Thursday, January 23, 2025

ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే: రైతు సంఘాలు

- Advertisement -
- Advertisement -

ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే
రైతు సంఘాల జెఎసి

Central responsibility for purchase of grain

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని తెలంగాణ రైతు సంఘాల జేఏసి డిమాండ్ చేసింది. తెలంగాణలో ధాన్యం సేకరణ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులు అన్న అంశంపై గురువారం సుందరయ్య భవన్‌లో తెలంగాణ రైతు సంఘాల జేఏసి అధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి మాట్లాడుతూ ఉప్పుడు బియ్యం , ముడిబియ్యం అన్న అంశాలతో రైతులకు ఏమాత్రం సంబంధం లేదన్నారు.

రైతులనుంచి బియ్యాన్ని సేకరించి ఆ ధాన్యాన్ని మిల్లర్ల ద్వారా ఉప్పుడు బియ్యంగానో, ముడిబియ్యంగానో మార్చుకునే విధానం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోదే అని అన్నారు. ధాన్యం మిల్లింగ్‌లో నూకలు అధికంగా వస్తే వాటిని విదేశాలకు ఎగుమతి చేసేందకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలన్నారు. రైతుల నుంచి ఎప్‌సిఐ సేకరించిన ఆహారధాన్యాలను నిల్వ చేసేందుకు గిడ్డంగుల్లో స్థలం లేదంటే కుదరదని , అవసరమైతే తగిన జాగ్రత్తలతో ఆరుబయట నిల్వ చేయాలని కేంద్రానికి సూచించారు. పంటల సాగు ద్వారా రైతులు లాభసాటి ధరలను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం స్వామినాధన్ కమిటి సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పంటలకు అన్ని రకాల పెట్టుబడి ఖర్చలతోపాటు రైతు కుటుంబం చేసిన శ్రమను కూడా లెక్కించి మొత్తం సాగు ఖర్చులకు అదనంగా 50శాతం కలిపి పంటలకు మద్దతు ధరను నిర్ణయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలకింద ఎంపిక చేసిన 23రకాల పంటల్లో వరి పంటే ప్రధానం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సిఐని నిర్వీర్యం చేసి ఏకంగా ఆ సంస్థను పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఏరకం నేలలో ఏ పంటను సాగు చేయాలో వ్యవసాయశాస్త్రవేత్తలకంటే పంటల సాగులో అనుభవం గడించిన రైతులకే ఎంతో బాగా తెలుసని కోదండరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ జనసమితి నేత ప్రో.కోదండరాం మాట్లాడుతూ పారాబాయిల్డ్ రైస్ కావాలని కేంద్రమే మిల్లర్లను ప్రోత్సహించిందని గుర్తు చేశారు.

రైతులనుంచి ధాన్యం సేకరించి మిల్లింగ్ చేసుకోవాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపైనే ఉందన్నారు.యాసంగిలో ధాన్యం మిల్లింగ్ ద్వారా 67శాతం బియ్యం కావాలంటే సాధ్యం కాదన్నారు. నూకనష్టాలను ప్రభుత్వాలే భరించాలన్నారు. వెంటనే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులు ప్రైవేటు వ్యాపారుల బారిన పడి నష్టపోకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘాల నాయకులు కశ్యపద్మ, జంగారెడ్డి, వెంకటరెడ్డి, శంకర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News