Thursday, December 26, 2024

వరద ముట్టడి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు తెలంగాణకు ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని పలు ప్రాంతాలకు గుండెకోతను మిగులుస్తున్నాయి. మహరాష్ట్ర, చత్తిస్‌గడ్ తదితర ప్రాంతాల్లోని పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.గోదావరి నదిలో వరద ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహాలతో నదిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. భద్రాచలం వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతిని గమనిస్తూ రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసేందుకు సిద్దమవుతున్నారు.

భద్రాచలం వద్ద నీటిమట్టం 47.4 అడుగులుకు చేరింది. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని గోదవరిలో నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని కేంద్ర జలసఘం తెలుగు రాష్ట్రాలకు సమాచారం అందించింది. రెండు రాష్ట్రాల్లో నదీ పరివాహకంగా ఇరువైపులా లోతట్ట ప్రాంతాలను అప్రమత్తం చేయాలని ,తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సూచించింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర లో, ఉత్తర తెలంగాణాలో అతిభారీ వర్ష సూచన కారణంగా ఏక్షణం లోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి ,గోదావరి నది లోకి మిగులు జలాలను వదిలే అవకాశం ఉన్నది .కావున రెవిన్యూ , పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, గ్రామాలలో దండోరా వేయించాలని ప్రాజెక్టు ఏఈఈ రవి తెలిపారు.

నదీ పరివాహక ప్రాంతం లోకి పశువులు ,గొర్రెలు, మొదలగునవి వెళ్లకుండా అలాగే చేపలు పట్టేవారు, గొర్రె కాపరులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ పరివాహక ప్రాంతాల, గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా పోలీస్,రెవెన్యూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలిపారు.ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 65,257క్యూసెక్కుల నీరు చేరుతోంది.ప్రాజెక్టులో నీటినిలువ 72.31టిఎంసీలకు చేరుకుంది. కడెం ప్రాజెక్టుకు కూగా 2674క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 79,913క్యూసెక్కుల నీరు చేరుతుండగా, దిగువకు 51886క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.ప్రాణహిత నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది.

మేడిగడ్డ వద్ద లక్ష్మీబ్యారేజ్‌లోకి 5,11,080క్యూసెక్కలు నీరు చేరుతుండగా, గేట్లు తెరిచి అంతే నీటిని దిగువకు వదులు తున్నారు. దిగువన తుపాకుల గూడెం వద్ద సమమ్మ బ్యారేజికి 7,54,470క్యూసెక్కుల నీరు చేరుతుండగా వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులు తున్నారు. దుమ్ముగూడెం సీతమ్మసారగ్ వద్ద, ఇన్‌ఫ్లో 10,49,351క్యూసెక్కులకు పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం అంతకంతకు పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ డా ప్రియాంకను పోన్ ద్వారా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎగువ నుండి గోదావరికి భారీగా నీరు పోటెత్తడంతో ముంపుకు గురయ్యే పరివాహక ప్రాంత తక్షణమే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.

వరద ఉదృతి దృష్ట్యా ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని, అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సేవల కోసం ప్రజలు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయాలని, ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావొద్దని సూచించారు.ప్రజలు ఆయా గ్రామాల్ల్లో పొంగిపొర్లుతున్న వాగులు దాటకుండా పోలీస్ యంత్రాంగం పటిష్ట పరచాలని, రహదారులపైకి నీరు చేరిన ప్రాంతాల్లో ప్రజలు రవాణా చేయడానికి అవకాశం లేకుండా బారికేడింగ్, ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.మహబూబాబాద్ జిల్లాలో జమాండ్లపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులును అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలను వెంటబెట్టుకుని జమాండ్లపల్లె వాగు వరద ఉధృతిని మంత్రి పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు.

కృష్ణమ్మ ఉరకలు ..జూరాలకు 15000క్యూసెక్కలు
భారీ వర్షాలతో కృష్ణానదిలోకూడా వరదనీరు ఉరకలేస్తోంది. ఎగువన అల్మట్టి ప్రాజెక్టులోకి 1,38,470క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టులో నీటి నిలువ 88టిఎంసీలకు చేరుకుంది. నారాయణపూర్ ప్రాజెక్టులోకి 91000క్యూసెక్కువ ఇన్‌ఫ్లో ఉండగా, ప్రాజెక్టులో నీటినిలువ 22.77టిఎంసీలకు పెరిగింది. ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టులోకి 15000క్యూసెక్కుల నీరు చేరుతుండగా విద్యుత్ ఉత్పత్తి అనంతరం దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.శ్రీశైలం ప్రాజెక్టులోకి 8081క్యూసెక్కుల నీరు చేరుతోంది.
ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్ల ఎత్తివేత:
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట్) లకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ రెండు రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే గత శుక్రవారం మొదటి సారిగా హిమాయత్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అయితే బుధవారం ఎగువ ప్రాంతం నుంచి ఎక్కువగా వరద నీరు రావడంతో తాజాగా ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లు ఒక ఫీటు మేర ఎత్తి నీరు దిగువకు వదులుతున్నారు. వాతావరణ శాఖ మరో రెండు రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ముందస్తు చర్యగా గండిపేట్ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తారు. హిమాయత్ సాగర్ గేట్లు కూడా ఎత్తివేశారు.

గతేడాది భారీగా వర్షాలు కురవడంతో రెండు రిజర్వాయర్లకు భారీగా వరద నీరు వచ్చింది. దీంతో ఇరు జలాశయాల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. 2022 జులై 10 న మొదటి సారి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. తర్వాత వర్షాభావ పరిస్థితుల్ని బట్టి అక్టోబరు 26 న మొత్తం గేట్లు మూసివేశారు. ఈ ఏడాది జులై 21 న మొదటి సారి రెండు గేట్లు ఎత్తారు. ప్రస్తుతం రిజర్వాయర్ కు 1200 క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతోంది. రెండు గేట్లు ఒక అడుగు మేర ఎత్తి 1350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలని ఎండీ ఆదేశం:
జంట జలాశయాల గేట్లు (హిమాయత్ సాగర్ -2, ఉస్మాన్ సాగర్ – 2 గేట్లు) ఎత్తడంతో దాదాపు 1566 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఎండీ దానకిశోర్ సంబంధిత జలమండలి అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలు, జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
రాష్ట్రానికి అతిభారీ వర్షాలు ..రెడ్ అలర్ట్ జారీ
ఉపరితల ఆవర్తనాలు ,అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల 24గంటలు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మం ,నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొమరంభీం,భద్రాద్రి కొత్తగూడెం , మంచిర్యాల , నిజామాబాద్, వరంగల్ హన్మకొడ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

రాష్ట్రంలో ఉరుములు , మెరుపులు గంటకు 50కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 24గంటలుగా రాష్ట్రంలో అత్యధికంగా కొత్తగూడెం జిల్లా కర్కగూడెంలో 227.8 మి.మి వర్షం కురిసింది.సత్యనారాయణ పురంలో 144, బయ్యారంలో 140, సుజాతానగర్‌లో 138, అలుబకలో 133, వావిలాలలో 132, జాఫర్‌గడ్‌లో 129, ఎల్లందులో 118, ముకుందాపురంలో 117, కల్లెడలో 117 మి.మి వర్షం కురిసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వివరాలు: (సాయంత్రం 6 గంటల వరకు)
పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 1761.20 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.970 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 2.472 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 1200 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 1350 క్యూసెక్కులు
మొత్తం గేట్ల సంఖ్య : 17
ఎత్తిన గేట్ల సంఖ్య : 02

ఉస్మాన్ సాగర్ (గండిపేట్) రిజర్వాయర్ వివరాలు:
పూర్తి స్థాయి నీటి మట్టం : 1790.00 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 1787.15 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 3.900 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 3.253 టీఎంసీలు
ఇన్ ఫ్లో :: 800 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 216 క్యూసెక్కులు
మొత్తం గేట్ల సంఖ్య : 13
ఎత్తిన గేట్ల సంఖ్య : 02

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News