిత్స, వ్యాక్సినేషన్ తదితర ఐదంచెల వ్యవస్థపై నిరంతరం దృష్టి కేంద్రీకరించాలని, అవసరమైతే కేసుల పరిస్థితిని బట్టి ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించవచ్చని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా సూచించారు. పండగ సీజన్ అయినందున స్థానికంగా ఎవరూ గుమికూడకుండా నియంత్రించాలని, కొవిడ్ నిబంధనలు మాస్క్‌ధరించడం, సామాజిక దూరం పాటించడం తదితర నిబంధనలు కచ్చితంగా జనం పాటించేలా చూడాలని సూచించారు. ఈ ఆంక్షలను 2022 జనవరి 31 వరకు అమలు చేయాలని కేంద్రహోంశాఖ ఆదేశించింది.
దేశం మొత్తమ్మీద క్రియాశీల కేసులు తగ్గుముఖం పట్టాయని, అయితే ఒమిక్రాన్ కేసులు డెల్టా వేరియంట్ కన్నా మూడు రెట్లు ఎక్కువగా పెరిగాయని ఫలితంగా అరికట్టడం ఒక సవాలుగా మారిందని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 578 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, హోంశాఖ కార్యదర్శి తెలియచేశారు. ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు విస్తరించాయని, అంతేకాక ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఐరోపా , రష్యా, దక్షిణాఫ్రికా , వియత్నాం, ఆస్ట్రేలియా దేశాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపారు. డిసెంబర్ 23 న ప్రధాని మోడీ రాష్ట్రాల్లోని కొవిడ్ వ్యాప్తిపై సమీక్షించారని ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టడానికి ఆరోగ్యవ్యవస్థలను సన్నద్ధం చేయాలని సూచించారని చెప్పారు.
ఈమేరకు రాష్ట్రాలు ఒమిక్రాన్ సవాళ్లను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఒమిక్రాన్ విషయంలో తప్పుడు సమాచారం ప్రజలకు అందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి కచ్చితమైన సమాచారం అందించాలని సూచించారు. వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా రాష్ట్రాలు తమ పరిధి లోని జిల్లాలకు, స్థానిక యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు.