Monday, December 23, 2024

ఆదివాసీలపై కేంద్రం జులుం

- Advertisement -
- Advertisement -

గత ఐదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అనేక అటవీ సంబంధిత శాసనాలు, విధానాలు ఆదివాసీ అటవీ హక్కులను హరిస్తున్నాయి. ముఖ్యంగా షెడ్యూల్డ్ ప్రాంత ఆదివాసీ స్వీయ పాలనకు ఉద్దేశించిన గ్రామ సభ అధికారాలను అతిక్రమిస్తున్నాయి. అటవీ భూమి ఆధారిత పారిశ్రామిక, వాణిజ్య రంగానికి అనుకూలంగా ఉన్నాయి. ఆదివాసీ, ఇతర సంప్రదాయ అటవీ నివాసితుల అటవీ హక్కుల గుర్తింపు విషయంలో చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని 2006లో రూపొందించింది. అటవీ హక్కుల నిర్ధారణ, అటవీ, వన్యప్రాణి, పర్యావరణ సంరక్షణతో పాటు అటవీ వనరుల నిర్వహణ హక్కును గ్రామ సభలకు కల్పించింది. కాగా కేంద్ర ప్రభుత్వ అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ రూపొందిస్తున్న అనేక విధానాలు అటవీ హక్కుల గుర్తింపు చట్టానికి భిన్నంగా ఉండడంతో దేశ వ్యాప్తంగా ఆదివాసీలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అటవీ హక్కుల చట్టం అమలు కేంద్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖదే. అయితే ఆదివాసీలకు అండగా నిలబడాల్సిన కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ మౌనం వహించడం విశేషం. కేంద్ర ప్రభుత్వం రూపొందింస్తున్న అటవీ శాసనాలు, విధానాలు విశ్లేషిస్తే ఆదివాసీ హక్కులు ఎలా అతిక్రమణకు గురవుతున్నాయో మనకు అర్ధమవుతోంది. ఉత్పాదక అడవులు అనే కొత్త కేటగిరీ పేరుతో కలప, కలప గుజ్జు చెట్లను పెంచి కలప ఆధారిత పరిశ్రమలకు, వాణిజ్య అవసరాల కోసం మళ్లింపుకి వీలుగా భారత అటవీ చట్టం1927కు సవరణ ప్రతిపాదిస్తూ భారత అటవీ (సవరణ) 2019 బిల్లు రూపొందించింది. ఆదివాసీ అటవీ హక్కు గుర్తింపు పొందిన భూములను సైతం భూ సేకరణ పేరుతో తిరిగి తీసుకొనే ప్రతిపాదనజేసే అధికారం అటవీ అధికారాలకు కట్టబెట్టింది. అయితే బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా నిరసన పోరుకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అటవీ సంబంధిత అంశాల ప్రకటనలను సంయుక్తంగా కేంద్ర అటవీ, గిరిజన మంత్రిత్వ శాఖల కార్యదర్శులు విడుదల జేస్తారని ప్రభుత్వం 2019లో ప్రకటించింది. అంటే ఆదివాసీ అటవీ హక్కులకు భిన్నంగా ఉండే అటవీ విధానాలను సైతం గిరిజన మంత్రిత్వ శాఖ ప్రశ్నించకుండా ఆ శాఖ కార్యదర్శిని కూడా భాగస్వామిని జేసింది. అటవీ హక్కుల అమలు జేయాల్సిన గిరిజన మంత్రిత్వ శాఖ తమ బాధ్యతను విస్మరించింది.

కరోనాతో దేశ ప్రజలు సతమతమవుతుంటే గ్రామ సభల నిర్వహణ, చర్చలకు తావులేని సందర్భంలో అదే అదునుగా భావించి, కేంద్ర ప్రభుత్వం మైనింగ్ లీజుదార్లకు లబ్ధి చేకూరేలా తమ మైనింగ్ కార్యకలాపాలు మరో రెండేండ్లు కొనసాగించుకొనేందుకు వీలుగా మైనింగ్ (సవరణ) చట్టం 2020 తీసుకు వచ్చింది. పర్యావరణ, మైనింగ్ క్రమబద్ధీకరణ నియమాలను సడలిస్తూ మైనింగ్ లీజుల బదలాయింపులు, ప్రైవేట్ కంపెనీల మైనింగ్ కార్యకలాపాలకు అనుకూలంగా 2021లో మరొక శాసన సవరణ తీసుకు వచ్చింది. అదే ఏడాదిలో కార్పొరేట్ రంగ వ్యాపారం సులభతరం జేసే విధంగా పర్యావరణ ప్రభావ అంచనాల ప్రజా విచారణ నియమాలను నిర్వీర్యం జేసింది. ప్రభుత్వం ప్రకటించే కొన్ని తరహా ప్రాజెక్టులను క్రమబద్ధీకరణ నియమాల నుంచి మినహాయిస్తూ పర్యావరణ ప్రభావ అంచనా ముసాయిదా నోటిఫికేషన్ 2020 జారీ జేసింది.

ప్రాజెక్టులకు ముందుగా అనుమతి జారీ జేసిన తర్వాత పర్యావరణ ప్రభావ నివేదికలు రూపొందింజే ందుకు ముసాయిదా వీలు కల్పిస్తుంది. ఇది మౌలిక పర్యావరణ నియమాలకు విరుద్ధమని అల్లంబిక్ ఫార్మాస్యూటికల్ కంపనీ కేసులో 2020లో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 1980 కు పూర్వం నుండి ప్రభుత్వ శాఖల యాజమాన్యంలో గల అటవీ భూములు, అలాగే ప్రకటేతర అటవీ భూములను అటవీ సంరక్షణ చట్టం 1980 పరిధి నుంచి మినహాయించాలని ప్రతిపాదిస్తూ 2021లో ఒక సంప్రదింపుల పత్రాన్ని అటవీ మంత్రిత్వ శాఖ విడుదల జేసింది. వాస్తవానికి అటవీ భూముల మళ్లింపుకి ఎటు వంటి మినహాయింపు లేకుండా అటవీ సంరక్షణ చట్టం 1980 వర్తిస్తుంది. వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు వీలుగా అటవీ భూమి కేటగిరీ నుంచి పెద్ద ఎత్తున అటవీ భూములను తొలగించేందుకు విధాన పత్రం అనుకూలం. అటువంటి భూములతో ముడిపడి ఉన్న ఆదివాసీ అటవీ హక్కుల నిర్ధారణ లేకుండానే అటవీ భూముల మళ్లింపు జరిగే ప్రమాదం ఉంది.

వన మూలిక మొక్కల సేకరణ, పరిశ్రమల వినియోగం సులభతరం జేస్తూ జీవవైవిధ్య (సవరణ) బిల్లు 2021ను పార్లమెంటు లో ప్రవేశపెట్టడం జరిగిoది. కాగా అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద గ్రామ సభల వన్య ప్రాణి, అడవుల, జీవవైవిధ్యం పరిరక్షణ అధికారాలను బిల్లు విస్మరించింది. అటవీ ప్రాంతాలలో ఆదివాసీ అటవీ హక్కులను ఉదహరించనే లేదు. మరొక వైపు జీవ వైవిధ్యచట్టం 2002 ఉల్లంఘనలకు పాల్పడిన వారికి పేర్కొన్న శిక్షల స్థానే జరిమానాలు విధించే విధంగా మెడికల్ కంపెనీలకు బిల్లు వెసులుబాటు కల్పిస్తుంది. కాగా వన్యప్రాణి చట్టాల అతిక్రమణలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు ప్రతిపాదిస్తూ వన్య (సంరక్షణ) సవరణ చట్టం 2022 కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. నూతన చట్ట సవరణలు వల్ల ముఖ్యంగా అటవీ భూములపై ఆధారపడి జీవించే ఆదివాసీ జీవనంపై తీవ్ర ప్రభావం జూపుతున్నాయి. అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద పేర్కొన్న గ్రామసభల అటవీ భూమి నిర్వహణ, ప్రణాళికా అధికారాలను చట్టం నిర్వీర్యం జేస్తున్నది. గ్రామ సభలను విస్మరించి వన్యప్రాణి ముఖ్య వార్డెన్‌కు ప్రణాళిక అధికారాలు అప్పగించింది.పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా జల కాలుష్యం చట్టం 1974, వాయు కాలుష్యం చట్టం 1981 లకు కేంద్ర ప్రభుత్వం 2022లో సవరణలకు పూనుకుంది. సవరణ బిల్లుల వల్ల కాలుష్యం కలుగుజేసే పరిశ్రమల ఉల్లంఘనలకు శిక్షల స్థానే జరిమానాలు విధించవచ్చు. కోర్టుల ప్రమేయం లేకుండానే అధికారులే కేసుల విచారణ జేస్తారు. అదే రీతిలో కార్పొరేట్లకు అనుకూలంగా పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ఉల్లంఘనలకు విధిం చే శిక్షలు స్థానంలో జరిమానాలు, కేసులు విచారణ జేసే అధికారం అధికారులకే కల్పిస్తూ సవరణ బిల్లు రూపొందించింది.

మరీ ముఖ్యంగా గత ఏడాది రూపొందించిన కేంద్ర ప్రభుత్వ నూతన అటవీ సంరక్షణ సవరణ నియమాలు 2022 ఆదివాసీ అటవీ హక్కులు కాలరాసే విధంగా ఉన్నాయి. అటవీ భూములు ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు వీలుకల్పిస్తున్నాయి. అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద హక్కుల గుర్తింపు నిర్ధారణ తర్వాతే మొదటి స్థాయి అనుమతి ప్రభుత్వం జారీ జేయాలనే 2003 తదితర సవరణ 2017 నియమాలకు సవరణలకు పూనుకుంది. అటవీ హక్కుల గుర్తింపు విషయంలో ధ్రువీకరణ పత్రం గ్రామ సభ జారీ చేసిన తర్వాతే అటవీ భూమి మళ్లింపు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేస్తూ 2015లో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఉత్తర్వు జారీ జేసింది. అయితే ఆ ఉత్తర్వుకు భిన్నంగా అటవీ భూమి మళ్లింపుకి మొదటి స్థాయి అనుమతి ఇచ్చే అవకాశం నూతన నియమాలు వీలు కల్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆదివాసీ, ఇతర అటవీ సంప్రదాయ నివాసితుల అటవీ హక్కులు హరిస్తూ అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు 2023 రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టింది.బిల్లును పార్లమెంటు సంయుక్త కమిటీ విచారణకు పంపింది. దేశ వ్యాప్తంగా బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అటవీ భూముల మళ్లింపు విషయంలో కొన్ని కేటగిరీ అటవీ భూములను అటవీ సంరక్షణ చట్ట 1980 పరిధి నుంచి మినహాయింపు బిల్లు ప్రతిపాదించింది. వాస్తవానికి అటువంటి ఆలోచన విధానానికి 2021 లోనే పునాది పడింది.

ప్రభుత్వ నిర్మాణ (లీనియర్)ప్రాజెక్టుల నిర్మాణం కోసం దేశ సరిహద్దు ప్రాంత లేదా వాస్తవ ఆధీన రేఖ నుండి 100 కి.మీ వరకు గల అడవుల విషయంలో ఎటువంటి పర్యావరణ అనుమతి లేకుండానే అటవీ భూముల మళ్లింపుకి నూతన బిల్లు అవకాశం కల్పిస్తుంది. నూతన బిల్లు కారణంగా ముఖ్యంగా హిమాలయ ప్రాంతాలలో అడవులపై జీవించే ప్రజల అటవీ హక్కులకు భంగం కలుగనున్నది. అలాగే జమ్మూ, కశ్మీర్ ప్రాంతాలలో అధిక శాతం అడవులు ఆ నిర్దేశిత 100 కి.మీ సరిహద్దు లోపలే ఉన్న కారణంగా వాటిపై జీవనం సాగించేవారు అటవీ హక్కులు కోల్పోయే పరిస్థితి నెలకొని ఉంది. అలాగే రహదార్ల, రైలు మార్గాల, ఇరువైపు గల 0.10 హెక్టార్ల అటవీ భూమి, మౌలిక భద్రత సంబంధిత అవసరాలకు 10 హెక్టార్ల అటవీ భూమి, వామపక్ష తీవ్రవాద ప్రాంతాలలో పారా మిలిటరీ క్యాంపు లేదా ఇతర ప్రజా అవసరా ల పాజెక్టుల నిమిత్తం 5 హెక్టార్ల భూమి విస్తీర్ణం మించకుండా అటవీ భూముల మళ్లింపుకి అనుమతులు అవసరం లేని విధంగా నూతన సవరణ బిల్లు ఉంది. దాని వల్ల ఆయా అటవీ భూభాగం లో అటవీ హక్కులు అమలు ప్రశ్నార్ధకంగా మారనుంది.

కొన్ని తరహా అడవులను ప్రతిపాదిస్తూ అటవీ భూముల మళ్లింపుకి కేంద్రం పూనుకోవడం సుప్రీంకోర్టు 1997 గోదా వర్మన్ కేసు తీర్పుకు వ్యతిరేకం. అటవీ సంరక్షణ చట్టం 1980 అమలు విషయంలో ఎటువంటి కేటగిరీ అటవీ భూముల మినహాయింపు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశీయ శాసనాలు అడవులను నిర్వచన చేయలేని కారణంగా నిఘంటు నిర్వచనాన్నే పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పషం జేసింది. అలాగే ఆదివాసీ అటవీ భూమి హక్కుల నిర్ధారణ విషయంలో గ్రామసభ అనుమతి లేకుండా అటవీ భూమి మళ్లింపుకి పూనుకోవడం చట్ట విరుద్ధమని ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ కేసులో సుప్రీంకోర్టు 2013 విస్పష్టంగా పేర్కొంది. అటవీ ప్రాంతాలలో ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్టుల అమలుకు గ్రామసభ సంప్రదింపులు అవసరం లేదని తెలియజేస్తూ జారీ జేసిన కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2019లో కొట్టేసింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వ నూతన అటవీ శాసనాలు, విధానాలు షెడ్యూల్డ్ ప్రాంత, అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద పేర్కొన్న ఆదివాసీ స్వీయ పాలన, అటవీ హక్కులకు లోబడే ఉండాలి. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆలోచన జేయాలి. లేకపోతే ఆదివాసీ హక్కులు సంపూర్ణంగా నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది.

డా. పల్లా త్రినాధ రావు- 96182 96682

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News