సెంట్రల్ విస్టా అవసరమే: ఢిల్లీ హైకోర్టు
నిర్మాణపనులు ఆపాలని పెట్టిన పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా అవసరమేనని, ఈ నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని సోమవారం ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా ఉధృతి సమయంలో సెంట్రల్ విస్టా నిర్మాణం అంతగా అవసరం లేదని, ఆ పనులను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ సోహైల్ హష్మీ, ట్రాన్స్‌లేటర్ అన్యామల్హోత్రా ఢిల్లీ హైకోర్టులో సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డిఎస్ పటేల్, జస్టిస్ జ్యోతిసింగ్‌ల ద్విసభ్య ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. కరోనా బూచిని చూపించి నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కార్మికులు ఇప్పటికీ నిర్మాణ ప్రదేశంలో ఉంటూ పనులు చేసుకుంటూ జీవనోపాధిని పొందుతున్నారని ఇలాంటి సమయంలో పనులు ఆపేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రాజెక్టు న్యాయబద్ధతపై ఇప్పటికే సుప్రీం కోర్టు విచారించిందని గుర్తు చేసింది.
నిర్మాణ పనులకు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా అనుమతించిందని న్యాయస్థానం గుర్తు చేసింది. ఇది నిజమైన ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని, ఎవరి ప్రోద్బలం తోనే వేసిన పిటిషన్‌లా ఉందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పిటిషన్‌దారులకు రూ.లక్ష వంతున జరిమానా విధించింది. కరోనా విలయ తాండవంలో విస్టా పనులు కొనసాగిస్తుండడంపై విపక్ష కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సమయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునేలా దాదాపు వెయ్యికోట్లతో సెంట్రల్ విస్టా నిర్మాణం ప్రాజెక్టు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువు నవంబర్ లోగా షాపూర్ జి పల్లోంజీ సంస్థ ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.
Central Vista Essential National Project: Delhi HC