Monday, January 20, 2025

మార్కెట్లకు దండిగా ఉల్లిగడ్డలు

- Advertisement -
- Advertisement -

న్యూడిల్లీ : దేశంలో ఉల్లిగడ్డల ధరలు అదుపులో పెట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. బహిరంగ మార్కెట్లలోకి వెంటనే మిగులు ఉల్లిగడ్డల స్టాక్‌ను పంపించేందుకు ఏర్పాటు చేసింది. అవసరం అయిన ప్రాంతాలను గుర్తించి ముందుగా ఈ వంటింటి సరుకును పంపిస్తారు. అక్టోబర్ నుంచి కొత్త పంట రావడం జరుగుతుంది. అప్పటివరకూ ఈ నిత్యావసర సరుకు కొరత ఏర్పడకుండా, ధరలు పెరగకుండా చేసేందుకు వివిధ మార్కెట్లకు భారీ స్థాయిలో కోటాను తరలించేందుకు రంగం సిద్ధం అయిందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ వార్తాసంస్థలకు తెలిపారు. వచ్చే నెలలో ఉల్లిగడ్డల ధరలు కిలో రూ 100 దాటుతాయని అంచనాలు వెలువడ్డాయి. పరిస్థితిని గుర్తించి , ధరల కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు కుమార్ చెప్పారు.

ఉల్లిగడ్డకు కొరత లేదని, స్టాకులు ఉన్నాయని, పంపిణీకి సంబంధించి పలు మార్గాలు వెతుకుతున్నామని సెక్రెటరీ తెలిపారు. ఇ ఆక్షన్, ఇ కామర్స్ వీటితో పాటు రాష్ట్రాల ద్వారా వినియోదారుల సహకార సంస్థలు, కార్పొరేషన్ల ద్వారా రిటైల్ దుకాణాల ద్వారా వినియోగదారులకు తక్కువ రేటుకు ఉల్లిగడ్డ అందేలా చూసుకుంటారు. ఎటువంటి అత్యవసర కటకట పరిస్థితి ఏర్పడ్డా తట్టుకునేందుకు ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి పరిధిలో దాదాపు 3 లక్షల టన్నుల సరుకును సిద్ధం చేసుకుంది. సాధారణంగా వ్యవసాయ క్షేత్రాల నుంచి సరఫరాలు తక్కువగా ఉన్నప్పుడు రేట్లు పెరుగుతాయని వివరించారు. ఇంతకు ముందు ఇదే నెలలో ఉన్న ధరలతో పోలిస్తే ఇప్పుడు కిలోకు రెండు రూపాయిలు పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలతో తేలింది. పరిస్థితి మరింత ముదరకుండా పలు చర్యలు తీసుకుంటారని, నిల్వలను మార్కెట్లకు తరలించడం జరుగుతుందని కార్యదర్శి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News