న్యూఢిల్లీ : వీధి కుక్కలపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహణకు సంబంధించి ఏడాది క్రితం జారీ అయిన సర్కులర్‌ను కేంద్ర ప్యానెల్ ఉపసంహరించుకుంది. కొత్తగా వ్యాక్సిన్ ట్రయల్స్‌కు, అధ్యయనానికి వీధి కుక్కలను ఉపయోగించుకోవచ్చని గత ఏడాది సెప్టెంబర్‌లో సెంట్రల్ ప్యానెల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కంట్రోల్ అండ్ సూపర్‌విజన్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్ ఆన్ యానిమల్స్ (సిపిసిఎస్‌ఇఎ) సిఫార్సు చేసింది. ఈ నిర్ణయంపై జంతు సంరక్షక పాలక వర్గం (పెటా) ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది.
ఈ విధమైన నిర్ణయం వల్ల వీధి కుక్కలకే కాదు పెంపుడు జంతువులపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందని తెలియజేసింది. ప్రయోగాల్లో జంతువును బాధపెట్టడం, విషపరీక్షలు, అవయవాలను విచ్ఛేదన చేయడం, ప్రదర్శించడం జరుగుతుందని పేర్కొంది. దీనిపై ఏడాది తరువాత కేంద్ర ప్యానెల్ సర్కులర్‌ను ఉపసంహరించుకుంది. ఈమేరకు అక్టోబర్ 5న సర్యులర్ జారీ చేసింది. దీనిపై పెటా ఇండియా సైన్స్ పాలసీ అడ్వైజర్ డాక్టర్ అంకిత పాండే హర్షం వెలిబుచ్చారు.