న్యూఢిల్లీ : దేశంలో తారాస్థాయికి చేరుకుంటున్న టమాటల ధరల అదుపునకు కేంద్రం ఎట్టకేలకు నడుంబిగించింది. సంబంధిత వినియోగదారుల విభాగం బుధవారం పరిస్థితిని సమీక్షించింది. ధరల అదుపునకు తీసుకోవల్సిన తక్షణ చర్యల గురించి నిర్ణయం తీసుకుంది. జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ (నాఫెడ్) , జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్యలకు టమాటల సేకరణకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలలో ఎక్కువగా టమాటలు పండే ప్రాంతాల నుంచి వీటిని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి , మార్కెట్లకు తరలించాలని సూచిచంది. సరఫరాల పరిస్థితి మెరుగుపడితే కానీ ధరలు తగ్గే అవకాశం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు గుర్తించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడు రోజురోజుకూ టమాటల ధరలు కొండెక్కుతున్నాయి. కొత్త మైలురాళ్లను దాటుతున్నాయి.
కిలోకు రూ 150 నుంచి రూ 200 వరకూ పల్కుతున్నాయి. పెద్ద ఎత్తున దూర ప్రాంతాల నుంచి టమాటలను భారీ ఎత్తున కొనుగోలు చేసి వీటిని తరలించడం ద్వారా శుక్రవారం నాటికి ఢిల్లీ, జాతీయ కేంద్ర పాలిత ప్రాంతాలలో ధరలు తగ్గుముఖం పడుతాయని ఆశిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రతికూల వాతావరణం నడుమ ఏ మేరకు యుద్ధ ప్రాతిపదికన టమాటలు దక్షణాది మార్కెట్ల నుంచి అవసరం అయిన ప్రాంతాలకు చేరుతాయనేది ప్రశ్నార్థకం అయింది.
చిల్లర ధరలు ఏఏ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయనేది గుర్తించి అక్కడికి వెంటనే మిగులు ప్రాంతాల నుంచి టమాటలను రప్పించాలని కేంద్రం తలపెట్టింది. అయితే దేశంలో చివరికి టమాటలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ప్రాంతాల్లోనే టమాటలకు కటకట , ధరల పెరుగుదల ఉండటంతో , పెద్ద ఎత్తున వీటిని దూర ప్రాంతాలకు తరలించడం వాస్తవికంగా అసాధ్యం కానుంది.