న్యూఢిల్లీ: గిగ్ , ప్లాట్‌ఫారమ్ కార్మికులకు సామాజిక భద్రతను నిర్ధారించడానికి వివిధ మార్గాలను “చురుకుగా” అన్వేషిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదివారం తెలిపింది. అసంఘటిత కార్మికుల కోసం డేటాబేస్ అయిన ‘ఈ-శ్రమ్’లో వాటిని నమోదు చేయడం ప్రారంభించాలని అగ్రిగేటర్లను కోరింది.
సర్వీస్ సెక్టార్ లో స్వతంత్ర కాంట్రాక్టర్ లేక ఫ్రీలాన్సర్ మాదిరి తాత్కాలికంగా ఉద్యోగం చేసే వ్యక్తిని గిగ్ వర్కర్ అంటుంటారు. తనకు వీలున్న సమయంలో పనిచేయడం, ఇంటి నుంచి పనిచేయడం, తనకు తానే బాస్ వంటి సౌలభ్యాలు గిగ్ వర్కర్ కు ఉంటుంది. ఫుల్ టైమర్స్ కలలు కనే సౌఖర్యాలన్నీ వీరికుంటాయి.
కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశంలో ప్రణాళికలను ప్రకటించారు. “మా వర్క్ ఫోర్స్ లో కీలకమైన భాగమైన గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికుల శ్రేయస్సుకు మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది” అని ఆయన అన్నారు. వారికి కావాల్సిన సామాజిక భద్రత కల్పించేందుకు సమగ్ర వ్యూహంతో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.
గిగ్ , ప్లాట్‌ఫారమ్ కార్మికులను నియమించే కంపెనీలు తమ కార్మికులను ఈ పోర్టల్‌లో నమోదు చేయడంలో ముందుండాలని కోరతామని మాండవ్య తెలిపారు. “సాఫీగా , సమర్థవంతమైన నమోదు ప్రక్రియను నిర్ధారించడానికి అగ్రిగేటర్ల కోసం ఆన్‌లైన్ విండో అందుబాటులో ఉంచుతాం’’ అని అన్నారు.
“భారతదేశంలోని ప్రతి కార్మికునికి, వారి ఉద్యోగ హోదాతో సంబంధం లేకుండా, సామాజిక భద్రత హక్కును కల్పించాలని మేము నిశ్చయించుకున్నాము” అని ఆయన అన్నారు. పనికి సంబంధించిన అభివృద్ధి చెందుతున్న స్వభావానికి అనుగుణంగా, గిగ్,ప్లాట్‌ఫారమ్ కార్మికులకు తగిన రక్షణను అందించే బలమైన ఫ్రేమ్‌వర్క్ ను అభివృద్ధి చేయడానికి కార్మిక , ఉపాధి మంత్రిత్వ శాఖ అన్ని స్టేక్ హోల్డర్లతో కలిసి పని చేస్తోందన్నారు.